కిటకిటలాడుతున్న శివాలయాలు
రెండు తెలుగు రాష్ట్రాల్లోని శివాలయాలు భక్తులతో సందడి నెలకొన్నాయి
రెండు తెలుగు రాష్ట్రాల్లోని శివాలయాలు భక్తులతో సందడి నెలకొన్నాయి. శివరాత్రి కావడంతో వేకువ జామునుంచే భక్తులు ఆలయాలకు తరలి వచ్చారు. మహా శివరాత్రి సందర్భంగా శివాలయాలు శివోహం నామస్మరణతో మారు మోగిపోతున్నాయి. శివరాత్రి సందర్భంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లోని ప్రముఖ దేవాలయాలను ముస్తాబుచేశారు. అనేక ఆలయాల్లో శివరాత్రి బ్రహ్మోత్సవాలు కూడా జరుగుతున్నాయి. శివరాత్రి సందర్భంగా భక్తులు ప్రత్యేక పూజలు చేయించుకుంటున్నారు. భక్తులు అధిక సంఖ్యలో వస్తారని ప్రత్యేక ఏర్పాట్లు ఆలయ అధికారులు చేశారు.
ఏపీ, తెలంగాణలో....
ఆంధ్రప్రదేశ్ లోని శ్రీశైలం, శ్రీకాళహస్తి, ద్రాక్షారామం, అమరావతి వంటి పుణ్య క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఓం నమశ్శివాయ అంటూ భక్తులు కైలాసనాధుడికి తమ కోరికలను విన్నవించుకుంటున్నారు. తెలంగాణలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ రాజన్న ఆలయం కిటకిట లాడిపోతుంది. ఉదయం మూడు గంటల నుంచే స్వామి వారి సేవలను ప్రారంభించారు. కీసరలోనూ భక్తుల రాక ఎక్కువగా ఉంది. కీసరను మంత్రి కేటీఆర్ సతీమణి, తనయుడు హిమాన్షు దర్శించుకున్నారు. కొమరవెల్లి మల్లన్న ఆలయానికి భక్తులు పోటెత్తారు.