Ap Politics : చంద్రబాబు స్కూలు సిలబస్ మార్చారుగా..ఇక జగన్ కు దబిడి దిబిడే

వైసీపీ అధినేత వైఎస్ జగన్ ను నిలువరించడానికి టీడీపీ అధినేత చంద్రబాబు పెద్ద గేమ్ ప్లాన్ రెడీ చేసినట్లే కనపడుుతుంది;

Update: 2025-01-12 05:46 GMT

ఇటీవల విశాఖపట్నంలో జరిగిన సభలో మోదీని ఉద్దేశించి చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు నిజమేననిపిస్తుంది. మీ స్కూల్.. నా స్కూల్ ఒకటేనని చంద్రబాబు అన్నది అభివృద్ధి.. విజన్ గురించి. అయితే ప్రత్యర్థిని కట్టడి చేయడానికి దూరం చేయడంలో కూడా ఇద్దరి స్కూలు ఒకటే. మోదీ మంత్రాంగంతోనే నేడు అనేక రాష్ట్రాల్లో కమలం పార్టీ జెంగా ఎగురగలిగింది. ఏ ఎన్నిక జరిగినా అది బీజేపీ ఖాతాలో పడటం సర్వసాధారణమయింది. జనాలకు కూడా ఇది పెద్దగా ఆశ్చర్య పోవాల్సిన పనిలేకుండా పోయింది. ఎందుకంటే ముందుగానే బీజేపీ విజయాన్ని అంచనా వేసుకుంటున్నారు. ఇప్పడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా అదే సిలబస్ ను పాటిస్తున్నట్లే కనిపిస్తుంది. ప్రత్యర్థులు బలంగా ఉన్న చోట వీక్ చేయడం లక్ష్యంా పెట్టుకున్నట్లు కనిపిస్తుంది. పైకి ఎవరికీ ఇది అర్థం కాకపోయినా లోతుగా అథ్యయనం చేసే రాజకీయ విశ్లేషకులకు మాత్రం ఇది సులువుగానే అర్థమవుతుంది.

ఎప్పుడు ఎన్నికలు వచ్చినా...?
ఎన్నికలు ఎప్పుడు జరిగినా తిరిగి కూటమి అధికారంలోకి రావాలన్నది చంద్రబాబు ఆలోచన. అందుకు మూడు పార్టీలూ కలసి పోటీ చేస్తాయి. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ లో జగన్ బలమైన శత్రువు. జగన్ ను అంత తేలిగ్గా చంద్రబాబు అంచనా వేయరు. ఎందుకంటే 2024 ఎన్నికల్లోనూ జగన్ ఒంటరిగా పోటీ చేసి 40 శాతం ఓట్లు తెచ్చుకున్నారంటే ఆషామాషీ కాదన్న సంగతి నలభై ఐదేళ్ల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబుకు తెలియంది కాదు. ఐదు శాతం ఓట్లు పెరిగినా సీట్లు గల్లంతవుతాయి. అందుకే జగన్ కు బలమైన ప్రాంతాల్లో చంద్రబాబు ఫోకస్ పెట్టినట్లు సమాచారం. ఇందుకోసం ప్రత్యేక స్ట్రాటజీలతో చంద్రబాబు వెళుతున్నట్లే కనిపిస్తుంది. ఒకవైపు పాలనను గాడిలో పెడుతూనే మరొక వైపు జగన్ ను మరింత బలహీనం చేసే ప్రయత్నంలో చంద్రబాబు నిరంతరం స్కెచ్ వేస్తుంటారన్నది కాదనలేని వాస్తవం.
పవన్ ను ప్రయోగించి...
అందులో భాగంగానే పవన్ కల్యాణ్ ను ప్రయోగించినట్లు సమాచారం. జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు యువతలోనూ, సామాజికవర్గంలోనూ బలమైన పట్టుంది. రాయలసీమలో జగన్ బలం తక్కువేమీ కాదు. అక్కడ రెడ్డి సామాజికవర్గం ఎక్కువ కావడంతో పాటు వైఎస్ రాజశేఖర్ రెడ్డి అభిమానంతో పాటు టీడీపీ వ్యతిరేక ఓట్ల శాతం ఒకింత ఎక్కువగానే ఉన్నాయి. కానీ గత ఎన్నికల్లో ఎప్పుడూ లేని విధంగా రాయలసీమలోనూ కూటమి అత్యధిక స్థానాల్లో విజయం సాధించడానికి పవన్ కల్యాణ్ కూడా ఒక కారణమని ఆయన నమ్ముతున్నారు. అందుకే జగన్ సొంత జిల్లా అయిన కడపలోనే కేవలం వైసీపీని మూడు సీట్లకే పరిమితం చేయగలిగామన్నా, ఎన్నడూ గెలవని సీట్లను గెలుచుకున్నా, సుదీర్ఘకాలం తర్వాత నియోజకవర్గాలను సొంతం చేసుకున్నా అందులో పవన్ కల్యాణ్ పాత్ర ఎక్కువగా ఉందని చంద్రబాబు విశ్వసిస్తున్నారు.
బలిజ సామాజికవర్గం ఓట్లను...
అందుకే రాయలసీమపై పవన్ కల్యాణ్ ను చంద్రబాబు ప్రయోగించినట్లే కనపడుతుంది. పవన్ కల్యాణ్ పర్యటించకున్నా ఉభయ గోదావరి జిల్లాల్లో కూటమి బలంగా ఉంటుంది. ఇక కోస్తాంధ్ర, ఉత్తరాంధ్రలలో తెలుగుదేశం పార్టీ పట్టు సడలదు. ఇక రాయలసీమలో దాదాపు యాభై రెండు నియోజకవర్గాల్లో అత్యధిక స్థానాలను సొంతం చేసుకోవాలంటే అంత సులువు కాదు. జగన్ ను దెబ్బకొట్టాలంటే అక్కడ ఉన్న మరో బలమైన సామాజికవర్గం బలిజలను తమవైపునకు తిప్పుకోవాలి. అందుకే పవన్ కల్యాణ్ తరచూ కడప, కర్నూలు జిల్లాల్లో పర్యటిస్తున్నారని చెబుతున్నారు. చంద్రబాబు సూచనల మేరకే పవన్ కల్యాణ్ సీమ జిల్లాల్లో పర్యటనలు చేస్తున్నారని సమాచారం. కడపలో కూడా క్యాంప్ కార్యాలయం ప్రారంభిస్తానని పవన్ కల్యాణ్ చేసిన ప్రకటన వెనక కూడా ఇదే ప్రధాన కారణం అని అంటున్నారు. మొత్తం మీద చంద్రబాబు స్కూలులో సిలబస్ మారినట్లే కనిపిస్తుంది.


Tags:    

Similar News