Tirumala : తిరుమల లడ్డూ వివాదంలో అనేక సందేహాలు.. అనేక అనుమానాలు

తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డూ కల్తీ దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది.

Update: 2024-10-03 04:21 GMT

 laddu adulteration in tirumala

తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డూ కల్తీ దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. కోట్లాది మంది సెంటిమెంట్ కావడంతో అది ముఖ్యమంత్రి చంద్రబాబు కల్తీ జరిగిందని ప్రకటించిన వెంటనే వేగంగా నిరసన మంటలు వ్యాపించాయి. నాటి వైసీపీ ప్రభుత్వంపై జాతీయ వ్యాప్తంగా నిరసనలు వినిపించాయి. జగన్ కు వ్యతిరేకంగా రోడ్ల మీదకు భక్తులు వచ్చారు. ఆంధ్రప్రదేశ్ లోని కూటమి పార్టీల నేతలు, కార్యకర్తలు మాత్రమే కాదు. పొరుగున ఉన్న తెలంగాణ రాష్ట్రంలోనూ నిరసనలు వెల్లువెత్తాయి. దాదాపు పదిహేను రోజుల పాటు అధికార, విపక్ష నేతల మధ్య వాదనలు, ప్రతివాదనలు లడ్డూ వివాదంపై కొనసాగాయి.

రేపు తీర్పు...
కానీ చివరకు సుప్రీంకోర్టుకు ఈ వివాదం చేరడంతో నేడు కీలక నిర్ణయం రానుంది. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్పెషల్ ఇన్విస్టిగేషన్ టీంతో విచారణ కొనసాగించాలా? లేక స్వతంత్ర దర్యాప్తు సంస్థకు ఈ వివాదంపై విచారణను అప్పగించాలా? అన్న దానిపై నేడు సుప్రీంకోర్టులో నిర్ణయం వెలువరించనుంది. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ బృందం తమ విచారణను కూడా వాయిదా వేసుకుంది. సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత ముందుకు వెళ్లాలని నిర్ణయించడంతో నేడు అందరి చూపు సుప్రీం కోర్టు నిర్ణయంపైనే ఉంది. సిట్ దర్యాప్తు చేపడుతుందా? లేదా స్వతంత్ర దర్యాప్తు సంస్థ విచారణ జరుపుతుందా? అన్నది తేలనుంది.
అయితే లడ్డూ వివాదంలో కీలకమైన సందేహాలు :
తమిళనాడుకు చెందిన ఏఆర్ డెయిరీ పంపిణీ చేసిన నెయ్యిలో కల్తీ జరిగిందా?
సెకండ్ ఒపీనియన్ గా మైసూర్ ఫుడ్ ప్రాసెసిండ్ డెవలెప్‌మెంట్ కు ఎందుకు పంపలేదు?
పంది కొవ్వు కలసిన నెయ్యిని తిరుమల లడ్డూలో వాడారా?
ఎప్పుడు వాడారు? ఏ తేదీన వినియోగించారో తిరుమల సిబ్బందికైనా తెలుసా?
జంతువుల నూనె వాడితే దుర్వాసన వెలువడుతుందని నిపుణులు చెబుతున్నారు.
భక్తులు ఇచ్చిన ఫిర్యాదులు టీటీడీ దగ్గర ఉన్నాయా?
లిఖిత పూర్వకంగా భక్తులు సమాచారం ఇచ్చారా? లేక ఓరల్ గా చెప్పారా?
కల్తీ నెయ్యితో ఎన్ని లడ్డూలు తయారయి ఉంటాయి?
ఈ లడ్డూలను భక్తులకు మాత్రమే పంపిణీ చేశారా? లేక తీసేశారా?
వీటికి సమాధానాలు దొరికితేనే?
వీటన్నింటికి సమాధానాలు దొరికితేనే తిరుమల లడ్డూ వివాదానికి తెరపడుతుంది. ఈ ప్రశ్నలకు సరైన జవాబులు రానంత కాలం తిరుమల లడ్డూ వివాదం కొనసాగుతూనే ఉంటుంది. అధికార పార్టీ లడ్డూ లో కల్తీ జరిగిందని, వైసీపీ లేదంటూ వాదనలకు దిగే అవకాశముంది. ఈ నేపథ్యంలో ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత తిరుమల తిరుపతి దేవస్థానంపైనే ఉంది. సుప్రీంకోర్టు చేసిన కామెంట్స్ తో వైసీపీ ఒకింత పండగ చేసుకుంటున్నప్పటికీ రేపటి విచారణ, తీర్పు పై అన్ని రాజకీయ పార్టీల్లో ఉత్కంఠ నెలకొంది.
Tags:    

Similar News