Tirumala : తిరుమలలో కొనసాగుతున్న రద్దీ.. నేడు దర్శనానికి?

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. నేడు ఆదివారం కావడంతో భక్తుల రద్దీ ఎక్కువగానే ఉంది

Update: 2024-12-01 03:21 GMT

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. నేడు ఆదివారం కావడంతో భక్తుల రద్దీ ఎక్కువగానే ఉంది. తిరుమలలో భారీ వర్షాలు పడుతున్నాయి. ఫెంగల్ తుపాను ఎఫెక్ట్ చిత్తూరు జిల్లాపై తీవ్ర ప్రభావం చూపుతుంది. పాపవినాశనం, శ్రీవారి పాదాలను సయితం అధికారులు భారీ వర్షాల దెబ్బకు మూసివేశారు. అయినా సరే తిరుమలలో భక్తుల రాక ఎక్కువగా ఉంది. విమానాలు రద్దయ్యాయి. అలాగే రైళ్ల ప్రయాణం కూడా ఇబ్బందికరంగా మారినా భక్తులు శ్రీవారి చెంతకు చేరుకుంటున్నారు. దీంతో ఆదివారం నాడు తిరుమలలో భక్తులు అధిక సంఖ్యలోనే ఉన్నారు. తుపాను హెచ్చరికలను సయితం భక్తులు లెక్క చేయకుండా స్వామివారిని దర్శించుకునేందుకు ముందుకు వచ్చారు. తిరుమలలో కూడా భారీ వర్షం పడుతున్నప్పటికీ శ్రీవారి దర్శనం కోసం బారులు తీరారు. తడుస్తూనే శ్రీవారి దర్శనానికి వెళ్లేందుకు క్యూలైన్ లకు చేరుకుంటున్నారు. నిన్న సాయంత్రం నుంచే తిరుమలలో భారీ వర్షం పడుతుంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు సయితం భక్తులు లెక్క చేయడం లేదు. ఏడుకొండలవాడిని దర్శించుకుని తమ మొక్కులు చెల్లించేందుకు ఎక్కువ మంది దూర ప్రాంతాల నుంచి వచ్చారని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు.

హుండీ ఆదాయం మాత్రం...
అయితే భక్తులు భారీ వర్షానికి ఎలాంటి ఇబ్బందులు పడకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని అధికారులు చెబుతున్నారు. ముందుగా దర్శనం టిక్కెట్లు బుక్ చేసుకున్న వారితో పాటు ఆదివారం సెలవు దినం కావడంతో ఎక్కువ మంది భక్తులు తిరుమలకు చేరుకుంటున్నారు. దర్శనం పూర్తయిన వెంటనే వసతి గృహాలకు చేరుకుంటున్నారు. ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని నాలుగు కంపార్ట్ మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. ఉచిత దర్శనం క్యూ లైన్ లో ఉదయం ఏడు గంటలకు టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం పన్నెండు గంటల సమయం పడుతుందని అధికారులు తెలిపారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు రెండు గంటల సమయం పడుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం రెండు నుంచి మూడు గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. నిన్న తిరుమల శ్రీవారిని 73,619 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 25,112 మంది తమ తలనీలాలను సమర్పించి మొక్కులు సమర్పించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.35 కోట్ల రూపాయలు వచ్చిందని అధికారులు తెలిపారు.


Tags:    

Similar News