Ys Vijayamma : కన్న కొడుకైన జగన్ కు షాకిచ్చిన తల్లి విజయమ్మ
ఆస్తులపై విజయమ్మ వైఎస్ రాజశేఖర్ రెడ్డి భార్య వైఎస్ విజయమ్మ తొలిసారి స్పందించారు;
ఆస్తులపై విజయమ్మ వైఎస్ రాజశేఖర్ రెడ్డి భార్య వైఎస్ విజయమ్మ తొలిసారి స్పందించారు. ఆమె లేఖను విడుదల చేశారు. ఆ లేఖలో వైెఎస్ షర్మిలకు ఆస్తుల పంపకాల్లో అన్యాయం జరిగిందని తెలిపారు. వైఎస్ అభిమానులు, తమ కుటుంబాన్ని ప్రేమించి, ఆదరించి అక్కున చేర్చుకున్న ప్రతి ఒక్కరికీ అభ్యర్థన అంటూ తన లేఖను ప్రారంభించారు. వైెఎస్ బతికుండగా ఆస్తులు పంచారన్న దానిలో వాస్తవం లేదని అన్నారు. అలాగే వైవీ సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి చెప్పిన విషయాల్లోనూ నిజాలు లేవని విజయమ్మ తన లేఖలో కుండ బద్దలు కొట్టారు. తమ పిల్లలు చాలా సంతోషంగా ఉండాలని వైఎస్ రాజశేఖర్ రెడ్డి నిత్యం పరితపించేవారన్నారు
ఏ దిష్టి తగిలిందో...?
తన కుటుంబానికి ఏ దిష్టి తగిలిందో తెలియదు కానీ, తాను అడ్డుకోవడానికి చేసిన ప్రయత్నాలు ఫలించలేదని ఆవేదన చెందారు. జరగకూడని వన్నీ తన కళ్లముందే జరిగి పోతున్నాయని విజయమ్మ కన్నీటి పర్యంతమయ్యారు. తన కుటుంబం గురించి ఎవరికి వారు ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం తనను బాధించిందని ఆమె విడుదల చేసిన లేఖలో వాపోయారు. అబద్ధాల పరంపర కొనసాగుతూనే ఉందని పేర్కొన్నారు. ఎక్కడో మొదలై ఎక్కడికో ఈ వివాదం వెళుతున్నట్లుగా ఉందని ఆమె అన్నారు. ఇది ఎవరికీ మంచిది కాదని, రాష్ట్రానికి కూడా శ్రేయస్కరం కాదని ఆమె అభిప్రాయపడ్డారు. తాను ఈ విషయంలో తలదూర్చకూడదని మొదట భావించానని అన్న విజయమ్మ, కానీ రావాల్సిన పరిస్థిితులు కల్పించారన్నారు.
ప్రచారం దురదృష్టకరం...
తన కుటుంబం గురించి తప్పుగా మాట్లాడే వారికి ఒకటే చెబుతున్నానన్న విజయమ్మతన పిల్లల గురించి తక్కువ చేసి మాట్లాడవద్దని కోరుతున్నానని లేఖలో కోరారు. కల్పిత కథలో సోషల్ మీడియాలో తమ కుటుంబంపై ప్రచారం జరగడం దురదృష్టకరమని ఆమె విలపించారు. తమ కుటుంబంపై నిజంగా ప్రేమ ఉంటే ఇకపై దానిపై మాట్లాడవద్దని అన్నారు. తన బిడ్డల సమస్యను ఆ ఏసు ప్రభువు పరిష్కరిస్తాడని ఆమె భావించారు. వైఎస్సార్ పిల్లలు పెరుగుతున్న ప్పటి నుంచే ఇద్దరికీ కొన్ని ఆస్తులు పాప పేరు మీద, కొన్ని ఆస్తులు జగన్పేరు మీద పెట్టారని విజయమ్మ తెలిపారు. ఆడిటర్ గా విజయసాయిరెడ్డికి ఈ విషయాలన్నీ తెలుసునన్న విజయమ్మ తల్లిగా తనకు ఇద్దరు బిడ్డుల సమానమేనని, అలాగే రాజశేఖర్ రెడ్డి మాట కూడా శిరోధార్యమని విజయమ్మ వివరించారు. ఆస్తులు ఇద్దరికీ సమానం అన్నది నిజమని విజయమ్మ కుండ బద్దలు కొట్టేశారు. వైఎస్ బతికుండగా ఆస్తుల పంపకం జరగలేదని ఆమె తెలిపారు.
బాధ్యతలో భాగంగా...
2019లో జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆస్తుల పంపకాల ప్రతిపాదన తెచ్చారన్నారు. పిల్లలు పెద్దవాళ్లు అవుతున్నారు కాబట్టి, నాకు అల్లుళ్లు, మీకు కోడళ్లు వస్తారని అందుకు పంచుకుందామని ప్రపోజల్ తెచ్చారన్నారు. మనం ఉన్నట్లు వాళ్లు ఉండకపోవచ్చని, అందుకే ఆస్తుల పంపకాలు చేసుకుందామని జగన్ అన్నారని విజయమ్మ తెలిపారు. తర్వాత విజయవాడలో తన సమక్షంలోనే ఎంవోయూ రాసుకున్నారని, ఆస్తుల పంపకం జరిగందని విజయమ్మ వివరించారు. పాపకి కూడా హక్కు ఉంది కాబట్టే ఎంఓయూ రాసుకున్నారన్న విజయమ్మ పాపకు ఇస్తున్న ఆస్తులు జగన్ గిఫ్ట్‌గా ఇస్తున్నవి కావని, బాధ్యతగా ఇస్తున్నవని ఆమె తెిపారు. లేఖలో ఆద్యంతం జగన్ వైపు కాకుండా షర్మిల వైపు ఉన్నట్లే విజయమ్మ కనిపించినట్లుంది.