Chandrababu : కీలక సమావేశం ప్రారంభం.. నేడు తేలనుందా?
జనసేన, బీజేపీ నేతలు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నివాసానికి చేరుకున్నారు
జనసేన, బీజేపీ నేతలు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నివాసానికి చేరుకున్నారు. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో కొద్దిసేపటి క్రితం ఈ సమావేశం ప్రారంభమయింది. టీడీపీ, బీజేపీ, జనసేన పొత్తు అధికారికంగా ఖరారు కావడంతో సీట్లు, సర్దుబాట్లు, అభ్యర్థులపై చర్చలు జరిపేందుకు నేడు మూడు పార్టీల ముఖ్య నేతలు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఏఏ స్థానాల్లో పార్టీలు పోటీ చేయాలన్న దానిపై స్పష్టత వచ్చే అవకాశముంది. బీజేపీ, జనసేనలు తాము బలమున్న ప్రాంతాల్లో పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నాయి.
మూడు పార్టీలు కలసి...
బీజేపీ అత్యధికంగా పార్లమెంటు స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయించింది. ఆరు పార్లమెంటు స్థానాల్లో పోటీ చేయాలని ఒక నిర్ణయానికి వచ్చినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ సమావేశంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ నేతలు పవన్ కల్యాణ్, నాదెండ్ల మనోహర్, బీజేపీ నేతలు గజేంద్ర షెకావత్, బై జయంత్ పాండా, పురంద్రీశ్వరిలు పాల్గొన్నారు. ఈరోజు, రేపట్లో అభ్యర్థులపై కూడా స్పష్టత వచ్చే అవకాశముంది. ఇప్పటికే బీజేపీ, జనసేనలు కలసి 100 శాసనసభ నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించాయి. పార్లమెంటు స్థానాలను మాత్రం పెండింగ్‌లో పెట్టాయి.