Summer Effect : హీట్ వేవ్స్ తరుముకొస్తున్నాయ్.. జాగ్రత్త పడకపోతే అంతేనట
మొన్నటి వరకూ వర్షం కురియడంతో కొంత చల్లబడిన వాతావరణం మళ్లీ ఒక్కసారిగా వెడెక్కింది.;

మొన్నటి వరకూ వర్షం కురియడంతో కొంత చల్లబడిన వాతావరణం మళ్లీ ఒక్కసారిగా వెడెక్కింది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది. భారీగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గరిష్టంగా మళ్లీ నలభై డిగ్రీల ఉష్ణోగ్రతలు దాటుతుండటంతో ప్రజలు బయటకు వచ్చేందుకే భయపడిపోతున్నారు. ఉదయం ఎనిమిది గంటల నుంచే ఉష్ణోగ్రతలు గరిష్టానికి చేరుకుంటుండటంతో పాటు వేడి గాలులు కూడా ప్రజలకు ఇబ్బందికరంగా మారాయి. వర్షం పడిన తర్వాత ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయిన వాతావరణ శాఖ చేసిన హెచ్చరికలు నిజమయ్యేటట్లే కనిపిస్తున్నాయి.
ఉక్కపోత.. వేడిగాలులు...
ఉక్కపోత మళ్లీ మొదలయింది. నిన్న మొన్నటి వరకూ చల్లటి గాలులతో సేదతీరని ప్రజలు తిరిగి ఏసీలు ఆన్ చేసుకుంటున్నారు. రానున్న కాలంలో ఎండల తీవ్రత మరింత పెరిగే అవకాశముందని, ఉష్ణోగ్రతలు 42 నుంచి 45 డిగ్రీల వరకూ అనేక ప్రాంతాల్లో నమోదవుతాయని కూడా వాతావరణ శాఖ పేర్కొంది. ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ, గుంటూరు, ప్రకాశం, చిత్తూరు, అనంతపురం, కడప, కర్నూలు జిల్లాల్లో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది.
తెలంగాణాలో ఈ ప్రాంతాల్లో...
తెలంగాణాలోనూ ఎండల తీవ్రత పెరుగుతుందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. ఉష్ణోగ్రతలు రోజు వారీ కంటే రెండు నుంచి మూడు డిగ్రీలు పెరిగే అవకాశముందని తెలిపింది. వడగాలుల తీవ్రత కూడా పెరుగుతుందని, ప్రజలు అందుకు అవసరమైన జాగ్రత్తలు పాటిస్తూ బయటకు రావాల్సి ఉంటుందని సూచిస్తుంది. ఆదిలాబాద్, నల్లగొండ, ఖమ్మం, కరీంనగర్ జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని, మహబూబ్ నగర్ జిల్లాతో పాటు మెదక్, నిజామాబాద్, వరంగల్ వంటి జిల్లాల్లోనూ నలభై డిగ్రీల ఉష్ణోగ్రతలు దాటే అవకాశముందని తెలిపింది.