Chandrababu : జగన్ లాగానే చంద్రబాబు దూరం చేసుకుంటున్నారా? ఒక టీడీపీ అభిమాని పోస్టు వైరల్
చంద్రబాబు నాయుడు కూడా జగన్ తరహా రాజకీయాలు చేయడమేంటని టీడీపీలోని సోషల్ మీడియాలోనే ప్రశ్నిస్తున్నారు;

నాటి ప్రభుత్వంలో వైఎస్ జగన్ నా ఎస్.సిలు, నా బీసీలు, నాఎస్టీలంటూ ప్రతి చోట నినాదాలు చేసేవారు. పేదరికంతో సంబంధం లేకుండా జగన్ నాడు తీసుకున్న కొన్ని నిర్ణయాలతో మిగిలిన వర్గాలు దూరమయ్యాయి. ప్రధానంగా రెడ్డి సామాజికవర్గంతో పాటు అగ్రకులాలన్నీ దూరం కాగా, నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీలన్నవారు కూడా జగన్ కు చేరువ కాలేదు. ఫలితంగా మొన్నటి ఎన్నికల్లో జగన్ దారుణంగా ఓడిపోయారన్న విశ్లేషణలు వినపడుతున్నాయి. అన్ని వర్గాలను కలుపుకుని పోతూ, పేదరికంలో కులాలు, మతాలు చూడకుండా ఉండాలన్నది అందరి ఆలోచన. అలా చేయకపోబట్టే జగన్ తాను ఎన్ని సంక్షేమ పథకాలను అమలు చేసినా గెలుపును అందుకోలేకపోయారు.
అదేతరహాలో...
ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా అదే తరహా రాజకీయాలు చేయడమేంటని టీడీపీలోని సోషల్ మీడియాలోనే ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయాలతో కొన్ని వర్గాలు దూరమయ్యే అవకాశముందన్న హెచ్చరికలు వినపడుతున్నాయి. సోషల్ మీడియాలో కూడా తెలుగుదేశం పార్టీకి చెందిన కార్యకర్తలు, నేతలు కూడా చంద్రబాబు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పోస్టులు పెడుతున్నారంటే అందుకు జాగ్రత్తలు పడాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెబుతున్నారు. లేకుంటే జగన్ కు పట్టిన గతే టీడీపీకి కూడా పడుతుందని తెలుగు తమ్ముళ్లు హెచ్చరిస్తున్నారు. అందుకే ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలంటూ చంద్రబాబుకు పరోక్షంగా హెచ్చరికలు జారీ చేస్తున్నారు.
ఈ పోస్టు చూస్తే..?
సోషల్ మీడియాలో ఒక పోస్టింగ్ ఇలా కనపడుతుంది. "చంద్రబాబు చేసే పనులు ఇట్లాగే ఉంటాయి పవర్ హ్యాండ్ లూమ్ కి ఉచిత విద్యుత్ ఇవ్వచ్చు. కానీ చం నేతన్న ఇళ్లకు కూడా ఉచితంగా విద్యుత్తు ఇస్తానంటున్నారు. వాళ్ల ఓట్లు ఒక నాలుగు లక్షలు ఉంటాయి వీళ్ళకిస్తే మిగతా బీసీ కులాలు కోటి పైన ఓట్లు పోగొట్టుకుంటారు. హ్యూమన్ సైకాలజీ చదివి రాజకీయాల్లోకి రావాలి. ఆ వర్గం నాలుగు ఐదు లక్షలు ఓట్లలో మనకు ఒక 65% పడి ఉంటే జగన్ కు 35% పడి ఉంటాయి . చంద్రబాబు ఇప్పుడు ఉచిత విద్యుత్ ఇస్తానంటున్నాడు. ఇళ్ళకి ఆయన ఉచిత విద్యుత్తు ఇచ్చిన ఒక ఫైవ్ పర్సెంట్ మారుతాయి అంటే ఒక 25 వేల ఓట్లు మారుతాయి కానీ 30 నుంచి 40 లక్షల కోట్లు యాంటీ అవుతాయి. ఈ చిన్న లాజిక్ మర్చిపోతే ఎట్లా?" అని ప్రశ్నించారు. "మా ఊళ్లో కరుడుగట్టిన వైసిపి వాడికి సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చారు. అతనికి పని చేసి పెట్టారని 100 మంది కార్యకర్తలు యాంటీ అయిపోయారు" అంటూ పోస్టు వైరల్ గా మారింది.