Tirumala : మంగళవారం తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉందంటే?
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. మంగళవారం కూడా భక్తులు కొంత ఎక్కువగానే కనిపిస్తున్నారు
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. మంగళవారం కూడా భక్తులు కొంత ఎక్కువగానే కనిపిస్తున్నారు. సోమవారం కొంత భక్తుల సంఖ్యలో తగ్గుదల కనిపించినప్పటికీ మంగళవారం మాత్రం భక్తుల రద్దీ ఒక్కసారిగా పెరిగింది. నిన్న నేరుగా శ్రీవారిని దర్శించుకున్న భక్తులు నేడు కంపార్ట్మెంట్లలో వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. మిగిలిన రోజుల్లో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుందని మంగళవారం అయితే భక్తులు అంత ఉండరని భావించి ఎక్కువ మంది తిరుమల కొండకు చేరుకుంటున్నారని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు చెబుతున్నారు. అయినా భక్తులు అధికంగా వచ్చినా ఎలాంటి ఇబ్బందులు ఉండకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని, వసతి గృహాలు, అన్న ప్రసాదాలను వారికి అందేలా తగిన చర్యలు తీసుకుంటున్నామని అధికారులు తెలిపారు.
హుండీ ఆదాయం మాత్రం...
ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని పన్నెండు కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. ఉచిత దర్శనం క్యూ లైన్ లో ఈరోజు ఉదయం ఏడు గంటలకు టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం పన్నెండు గంటల సమయం పడుతుందని అధికారులు తెలిపారు. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం రెండు నుంచి మూడు గంటల సమయం పడుతుందని తెలిపారు. నిన్న తిరుమల శ్రీవారిని 65,874 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 23,782 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 4.48 కోట్ల రూపాయలు వచ్చిందని అధికారులు వెల్లడించారు.