Ys Jagan : ఇలాంటి వారికా పదవులిచ్చింది జగనూ... క్లిష్ట సమయంలో హ్యాండ్ ఇస్తున్నారుగా?

జగన్ అధికారంలో ఉన్ననాళ్లు పదవులు అనుభవించిన నేతలు ఇప్పుడు పవర్ పోగానే పార్టీని వదిలిపోతున్నారు.

Update: 2024-08-29 08:06 GMT

అధికారంలో ఉన్ననాళ్లు పదవులు అనుభవించిన నేతలు ఇప్పుడు పవర్ పోగానే పార్టీని వదిలిపోతున్నారు. పెద్ద పెద్ద నేతలే పార్టీని వదిలివెళుతున్నప్పుడు ఇక కిందిస్థాయి నేతల గురించి ఆలోచించాల్సిన పనిలేదేమో. ఎందుకంటే మేయర్లు, కార్పొరేటర్లు పార్టీలు మారడం సర్వసాధారణం. అలాగే సర్పంచ్ లు, ఎంపీటీసీ, జడ్‌పీటీసీలు, వివిధ సంస్థల ఛైర్మన్లు కూడా ఐదేళ్లు అధికార పార్టీలో ఉండాలని కోరుకుంటారు. ఇదంతా ఒక ఎత్తయితే జగన్ అసలు ఏరికోరి పదవులు ఇచ్చిన వాళ్లే కష్ట సమయంలో కాడిని వదిలేసి వెళ్లడం నిజంగా జగన్ ఎంపికలో లోపమేనని అంటున్నారు. పార్టీ విధేయత, తన పట్ల నమ్మకం ఉన్న వారిని పక్కన పెట్టి మరీ పదవులు ఇచ్చి ఇప్పుడు వారిని అనుకుని ఏం లాభం అన్న ప్రశ్న తలెత్తుతుంది.

ఎమ్మెల్యే అయ్యారంటే...
నిజానికి కిలారి రోశయ్య ఎమ్మెల్యే అయ్యారంటే అది జగన్ చలవే. ఎందుకంటే జగన్ 2019 లో సీటు ఇవ్వకపోతే కిలారి రోశయ్య అసలు రాజకీయాల్లోకి వచ్చేవారే కాదు. ఆయనకున్న ఏకైక క్వాలిఫికేషన్.. సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అల్లుడు కావడమే. ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు తొలి నుంచి పార్టీని నమ్ముకుని ఉండటంతో ఆయన ముఖం చూసి జగన్ కిలారి రోశయ్యకు టిక్కెట్ ఇచ్చారన్నది అందరికీ తెలిసిందే. అలాగే ఆయన సొంత బలం మీద నాటి ఎన్నికల్లో గెలవలేదన్నది కూడా అంతే నిజం. నాడు 151 స్థానాలు వచ్చాయంటే అప్పుడు జగన్ చేసిన పాదయాత్రతో పాటు ఫ్యాన్ గాలి బలంగా వీయడంతోనే కిలారి రోశయ్య గెలిచాడు.
రాజీనామాలు ఎందుకు?
అయితే ఇప్పుడు ఏం మునిగి పోయిందని కిలారి రోశయ్య పార్టీకి రాజీనామా చేయాల్సి వచ్చిందని ఒక సీనియర్ నేత ప్రశ్నించడం ఇందుకు అద్దం పడుతుంది. ఆయనకు ఎమ్మెల్యే పదవి ఇచ్చినందుకు, రెండో సారి ఎంపీ అభ్యర్థిగా అవకాశం ఇచ్చినందుకు పార్టీకి రాజీనామా చేశారా? అని ప్రశ్నిస్తున్నారు. నిజానికి కిలారి రోశయ్యకు అప్పటి వరకూ రాజకీయ చరిత్ర లేదని ఆయనకు తెలుసు. అందరికీ తెలుసు. కానీ వైసీపీ వల్లనే ఎమ్మెల్యేగా అయినా గెలిచారంటారు. అలాంటి కిలారి రోశయ్య ఇప్పుడు రాజీనామా చేసి వేరే పార్టీకి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. జగన్ కు ఇప్పుడు అర్థమయి ఉండాలి. అలాగే అన్ని సార్లు పదవులు ఇచ్చిన ఆళ్లనాని కూడా అంతే.
ఈ నేతలందరూ...
ఇక మోపిదేవి వెంకటరమణ, ఆళ్ల నాని కూడా పార్టీ నుంచి వైదొలిగారు. గతంలో డొక్కా మాణిక్య వరప్రసాద్ కూడా టీడీపీ నుంచి వచ్చి వైసీపీలో చేరారు. ఆయన ఖాళీ చేసిన పదవిని ఆయనకే ఇచ్చారు వైెస్ జగన్. పోతుల సునీత కూడా అంతే. టీడీపీలో నుంచి వైసీపీలోకి వచ్చిన ఎమ్మెల్సీ పదవి తిరిగి ఆమెకే ఇచ్చారు. కానీ ఇప్పుడు ఆమె పార్టీని వదిలిపోయారు. ఇక పిఠాపురం నియోజకవర్గంలో పెండెం దొరబాబు పరిస్థితి కూడా ఇంచుమించుగా అంతే. ఇక బీద మస్తాన్ రావు కూడా టీడీపీ నుంచి వైసీపీలో చేరిన వెంటనే రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఇప్పుడు ఆయన పార్టీలకు రాజీనామాలు చేసి వెళ్లిపోయారు. ఇలా పదవులు ఇచ్చిన వారే వెళ్లిపోతున్నారు.


Tags:    

Similar News