Free Gas Cyllender : ఉచిత గ్యాస్ సిలిండర్ పథకానికి తొలిరోజు బుకింగ్స్ ఎలా ఉన్నాయో తెలుసా?
ఆంధ్రప్రదేశ్ లో మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకానికి సంబంధించి బుకింగ్ ప్రక్రియ నేటి నుంచి ప్రారంభమయింది.;
ఆంధ్రప్రదేశ్ లో మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకానికి సంబంధించి బుకింగ్ ప్రక్రియ నేటి నుంచి ప్రారంభమయింది. ఈరోజు ఉదయం పది గంటల నుంచి అర్హత కలిగిన వారు గ్యాస్ సిలిండర్ ను బుక్ చేసుకునే వీలుంది. ఇందుకు అర్హతలను కూడా నిర్ధారించింది. దీంతో ఈరోజు ఉదయం నుంచే కొందరు గ్యాస్ కంపెనీల వద్దకు క్యూ కట్టారు. మహిళలు రేషన్ కార్డులు, ఆధార్ కార్డులతో పాటు దీపం కార్డులను కూడా చేతపట్టుకుని గ్యాస్ కంపెనీల వద్దకు క్యూ కట్టారు. ఎల్‌పీజీ గ్యాస్ బుక్ ను చేత పట్టుకుని తమకు గ్యాస్ సిలిండర్ ను బుక్ చేయాలంటూ గ్యాస్ కంపెనీల వద్దకు పెద్దయెత్తున మహిళలు రావడంతో కొంత ఆలస్యంగా బుకింగ్స్ జరుగుతున్నాయి.
తొలిరోజు ఈ పథకానికి...
తొలిసారి ఈ పథకానికి మంచి స్పందన లభించిందని చెప్పాలి. రాష్ట్ర వ్యాప్తంగా అనేక గ్యాస్ కంపెనీల వద్ద క్యూలు బారులు తీరి కనిపించింది. ఇందుకు కూడా అనేక కారణాలు ఉన్నాయి. ఒకసారి ఈ పథకం కింద అర్హత పొందితే చాలునన్న భావన మహిళల్లో కనపడుతుంది. ఒకసారి అర్హత సాధిస్తే గ్యాస్ సిలిండర్ రెండో సారి ఎప్పుడైనా బుక్ చేసుకునే వీలుంటుందని కొందరు మహిళలు అభిప్రాయం వ్యక్తం చేశారు. మరికొందరు మాత్రం గత కొంత కాలంగా గ్యాస్ సిలిండర్ పై వస్తున్న సమాచారాన్ని తాము ఫాలో అవుతున్నామని, నిజంగానే తమ ఇంట గ్యాస్ సిలిండర్ అయిపోవడంతోనే బుక్ చేసుకోవడానికి వచ్చామని చెబుతున్నారు.
ఒక్క రోజులోనే...
ఒక్కరోజులోనే దాదాపు రెండు నుంచి మూడు లక్షల మందికి పైగా మహిళలు గ్యాస్ సిలిండర్లను బుక్ చేసుకున్నట్లు ప్రాధమికంగా అందుతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. కొందరు సెల్ ఫోన్ల ద్వారా తమ బుకింగ్ ఆర్డర్ చేసుకోగా, ఎక్కువ శాతం మంది మాత్రం గ్యాస్ కంపెనీలకు మాత్రమే వస్తున్నారు. తమకు ఉచిత గ్యాస్ సిలిండర్ కావాలని సిబ్బందిని అడుగుతూ, వారు అడిగిన ఆధారాలను చూపుతూ బుక్ చేసుకోవడం కనిపించింది. దీపావళి రోజు నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం ప్రారంభం కానుంది. రేపు, ఎల్లుండి కూడా సమయం ఉన్నప్పటికీ తొలి రోజు మహిళల నుంచి మంచి స్పందన వచ్చిందని పౌర సరఫరాల శాఖ అధికారులు చెబుతున్నారు.