Jc Prabhakar Reddy : జేసీ ప్రభాకర్ రెడ్డి దెబ్బకు కూటమిలో కలకలమేగా?

తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి నిత్యం వివాదాల్లో ఉంటున్నారు.టీడీపీకి తలనొప్పిగా తయారయ్యారు;

Update: 2025-01-03 03:49 GMT

తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి నిత్యం వివాదాల్లో ఉంటున్నారు. ఆయన అధికారంలో ఉన్నా లేకపోయినా సరే ఏదో రకంగా వార్తల్లో ఉంటున్నారు. ఇప్పుడు అధికార పార్టీకి జేసీ వ్యవహారం తలనొప్పిగా మారింది. జేసీ ప్రభాకర్ రెడ్డి తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ గా ఉండగా, ఆయన కుమారుడు అస్మిత్ రెడ్డి తాడిపత్రి ఎమ్మెల్యేగా ఉన్నారు. అయితే అక్కడ అస్మిత్ రెడ్డి జోక్యం అంటూ ఏమీ ఉండదు. జేసీ చెప్పిన ప్రకారమే తాడిపత్రి నియోజకవర్గంలో అధికారులు నడుచుకోవాల్సి ఉంటుంది. అంత వరకూ ఓకే అయినా... సొంత పార్టీ నేతలపైనే ఆయన విమర్శలు చేస్తుండటం కూటమి పార్టీలకు తలనొప్పిగా మారింది. ఫ్లై యాష్ వ్యవహారం ఇప్పుడు మరింత ముదిరింది.

ఫ్లై యాష్ వ్యవహారంలో...
కడప ఫ్లై యాష్ వ్యవహారంలో జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డికి, జేసీ ప్రభాకర్ రెడ్డికి మధ్య విభేదాలు తలెత్తాయి. ఈ విభేదాలను రూపుమాపాలని స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రయత్నించినా ఫలించలేదు. జేసీ ప్రభాకర్ రెడ్డి ఈ సమావేశానికి గైర్హాజరయ్యారు. ఆదినారాయణ రెడ్డి హాజరై అక్కడి పరిస్థితులను చంద్రబాబుకు వివరించారు. తర్వాత చంద్రబాబు నాయుడు అనంతపురం జిల్లాకు వెళ్లిన సమయంలోనూ అస్మిత్ రెడ్డి పై ఒకరకంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీకి నష్టం తెచ్చే పనులు చేయవద్దంటూ హెచ్చరించారు. ఈ విషయం జేసీ ప్రభాకర్ రెడ్డికి తెలిసినా ఆయన తీరు మారలేదు. మరోసారి బీజేపీ నేతలపై మండిపడ్డారు. కడపలోనే జేసీ ప్రభాకర్ రెడ్డికి చెందిన లారీలు ఉన్నాయి. ఆ వివాదం ఇంకా ముగిసిపోలేదని చెబుతున్నారు.

బస్సు దగ్దం విషయంలో...
జేసీ ప్రభాకర్ రెడ్డికి సంబంధించిన బస్సు అగ్నిప్రమాదంలో తగలపడిపోయింది. దీంతో జేసీ ప్రభాకర్ రెడ్డికి తీవ్ర స్థాయిలో నష్టం వాటిల్లింది. డిసెంబరు 31న తాను మహిళల కోసం ప్రత్యేకంగా నది ఒడ్డున నూతన సంవత్సర వేడుకలను నిర్వహించానన్న అక్కసుతో బీజేపీ నేతలు తన బస్సులను తగులపెట్టారని ఆయన నేరుగా ఆరోపించారు. ఆ వేడుకలకు వెళ్లవద్దని బీజేపీ నేతలు బాహాటంగానే ప్రకటించడాన్నిఆయన గుర్తు చేశారు. తన బస్సులను తగులపెట్టింది బీజేపీ వారేనని, జగనే నయమంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారాయి. పోలీసులు కూడా బీజేపీ నేతలకు వత్తాసు పలుకుతున్నారంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి ఫైర్ అవుతుండటంతో జేసీని ఆపెదెలా? అని ఇప్పుడు కూటమి నేతలు తలలు పట్టుకుంటున్నారు.

ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Desh Telugu Keyboard and Download The App Now

Tags:    

Similar News