వచ్చే నెలలో జనసేన ప్లీనరీ.... భారీగానేనట
జనసేన వచ్చే నెలలో ప్లీనరీ నిర్వహించనుంది. పార్టీ ఆవిర్భావం దినోత్సవం రోజున జనసేస ప్రత్యేక కార్యక్రమాలను రూపొందించుకుంది
జనసేన పార్టీ వచ్చే నెలలో ప్లీనరీ నిర్వహించనుంది. పార్టీ ఆవిర్భావం దినోత్సవం రోజున జనసేస ప్రత్యేక కార్యక్రమాలను రూపొందించుకుంది. వచ్చే నెల 14వ తేదీకి జనసేన ఏర్పడి ఏడేళ్లు పూర్తి కావస్తుంది. ఈ నేపధ్యంలో పార్టీ కార్యకర్తలు, క్యాడర్ తో సమావేశం కావాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ నిర్ణయించారు. మంగళగిరిలోనే ప్లీనరీ నిర్వహించాలని పవన్ కల్యాణ్ నిర్ణయించారు. రెండు రోజుల పాటు నిర్వహించేలా ప్లాన్ చేస్తున్నారు.
ప్రత్యేక ఏర్పాట్లతో...
దాదాపు పది ఎకరాల్లో ఈ ప్లీనరీని నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారని తెలిసింది. ఇటీవల పార్టీ రాజకీయ కార్యదర్శి నాదెండ్ల మనోహర్ పలు స్థలాలను పరిశీలించి వెళ్లారు. ముఖ్యనేతలతో పాటు ఆహ్వానం ఉన్న వారికి మాత్రమే ఈ కార్యక్రమంలోకి ప్రవేశం ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. అవసరమైతే ప్లీనరీకి బయట ప్రత్యేకంగా వేదికను ఏర్పాటు చేసి, అక్కడకు పవన్ అభిమానులు వస్తే ఆయన స్వయంగా వచ్చి వారికి కన్పించేలా కూడా ఏర్పాటు చేయాలని ఆలోచనలో ఉన్నారు. కరోనా వైరస్ పూర్తిగా తగ్గుముఖం పట్టడంతో ఇక ప్లీనరీని భారీఎత్తున నిర్వహించాలని జనసేన అధినేత భావిస్తున్నారు.