జగన్ నాయకుడు కాదు.. ఒక కమీషన్ ఏజెంట్: పవన్ కళ్యాణ్

వైజాగ్ జగదాంబ సెంటర్ లో జనసేన పార్టీ నిర్వహించిన సభలో పవన్ కళ్యాణ్

Update: 2023-08-10 15:36 GMT

వైజాగ్ జగదాంబ సెంటర్ లో జనసేన పార్టీ నిర్వహించిన సభలో పవన్ కళ్యాణ్ సీఎం జగన్ తీవ్ర విమర్శలు చేశారు. వైసీపీ గెలిస్తే విశాఖలో కొండలతో సహా దోచుకుంటాడు అని తాను 2019లోనే చెప్పానని.. ఇప్పుడు చూడండి ఏంచేస్తున్నాడో అని పవన్ విమర్శించారు. మీరు ఎన్నుకుంది దోపిడీలు చేసుకునే వ్యక్తిని. ఇలాంటి వాళ్లను ఐదేళ్లు భరించలేరు అని అందుకే గత ఎన్నికల్లో వైసీపీని గెలిపించవద్దని అన్నారు. జగన్ ముఠా తెలంగాణ ప్రాంతాన్ని కూడా దోచుకుంటే అక్కడి వారు తన్ని తరిమేశారు. విశాఖలో రుషికొండను తవ్వేశారు. తుపానుల నుంచి కాపాడే కొండను చెక్కి పడేశారన్నారు. వచ్చే ఎన్నికల్లో మాకు ఓటేయండి.. ఒక్కసారి జనసేనకు అండగా నిలబడండి.. మీ కోసం నేను నిలబడతానని అన్నారు జనసేనాని.

జగన్ ఒక డెకాయిట్. కాగ్ లెక్కల్లో కొన్ని వేల కోట్ల రూపాయలకు లెక్కాపత్రం లేదని తేలింది. ఆ డబ్బు ఏమైందని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. కీలక పదవులన్నీ ఒకే కులానికి ఇవ్వడం రాజ్యాంగ విరుద్ధం. అన్ని వర్గాలకు అవకాశాలు కల్పించాలని అన్నారు పవన్ కళ్యాణ్. ఇంకా ఎంత డబ్బు తింటావ్ జగన్? ఏం చేసుకుంటావ్ జగన్ అంత డబ్బు? నీకెందుకింత డబ్బు పిచ్చి అని అన్నారు. టీచర్లకు జీతాలు ఇవ్వడానికి డబ్బు లేదంటారు... కానీ నష్టాల్లో ఉన్న బైజూస్ అనే కంపెనీకి మాత్రం రూ.500 కోట్లు ఇస్తారన్నారు. జగన్ నాయకుడు కాదు.. ఒక కమీషన్ ఏజెంట్ లాంటివాడు. ఏ పని జరిగినా నాకెంత అని అడుగుతాడన్నారు పవన్ కళ్యాణ్. క్లాస్-4 స్థాయి ఉద్యోగానికి కూడా పోలీస్ క్లియరెన్సు అడుగుతారు. కానీ 38 కేసుల్లో నిందితుడిగా ఉన్న వ్యక్తి మాత్రం ముఖ్యమంత్రి అవుతాడన్నారు.
జగన్ వాలంటీర్లతో, ప్రభుత్వ ఉద్యోగులతో తప్పులు చేయిస్తున్నాడని పవన్ కల్యాణ్ విమర్శించారు. గతంలోనూ అన్న, అక్క అంటూ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో తప్పులు చేయించి, వారు జైలుకు వెళ్లడానికి కారకుడయ్యాడని ఆరోపించారు. నేను వాలంటీర్ వ్యవస్థలోని లోపాల గురించి మాట్లాడాను. సింహాద్రి అప్పన్న సాక్షిగా చెబుతున్నా. వాలంటీర్ల పొట్టకొట్టాలన్నది నా ఉద్దేశం కాదు. అవసరమైతే ఇంకో రూ.5 వేలు ఎక్కువగా ఇచ్చే వ్యక్తిని నేను. కానీ మీతో జగన్ తప్పు చేయిస్తున్న విషయాన్ని గుర్తించండి. ప్రజల నుంచి సేకరించిన ఆధార్, బ్యాంక్, ఇతర వివరాలను నానక్ రామ్ గూడలోని ఫీల్డ్ ఆపరేషన్స్ ఏజెన్సీకి అప్పగిస్తున్నారని స్పష్టం చేశారు.


Tags:    

Similar News