Tirumala : తిరుమలలో కంపార్ట్‌మెంట్లన్నీ ఖాళీ.. నేడు కూడా నేరుగా దర్శనం

తిరుమలలో భక్తుల రద్దీ తక్కువగా ఉంది. భక్తులు స్వల్పంగానే స్వామి వారిని దర్శించుకుంటున్నారు;

Update: 2024-10-30 03:13 GMT

tirupathi temple darshan

తిరుమలలో భక్తుల రద్దీ తక్కువగా ఉంది. భక్తులు స్వల్పంగానే స్వామి వారిని దర్శించుకుంటున్నారు. వచ్చిన కొద్ది మంది ఏడుకొండలవాడిని దర్శించుకుని తమ మొక్కులు తీర్చుకుంటున్నారు. గత కొన్ని రోజులుగా తిరుమలకు భక్తుల తాకిడి అంతగా లేదు. దీపావళి ఉండటంతో పాటు సెలవులున్నప్పటకీ దీపావళి రోజున ఇంట్లోనే ఉండి లక్ష్మీదేవి పూజలను నిర్వహించుకోవాల్సి రావడం, రాత్రికి టపాసులు పేల్చాల్సి రావడంతో భక్తులు తిరుమలకు తక్కువగా వస్తున్నారని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు చెబుతున్నారు. దీంతో తిరుమలలో వీధులన్నీ ఖాళీగానే కనిపిస్తున్నాయి. గత కొద్ది రోజులుగా తమకు వ్యాపారాలు కూడా తగ్గాయని తిరుమల కొండపైన వ్యాపారులు చెబుతున్నారు. హోటళ్లతో పాటు చిన్న దుకాణదారులు భక్తులు అధిక సంఖ్యలో రాకపోవడంతో నిరాశకు గురవుతున్నారు. గత వారం రోజుల నుంచి తిరుమలలో ఇదే పరిస్థితి నెలకొని ఉందని వ్యాపారులు చెబుతున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు కూడా భక్తుల సంఖ్యకు తగినట్లుగానే లడ్డూల తయారీ, అన్న ప్రసాదం తయారీని చేస్తుందని చెబుతున్నారు.

ఆరు గంటల్లోనే...
కొన్ని రోజుల పాటు తుపాను హెచ్చరికలు, భారీ వర్షాలు, రైళ్లు రద్దు కావడంతో పాటు దీపావళి పండగ రావడంతో భక్తుల రద్దీ తక్కువగా ఉందని అంటున్నారు. రేపు తిరుమల తిరుపతి దేవస్థానంలో దీపావళి ఆస్థానం జరుగుతుంది. వీఐపీ బ్రేక్ దర్శనాలను టీటీడీ రద్దుచేసింది. అదే సమయంలో సిఫార్సు లేఖలను కూడా రేపు అనుమతించబోరు. ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూకాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్‌మెంట్లు ఖాళీగానే ఉన్నాయి. స్వామి వారిని నేరుగా దర్శించుకునే వీలుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. ఉచిత దర్శనం క్యూ లైన్ లో ఉదయం ఏడు గంటలకు టోకెన్లు లేకుండా ప్రవేశించే భక్తులకు శ్రీవారి దర్శనం ఆరు గంటల సమయం పడుతుంది. టైమ్ స్లాట్ దర్శనానికి గంట సమయం పడుతుంది. మూడు వందల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం గంట నుంచి రెండు గంటలసమయం పడుతుందని అధికారులు వెల్లడించారు. నిన్న తిరుమల శ్రీవారిని 59,140 మంది దర్శించుకున్నారు. వీరిలో 16,937 మంది తమ తలనీలాలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.31 కోట్ల రూపాయలు వచ్చిందని అధికారులు తెలిపారు.

Tags:    

Similar News