TDP : కన్నా లక్ష్మీనారాయణకు ఇక ఆశలు అడుగింటినట్లేనటగా
సీనియర్ నేత కన్నా లక్ష్మీనారాయణకు ఇక మంత్రి పదవి దక్కే అవకాశాలు లేవు.;

సీనియర్ నేత కన్నా లక్ష్మీనారాయణకు ఇక మంత్రి పదవి దక్కే అవకాశాలు లేవు. ఎందుకంటే ఇప్పటికే కాపు సామాజికవర్గం కోటాలో అనేక మంది ఉండటంతో ఆయనకు ఈ టర్మ్ లో మంత్రిపదవి దక్కడం అనేది అసంభవమేనని చెప్పాలి. ఇటు జనసేన, అటు బీజేపీ, మరొకవైపు టీడీపీలోనూ కాపు సామాజికవర్గానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. ఎమ్మెల్సీ పదవుల విషయంలోనూ, మంత్రి పదవుల విషయంలోనూ కాపులకే ఈ మూడు పార్టీలు ఇప్పటికే ప్రాధాన్యత ఇచ్చాయి. దీంతో కన్నా లక్ష్మీనారాయణకు ఒకవేళ విస్తరణ జరిగినా మంత్రి పదవి దక్కే అవకాశం దాదాపు శూన్యమనే చెప్పాలి. ఎందుకంటే చంద్రబాబు కేబినెట్ లో ఇప్పటికే నలుగురు కాపు సామాజికవర్గానికి చెందిన వారుండటంతో పాటు నాగబాబుకు కూడా మంత్రి పదవి ఇస్తే ఐదుగురు అవుతారు.
అనేక మంది నేతలు...
పవన్ కల్యాణ్, కందుల దుర్గేశ్ జనసేన నుంచి మంత్రి వర్గంలో ఉండగా, నిమ్మల రామానాయుడు, పొంగూరు నారాయణ టీడీపీ నుంచి ఉన్నారు. ఇటీవల ఎమ్మెల్సీ పోస్టుల్లోనూ జనసేన నాగబాబుకు అవకాశమివ్వగా, బీజేపీ అదే సామాజికవర్గానికి చెందిన సోము వీర్రాజుకు ఇచ్చింది. ఇక కేబినెట్ లో ఉన్న నిమ్మల రామానాయుడు,నారాయణలు ఇద్దరూ చంద్రబాబుకు అత్యంత ఇష్టులు.నమ్మకమైన నేతలు. వారిని కాదని మరొక కాపు సామాజికవర్గం నేతకు మంత్రి పదవి ఇచ్చే అవకాశం లేదు. అందుకే కన్నా లక్ష్మీనారాయణ కు మంత్రి పదవి దక్కే అవకాశాలు దాదాపు మూసుకుపోయినట్లేనని ఏపీ పాలిటిక్స్ తెలిసిన వారు ఎవరైనా చెప్పక తప్పదు.
కాపు సామాజికవర్గంలోనూ...
సీనియర్ మోస్ట్ నేత అయిన కన్నా లక్ష్మీనారాయణ కాంగ్రెస్ లో ప్రభుత్వం ఏర్పడినప్పుడల్లా గుంటూరు జిల్లా కోటా కింద మంత్రి అయ్యే వారు. సీనియారిటీ మాత్రమే కాకుండా సామాజికవర్గం కూడా అదనపు బలం అయి కన్నా లక్ష్మీనారాయణకు ప్రతిసారీ మంత్రి పదవి దక్కేది. కానీ ఈసారి పార్టీలు మారినా, అధికారంలోకి వచ్చినా ఫలితం కనిపించడం లేదు. కన్నా లక్ష్మీనారాయణ రాష్ట్ర విభజనకు ముందు కూడా మంత్రివర్గంలో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు. కానీ రెండేళ్ల తర్వాత ఆయనను పదవి నుంచి తొలగించడంతో మనస్తాపం పొందిన కన్నా లక్ష్మీనారాయణ టీడీపీలో చేరారు. కన్నా లక్ష్మీనారాయణ జనసేనలో చేరతారని అనుకున్నా అనూహ్యంగా తెలుగుదేశం పార్టీలో చేరారు. కోడెల కుటుంబాన్ని కాదని సత్తెనపల్లి టిక్కెట్ ఇచ్చారు. ఇక అధికారంలోకి రాగానే తనకు మంత్రి పదవి గ్యారంటీ అనుకున్నారు.
జిల్లా కోటాలోనూ...
కానీ టీడీపీ కోటాలో దక్కించుకున్న ఇద్దరిలో నిమ్మల రామానాయుడు కాపు సామాజికవర్గమైనా మూడుసార్లు గెలిచి పార్టీకోసం అత్యంత నమ్మకంగా పనిచేశారు. పొంగూరు నారాయణను చంద్రబాబును వేరు చేసిచూడలేం. కాపు సామాజికవర్గంలో ఎక్కువ మంది నేతలుండటం వల్ల కన్నా లక్ష్మీనారాయణకు మంత్రి పదవి దూరమయిందనే అనుకోవాలి. ఆయన కూడా ఇక మంత్రి పదవి పై ఆశలు వదులుకున్నట్లే కనిపిస్తుంది. అందుకే పెద్దగా పార్టీలోనూ యాక్టివ్ గా ఈ మధ్యకాలంలో కనిపించడం లేదు. దీంతోపాటు గుంటూరు జిల్లా నుంచి నాదెండ్ల మనోహర్, నారా లోకేశ్ కేబినెట్ లో ఉండటంతో జిల్లా కోటాలోనూ అసాధ్యమనే చెప్పాలి. అందుకే కన్నాకు పాపం.. సీనియారిటీ కంటే సిన్సియారిటీ శాపంగా మారిందనే చెప్పాలి.