ఒక్క సినిమాకు ఇన్ని అడ్డంకులా... జగన్ నియంత
సినిమాకు ఇబ్బంది కలిగించడం కోసం ప్రభుత్వం ప్రయత్నించడం తాను ఇప్పుడే చూస్తున్నానని జనసేన నేత నాదెండ్ల మనోహర్ అన్నారు.
ఒక సినిమాకు ఆర్థికంగా ఇబ్బంది కలిగించడం కోసం ప్రభుత్వం ప్రయత్నించడం తాను ఇప్పుడే చూస్తున్నానని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. అధికారాన్ని అడ్డంపెట్టుకుని జగన్ అహంకారంతో సినిమా థియేటర్ల వద్ద కర్ఫ్యూ వాతావరణాన్ని సృష్టించారన్నారు. భీమ్లా నాయక్ కు ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా అది విజయవంతమయిందని గుర్తు చేశారు. ప్రజా సమస్యలను పరిష్కరిస్తారని ప్రజలు నమ్మి అధికారాన్ని ఇస్తే జగన్ ప్రజా వ్యతిరేక పాలనను అందిస్తున్నారని నాదెండ్ల మనోహర్ ఫైర్ అయ్యారు. భీమ్లా నాయక్ సినిమా విషయంలో ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడిందన్నారు.
ప్రోత్సహిస్తామని చెప్పి....
సినీ పరిశ్రమను ప్రోత్సహిస్తామని చెప్పిన ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నటించిన సినిమా విషయంలో మాత్రం అభిమానులను నిరుత్సాహపర్చే విధంగా వ్యవహరించారన్నారు. అధికారులను అడ్డం పెట్టుకుని థియేటర్ల వద్ద భయభ్రాంతులు సృష్టించారని చెప్పారు. కక్ష పూరితంగా, నియంతలా వ్యవహరిస్తూ తన ఆలోచన మేరకు అధికారులు పనిచేయాలనడం జగన్ కు తగదని నాదెండ్ల మనోహార్ అన్నారు. ప్రజాస్వామ్యాన్ని నమ్మే వైసీపీ నాయకులు ఇప్పటికైనా ఆ పార్టీ నుంచి బయటకు వచ్చి తమతో పని చేయాలని నాదెండ్ల మనోహర్ పిలుపునిచ్చారు.