Tirumala : కిటకిటలాడుతున్న తిరుమల కొండలు.. గోవింద నామస్మరణతో

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతూనే ఉంది. మంగళవారం కూడా అధిక సంఖ్యలో భక్తులు తిరుమల కొండకు చేరుకున్నారు.

Update: 2024-10-01 05:52 GMT

Tirumala darshan 

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతూనే ఉంది. మంగళవారం కూడా అధిక సంఖ్యలో భక్తులు తిరుమల కొండకు చేరుకున్నారు. తిరుమలలో వీధులన్నీ గోవింద నామస్మరణతో మారుమోగిపోతున్నాయి. ఎక్కడ చూసినా జనసంద్రమే. బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో తిరుమలకు భక్తుల తాకిడి పెరిగింది. బ్రహ్మోత్సవాలు ప్రారంభమయితే అన్ని రకాల దర్శనాలను టీటీడీ రద్దు చేస్తుందన్న కారణంతో ముందుగానే శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు తిరుమలకు చేరుకుంటున్నారు. బ్రహ్మోత్సవాల సమయంలో ప్రత్యేక దర్శనాలు, వీఐపీ దర్శనాలు ఉండకపోవడంతో ముందుగా బుక్ చేసుకున్న వారు తిరుమల శ్రీవారిని దర్శించుకుని తమ మొక్కులు తీర్చుకుంటున్నారు. తలనీలాలు సమర్పించే ప్రాంతాలు కూడా భక్తుల రద్దీతో కిటకిటలాడుతున్నాయి. శ్రీవారి సేవకులు తిరుమలలో భక్తులు ఇబ్బంది పడకుండా అన్ని రకాల సాయం అందిస్తున్నారు. నేడు డీజీపీ ద్వారకా తిరుమల రావు కూడా తిరుమలకు చేరుకుని బ్రహ్మోత్సవాల సందర్భంగా బందోబస్తు ఏర్పాట్లను సమీక్షించనున్నారు.

పద్దెనిమిది గంటల సమయం...
తిరుమల భక్తజన సంద్రంగా మారింది. మాడ వీధులన్నీ భక్తులతో నిండిపోయాయి. ఎక్కడ చూసినా భక్తుల రద్దీ కనిపిస్తుంది. ఈరోజు తిరుమల వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్ట్‌మెంట్లూ భక్తులతో నిండిపోయాయి. టీబీసీ గెస్ట్ హౌస్ వరకూ క్యూ లైన్ లో భక్తులు ఉన్నారు. ఉచిత దర్శనం క్యూ లైన్ లో టోకెన్లు లేకుండా ఈ ఉదయం ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం 18 గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. టైమ్ స్లాట్ దర్శనానికి భక్తులకు ఆరు గంటలకు పైగానే సమయం పడుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం నాలుగు నుంచి ఐదు గంటల సమయం పడుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 66,986 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 26,163 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం రికార్డు స్థాయికి చేరుకుంది. ఇటీవల కాలంలో ఇంత స్థాయిలో హుండీ ఆదాయం రాలేదు. నిన్న హుండీ ఆదాయం 5.05 కోట్ల రూపాయలు వచ్చిందని అధికారులు వెల్లడించారు.


Tags:    

Similar News