Ys Jagan : రెడ్లకు దగ్గరకు అయ్యేదెలా? సమయమే కలసి వస్తుందని జగన్ వెయిట్ చేస్తున్నారా?

ఆంధ్రప్రదేశ్ లో కులాల ప్రస్తావన లేకుండా ఏ ఎన్నిక జరగదు. అందుకు కారణం అక్కడ సామాజికవర్గాలదే అధిక ప్రాధాన్యత

Update: 2024-07-02 06:58 GMT

ఆంధ్రప్రదేశ్ లో కులాల ప్రస్తావన లేకుండా ఏ ఎన్నిక జరగదు. అందుకు కారణం అక్కడ సామాజికవర్గాలదే అధిక ప్రాధాన్యత. ఒక్కొక్క పార్టీకి ఒక్క కులం అండగా నిలుస్తుంది. టీడీపీకి కమ్మ సామాజికవర్గం, జనసేనకు కాపు కులం, బీజేపీకి వైశ్య, బ్రాహ్మణ కులాలు, వైసీపీకి రెడ్డి సామాజికవర్గాలు అనుకూలమన్నది అందరికీ తెలిసిందే. అయితే మొన్నటి ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు చూస్తే మాత్రం కూటమి పార్టీలకు కమ్మ, కాపు, వైశ్య, బ్రాహ్మణ వర్గాలు అండగా నిలిచాయి. బీసీలు కూడా ఎక్కువ శాతం మంది మద్దతు పలికినట్లు ఫలితాల తర్వాత తేలింది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే రెడ్డి సామాజికవర్గం కూడా ఎక్కువ భాగం కూటమి వైపునకు మొగ్గు చూపారన్నదే ప్రధానమైనది.

పదేళ్ల పాటు...
అందుకు కారణాలు కూడా లేకపోలేదు. 2019 ఎన్నికల ముందు వరకూ జగన్ వెంటనే రెడ్డి సామాజికవర్గం నడిచింది. వైసీపీ పార్టీ స్థాపించిన నాటి నుంచి అన్ని రకాలుగా జగన్ వెన్నంటే నడిచింది రెడ్డి సామాజికవర్గమే. తమ డబ్బులను ఖర్చు చేసి మరీ 2014, 2019 ఎన్నికల్లో రెడ్డి సామాజికవర్గం నేతలు ఖర్చు పెట్టారు. మనోడు అధికారంలోకి వస్తే బాగుంటుందని భావించారు. అందుకే వారు ఆ రెండు ఎన్నికల్లో కసి కొద్దీ పనిచేశారు. కానీ 2014 ఎన్నికల్లో అది అధికారంలోకి రాలేకపోయింది. అయినా సరే రెడ్డి సామాజికవర్గం నేతలలో 90 శాతం మంది పార్టీకి వెన్నుదన్నుగానే నిలిచారు. జగన్ పాదయాత్ర నుంచి పార్టీ విజయం సాధించేంత వరకూ అంటిపెట్టుకునే ఉన్నారు. అధికారంలోకి రావాలని చెమటోడ్చారు. ఉన్న ఆస్తులను అమ్మి మరీ తమ నియోజకవర్గాల్లో ఖర్చు చేసిన వాళ్లు కూడా అనేక మంది ఉన్నారు.
అధికారంలో ఉన్న ఐదేళ్లు...
కానీ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఐదేళ్ల పాటు రెడ్డి సామాజికవర్గం నేతలను దూరం పెట్టారు. పదవులన్నీ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలంటూ కొత్త పల్లవి అందుకుని వారిని వాటిని దక్కకుండా చేశారు. నామినేటెడ్ పదవుల్లోనూ వారికి పెద్దగా ప్రయారిటీ ఇవ్వలేదు.జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం ఓటు బ్యాంకును ఏర్పాటు చేసుకోవడంలోనే నిమగ్నమయి పార్టీకి బేస్ లాంటి రెడ్డి సామాజికవర్గాన్ని పూర్తిగా పక్కన పెట్టారు. కనీసం వారికి అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వలేదు. దీంతో వాళ్లంతా కసి మీద ఉన్నారు. తాము పదేళ్ల పాటు కష్టపడి, సొంత డబ్బు ఖర్చు పెట్టుకుంటే అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా పట్టించుకోలేదని మొన్నటి ఎన్నికల్లో రెడ్లు అడ్డం తిరిగారు. దీంతో ఇప్పుడు జగన్ కు తిరిగి సొంత సామాజికవర్గాన్ని దగ్గర చేర్చుకోవడం పెద్ద సవాలుగా మారింది.
రాయలసీమలోనూ...
జనసేన ప్రభావం తక్కువగా ఉండే రాయలసీమలో కూడా తెలుగుదేశం అధిపత్యం చలాయించడానికి ప్రధాన కారణం రెడ్లు. రెడ్లలో కసి తగ్గింది వైసీిపీకి దూరమయ్యారని జగన్ కు ఇప్పుడు తెలిసి వచ్చింది. అయితే వారిని తిరిగి దరి చేర్చుకోవడం అంత సులువు కాదు. కాలమే దగ్గరకు చేరుస్తుందన్న నమ్మకంతో జగన్ ఉన్నట్లు కనపడుతుంది. ఎందుకంటే జగన్ పార్టీ ఆఫీసులను కూల్చి వేత పనులను ప్రారంభించడంతో పాటు జగన్ ను ఇబ్బంది పెడుతున్నారన్న సింపతీ మొదలయితే తప్ప తిరిగి వారు చేరరన్న అభిప్రాయంలో ఉన్నారు. ఈసారి అందరితోనూ కలిసేలా, తనకు, నేతలకు మధ్య గ్యాప్ ఉండకుండా ఉండేలా చూసుకునేందుకు జగన్ జాగ్రత్త పడుతున్నారని తెలిసింది. బెంగళూరులో ఉన్న జగన్ ముఖ్యమైన రెడ్డి సామాజికవర్గం నేతలను పిలిపించుకుని ఇదే అంశంపై చర్చించినట్లు తెలిసింది. తనకు సహకరించాలని వారిని కోరినట్లు చెబుతున్నారు. అయితే పూర్తి స్థాయిలో ఆ సామాజికవర్గం మద్దతు లభించాలంటే ఎంతకాలం పడుతుందన్నది మాత్రం ఇప్పుడే చెప్పలేని పరిస్థితి అని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.


Tags:    

Similar News