Ys Jagan Liqour Case : మద్యం కేసు వైఎస్ జగన్ మెడకు చుట్టుకోనుందా?

వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం కుంభకోణం ఇప్పుడు పార్టీ అధినేత జగన్ మెడకు చుట్టుకునేలా ఉంది

Update: 2024-08-23 08:10 GMT

వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం కుంభకోణం ఇప్పుడు పార్టీ అధినేత జగన్ మెడకు చుట్టుకునేలా ఉంది. మద్యం విషయంలో జగన్ ప్రభుత్వం చేసిన తప్పులు ఇప్పుడు చంద్రబాబు సర్కార్ వెలికి తీస్తుంది. ప్రభుత్వ ఆధ్వర్యంలో మద్యం దుకాణాలను నడపటంతో పాటు కేవలం నగదును మాత్రమే తీసుకోవడం కూడా వివాదాస్పదంగా మారింది. ప్రభుత్వఆధ్వర్యంలో మద్యం దుకాణాలను నిర్వహించడం ఎవరూ తప్పు పట్టరు. కానీ నగదును తీసుకుంటూ, డిజిటల్ పేమెంట్ ను నిరాకరించడంతో అందరిలోనూ అనుమానాలు బయలుదేరాయి. వాటిని నిజమని నమ్మేటట్లు గత ఐదేళ్లలో పెద్దయెత్తున ఆర్థిక లావాదేవీలు జరిగడం కూడా సందేహాలకు తావిస్తుంది.

ఓటమికి ప్రధాన కారణం....
ఇక గత ఐదేళ్లలో మద్యం ధరలను విపరీతంగా పెంచడం కూడా వైసీపీ ఓటమికి ఒక కారణంగా చెబుతున్నారు. సామాన్య, పేద, మధ్యతరగతి ప్రజలు మద్యానికి అలవాటు పడటంతో తాము రోజువారీ సంపాదన అంతా మద్యానికే వెచ్చించాల్సి రావడం కూడా కొన్ని లక్షల కుటుంబాల్లో వ్యతిరేకత రావడానికి కారణమయిందన్నది ఫలితాల తర్వాత విశ్లేషణల్లో వెల్లడయింది. దీంతో పాటు అన్ని బ్రాండ్లను కాకుండా కేవలం కొన్ని బ్రాండ్లను అందుబాటులోకి తీసుకు రావడం కూడా వైసీపీ ప్రభుత్వం పై అసంతృప్తి పెరగడానికి కారణమయిందన్నది కాదనలేని వాస్తవం. అప్పటి వరకూ ఉన్న నాణ్యత ఉన్న బ్రాండ్లను కాకుండా పిచ్చిపిచ్చి బ్రాండ్లతో వైఎస్ జగన్ ప్రభుత్వం సొమ్ము చేసుకుందన్న ఆరోపణలున్నాయి.
డిస్టలరీల కేటాయింపులో...
దీంతో పాటు డిస్టిలరీలు కూడా తమకు అనుకూలురైన వారికి అప్పగించారన్న టాక్ బలంగా ఉంది. అమెరికాలో 2019 ఎన్నికలకు ముందు వరకూ ఉన్న రాజ్ కసిరెడ్డి ఈ మద్యం వ్యవహరాలన్నీ చూసే వారంటున్నారు. ఆయన తో పాటు అనీష్ అనిరుధ్ కూడా ఇందులో భాగస్వామిగా ఉన్నారని సమాచారం. ఇవన్నీ పక్కా సమాచారం సేకరించి కేసు నమోదు చేయాలని కూటమి ప్రభుత్వం భావిస్తుంది. వైసీపీ ప్రభుత్వం ఓటమి పాలయిన తర్వాత రాజ్ కసిరెడ్డి తెలంగాణకు వెళ్లిపోయి అక్కడ కీలక నేత పంచన చేరారని చెబుతున్నారు. ఆయన రాయలసీమలో ఒక సామాజికవర్గానికి చెందిన యువతిని వివాహం చేసుకుని జగన్ కు దగ్గరయ్యారన్నది ఇప్పుడు వినిపిస్తున్న టాక్. ఆమె భారతికి బంధువుగా చెబుతున్నారు.
పెద్దయెత్తున అవినీతి...
లిక్కర్ అమ్కకాల్లో పెద్దయెత్తున అవినీతి జరిగిందని ఈ ప్రభుత్వం ఇప్పటికే సీఐడీకి బాధ్యతలను అప్పగించింది. విచారణలో ఈ విషయాలన్నీ వెలుగు చూసినట్లు సమాచారం. దీంతో పాటు డిస్టిలరీల కేటాయింపులో కూడా ఇలాంటిదే జరిగిందని, తన అనుచరులకే డిస్టిలరీలను కేటాయించి జగన్ వ్యక్తిగతంగా సొమ్ము చేసుకున్నారన్న ఆరోపణలున్నాయి. మిగిలిన కేసుల సంగతి ఎలా ఉన్నా లిక్కర్ కేసు విషయంలో జగన్ అడ్డంగా దొరికే అవకాశాలున్నాయని ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి చెప్పారు. అయితే అన్ని ఆధారాలు దొరికిన తర్వాతనే పూర్తి స్థాయిలో విషయాలను బయటపెట్టే అవకాశముందని తెలిసింది. కానీ వైసీపీ తాము మద్యాన్ని నియంత్రించడానికే ధరలు పెంచామని, ప్రజలకు దానికి దూరంగా ఉండాలనే ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పినప్పటికీ అందులో నిజానిజాలు మాత్రం విచారణలో వెలుగు చూడాల్సి ఉంది.


Tags:    

Similar News