Rain Alert : ఏపీకి హై అలెర్ట్.. తీర ప్రాంత అధికారులను అప్రమత్తం చేసిన సర్కార్

ఆంధ్రప్రదేశ్ లో నేటి నుంచి వర్షాలు పడే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది.

Update: 2024-11-26 03:41 GMT

ఆంధ్రప్రదేశ్ లో నేటి నుంచి వర్షాలు పడే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారడంతో వర్షాలు నమోదవుతాయని పేర్కొంది. దక్షిణ బంగాళాఖాతం,తూర్పు హిందూ మహాసముద్రం మధ్య భాగాల్లో వాయుగుండం కేంద్రీకృతమైంది. గంటకు 30కిమీ వేగంతో వాయుగుండం కదులుతుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. నిన్న ట్రింకోమలీకి ఆగ్నేయంగా 530 కిమీ, నాగపట్నానికి 810 కిమీ, పుదుచ్చేరికి 920 కిమీ, చెన్నైకి ఆగ్నేయంగా 1000 కిమీ దూరంలో కేంద్రీకృతమయిందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈరోజు వాయుగుండం తీవ్రవాయుగుండంగా బలపడే అవకాశం ఉందని చెప్పింది.

తీవ్ర వాయుగుండంగా మారి...
తీవ్ర వాయుగుండంగా బలపడిన తర్వాత రేపటి నుంచి వాయువ్య దిశగా తమిళనాడు, శ్రీలంక తీరాల వైపు వెళ్లే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. దీని ప్రభావంతో శుక్రవారం వరకు దక్షిణకోస్తా, రాయలసీమలో కొన్నిచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు పడే అవకాశముందని తెలిపారు. దక్షిణకోస్తాలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసేందుకు అవకాశం ఉందని కూడా తెలిపారు. ఈ నెల 29వ తేదీ వరకూ మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్ళకూడదని నిషేధాజ్ఞలు విధించారు. దక్షిణకోస్తా తీరం వెంబడి ఈరోజు గంటకు 50- నుంచి 70 కిలోమీటర్లు, ఎల్లుండి నుంచి 55 నుంచి 75 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది.
తీరప్రాంతంలో అధికారులను...
మరోవైపు ఏపీ ప్రభుత్వం అధికారులను అప్రమత్తం చేసింది. తీర ప్రాంతాల్లో అధికారులు అలెర్ట్ గా ఉండాలని, అవసరమైన ముందస్తు చర్యలు వెంటనే తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. వాయుగుండం కారణంగా ఈ నెల 29న విశాఖలో జరగాల్సిన ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన కూడా రద్దయింది. పిడుగులు పడే అవకాశముందని కూడా వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. భారీ వర్షాలు పడే అవకాశమున్నందున వరి కోతలు, ఇతర వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పండించిన ధాన్యాన్ని సురక్షిత ప్రదేశాల్లో ఉంచుకోవాలని కూడా తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు.




Tags:    

Similar News