వివేకా హత్యకేసు : సీబీఐ డైరెక్టర్ కు అవినాష్ రెడ్డి లేఖ
గతంలో వివేకా హత్యకేసును దర్యాప్తు చేసిన రామ్ సింగ్ ఏకపక్షంగా వ్యవహరించారంటూ అవినాష్ రెడ్డి సంచలన ఆరోపణలు
వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకేసులో సీబీఐ దర్యాప్తు సరిగ్గా జరగలేదని పేర్కొంటూ కడప ఎంపీ అవినాష్ రెడ్డి సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్ కు లేఖ రాశారు. ఈ కేసులో సీబీఐ దర్యాప్తును పునః సమీక్షించాలని అవినాష్ రెడ్డి కోరారు. గత దర్యాప్తు అధికారి రామ్ సింగ్ పై ఈ లేఖలో అవినాష్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. వివేకా హత్యకేసులో ఇప్పటి వరకూ సీబీఐ దాఖలు చేసిన రెండు ఛార్జిషీట్ల ఆధారంగా అవినాష్ రెడ్డి సీబీఐ డైరెక్టర్ కు లేఖ రాశారు.
గతంలో వివేకా హత్యకేసును దర్యాప్తు చేసిన రామ్ సింగ్ ఏకపక్షంగా వ్యవహరించారంటూ అవినాష్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. కేవలం ఇద్దరి స్టేట్ మెంట్ ఆధారంగానే దర్యాప్తు చేశారని, చాలా విషయాలను దర్యాప్తులో మరిచారని అవినాష్ రెడ్డి లేఖలో ప్రస్తావించారు. అప్రూవర్ గా మారిన దస్తగిరి స్టేట్ మెంట్ నే సాక్ష్యంగా పరిగణించారని, తనకు ఈ కేసు విషయంలో అనేక అనుమానాలు ఉన్నాయని, వాటిని పునః సమీక్షించాలని కోరుతున్నానని అవినాష్ రెడ్డి సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్ కు లేఖ పంపారు.