Tirumala : తిరుమలలో రద్దీ ఒక్కసారిగా పెరిగిందిగా.. వైకుంఠ ద్వారదర్శనానికి?
తిరుమలలో భక్తుల రద్దీ ఒక్కసారిగా పెరిగింది.;
తిరుమలలో భక్తుల రద్దీ ఒక్కసారిగా పెరిగింది. శనివారం కావడంతో పాటు వైకుంఠ ద్వార దర్శనం కూడా ఉండటంతో అత్యధికసంఖ్యలో భక్తులు వచ్చారు. తిరుమల శ్రీవారి దర్శనానికి చాలా సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. అయితే వైకుంఠ ద్వార దర్శనానికి టిక్కెట్లు కొనుగోలు చేసిన వారందరికీ దర్శనం కల్పిస్తామని, భక్తులు సహకరించాలని టీటీడీ అధకారులు కోరుతున్నారు. ముందుగానే టిక్కెట్లు అన్నీ హాట్ కేకుల్లా అమ్ముడు కావడంతో వారంతా తమకు నిర్దేశించిన తేదీన తిరుమలకు వచ్చి స్వామి వారిని దర్శించుకుంటున్నారు.
అన్నీ రద్దు చేసినా...
అదే సమయంలో మూడు వందల రూపాయల టిక్కెట్ల దర్శనాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం నిలిపేసింది. ఆర్జిత సేవలను కూడా నిలిపేసింది. కేవలం వైకుంఠ ద్వార దర్శనాలను మాత్రమే అవకాశం కల్పించింది. ఇక సర్వదర్శనం క్యూ లైన్ లో టిక్కెట్లు లేని భక్తులు కూడా స్వామి వారిని వైకుంఠ ద్వార దర్శనం చేసుకునేందుకు తరలి రావడంతో ఒక్కసారిగా తిరుమలలో రద్దీ పెరిగింది. తిరుమలలో వీధులన్నీ భక్తులతో నిండిపోయాయి. గోవింద నామస్మరణలతో మారుమోగిపోతున్నాయి.
హుండీ ఆదాయం...
తిరుమల అంటే శనివారం వస్తే ఎంతో పుణ్యమని భావిస్తారు. ఆరోజు వెంకటేశ్వరస్వామిని దర్శించుకుంటే మంచిదని భావించి ఎక్కువ మంది తరలివస్తారు. వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించి భక్తులు ఇబ్బంది పడకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. వైకుంఠ ద్వార దర్శనాలు ఈ నెల 19వ తేదీ వరకూ కొనసాగనున్నాయి. నిన్న తిరుమల వెంకటేశ్వరస్వామిని 53,013 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 13,283 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 4.43 కోట్ల రూపాయలు వచ్చిందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు.