Andhra Pradesh : తొలి సంతకాలే కాదు.. తొలి సమావేశం కూడా అదుర్సేనట.. గుడ్ న్యూస్ రెడీ అవుతుందట

ఆంధ్రప్రదేశ్ లో నూతనంగా ఏర్పడిన ప్రభుత్వం ఈ నెల 24వ తేదీన కీలక నిర్ణయాలు తీసుకోనుంది.

Update: 2024-06-22 07:27 GMT

ఆంధ్రప్రదేశ్ లో నూతనంగా ఏర్పడిన ప్రభుత్వం ఈ నెల 24వ తేదీన కీలక నిర్ణయాలు తీసుకోనుంది. ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పనుంది. ప్రజలకు ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలలో కొన్నింటికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశముంది. ఇప్పటికే జులై నెల నుంచి పింఛను నాలుగు వేల రూపాయలు ఇస్తామని ప్రకటించిన నేపథ్యంలో కేబినెట్ నూతన పింఛను విధానానికి ఆమోదం తెలపనుంది. చంద్రబాబు ఎన్నికల ప్రచార సభల్లో చెప్పినట్లుగా ఏప్రిల్, మే, జూన్ నెలలకు వెయ్యేసి రూపాయలు కలిపి ఏడువేల రూపాయలు పింఛను ఇవ్వనున్నారు. ఈ నెల 24వ తేదీన కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం ప్రకటించబోతున్నారు.

ఫ్రీ బస్సు...
దీంతో పాటు మరికొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే దిశగా మంత్రివర్గం తీసుకునే అవకాశముందని తెలిసింది. పింఛనుతో పాటు మరికొన్ని హామీల విషయాలోనూ స్పష్టత నివ్వాలని అధికార పార్టీ భావిస్తుంది. ముఖ్యంగా జులై నెల మొదటి నుంచే రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత బస్సు ప్రయాణం కల్పించేందుకు కూడా సిద్ధమవుతుంది. ఇందుకోసం ప్రతిపాదనలను సిద్ధం చేయాలని రవాణా శాఖకు ఇప్పటికే ఆదేశాలు అందాయి. ఆర్టీసీ నుంచి కూడా ఎంత ఖర్చవుతుందన్న దానిపై అంచనాలు తీసుకుని ఈ మంత్రివర్గ సమావేశంలోనే తీసుకుని దానికి ఆమోదముద్ర వేయాలన్న నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది.
గ్యాస్ సిలిండర్లు...
దీంతో పాటు సూపర్ సిక్స్ లో పొందు పర్చిన మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ లను కూడా జులై నెల నుంచి ఇవ్వాలని నిర్ణయించినట్లు అధికారిక వర్గాల నుంచి అందుతున్న సమాచారం. అయితే ఇందుకు ఆమోదం మాత్రమే ఈ సమావేశంలో తెలిపి విధివిధానాలను నిర్ణయించడానికి ముఖ్యమైన శాఖ అధికారులతో కమిటీని నియమించాలన్న యోచనలో ఉన్నారని చెబుతున్నారు. మహిళలను ఆకట్టుకునే దిశగా తొలి మంత్రివర్గ సమావేశంలోనే మూడు ముఖ్యమైన కీలక నిర్ణయాలు తీసుకుంటారని చెబుతున్నారు. అయితే అధికారుల నుంచి వచ్చే ప్రతిపాదనలు, విధివిధానాలు, మార్గదర్శకాలు రూపొందితే ఈ మూడు సోమవారం జరిగే మంత్రివర్గం ముందుకు వస్తాయనిచెబుతున్నారు. దీంతో పాటు పోలవరం, అమరావతి నిర్మాణంతో పాటు వివిధ శాఖలకు సంబంధించిన శ్వేత పత్రాలను విడుదల చేసే యోచనలో ప్రభుత్వం ఉందంటున్నారు.



Tags:    

Similar News