అంబులెన్స్ ను వాడుతున్న లోకల్ 'పుష్ప'
చెక్ పోస్టుల వద్ద అంబులెన్స్ సైరన్ వేసుకుని వేగంగా వెళ్లిపోయి ఎర్రచందనం
పుష్ప సినిమాతో అల్లు అర్జున్ గ్లోబల్ స్టార్ అవ్వగా.. దేశంలో ఎక్కడ ఎర్ర చందనం దొరికినా కూడా పుష్ప సినిమాను తలచుకుంటూనే ఉంటారు. ముఖ్యంగా స్మగ్లింగ్ కోసం కొత్త కొత్త పద్ధతులను వాడుతూ ఈ గ్యాంగ్ లు అడ్డంగా దొరికిపోతూ ఉన్నాయి. ఎర్రచందనం దుంగలు అక్రమ రవాణా చేయడానికి రోగుల కోసం ఉపయోగించే అంబులెన్సులను వాడాలని అనుకుని.. అడ్డంగా దొరికిపోయారు. చెక్ పోస్టుల వద్ద అంబులెన్స్ సైరన్ వేసుకుని వేగంగా వెళ్లిపోయి ఎర్రచందనం అక్రమ రవాణాకు పాల్పడుతున్నారు. ఈ విషయం టాస్క్ ఫోర్సు పోలీసుల దృష్టికి వచ్చింది. ముందుగా అందిన సమాచారంతో బాలపల్లి అటవీ ప్రాంతంలో కూంబింగ్ చేపట్టారు. రైల్వే కోడూరు రేంజిలోని బాలపల్లి ఈస్ట్ రేంజి అటవీ ప్రాంతంలో ఒక వ్యక్తి మోటార్ సైకిల్ మీద కనిపించాడు. ఇక్కడ ఎందుకు ఉన్నావని అడిగితే అతను సరైన సమాధానం చెప్పక పోవడంతో.. అతనిని తీసుకుని అడవిలోకి ముందుకు వెళ్లారు. అక్కడ ఒక అంబులెన్సు కనిపించింది. అంబులెన్సులో ఎర్రచందనం దుంగలను ఎక్కిస్తూ ఉన్న ఏడుగురు స్మగ్లర్లను అరెస్టు చేశారు.