Tdp, Janasena : బీజేపీ కూటమిలో చేరక ముందే నేడు తొలి జాబితా విడుదల?
నేడు తొలి జాబితా విడుదల చేసేందుకు టీడీపీ, జనసేన కూటమి సిద్ధమయింది.
నేడు తొలి జాబితా విడుదల చేసేందుకు టీడీపీ, జనసేన కూటమి సిద్ధమయింది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌లు సంయుక్తంగా తొలి జాబితాను ప్రకటించనున్నారు. ఈ మేరకు జాబితా కసరత్తు పూర్తయింది. బీజేపీ ఈ కూటమిలోకి వస్తుందా? రాదా? అన్న అంశం తేలకముందే రెండు పార్టీల అధినేతలు ఈ జాబితాను ప్రకటించాలని నిర్ణయించారు. తొలి జాబితాలో అరవై నుంచి డెబ్బయి స్థానాల్లో అభ్యర్తులను ప్రకటించే అవకాశముంది.
ఆయనే జాబితా....
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు గత కొంతకాలంగా జాబితాపై కసరత్తులు చేస్తున్నారు. సీనియర్లను పక్కన పెట్టైనా వైసీపీ అభ్యర్థులను ధీటుగా ఎదుర్కొనేందుకు అవసరమైన నాయకల పేర్లను వడపోత పోశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఆయన ఒక్కరే ఈ కసరత్తు చేశారు. కార్యకర్తల నుంచి ఫీడ్ బ్యాక్ తెప్పించుకుని ఒక్కొక్క నియోజకవర్గానికి ఇద్దరు ముగ్గురు అభ్యర్థులపై సర్వే నిర్వహించి మరీ జాబితాను రూపొందించారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు అలాంటి సమస్య లేదు. తనకు ఓటు బ్యాంకు ఉన్న చోట బలమైన నేతలను ఆయన ముందుగానే ఎంచుకున్నారు.
బీజేపీ చేరినా....
ఇంకా ఎన్నికలకు యాభై రోజులు మాత్రమే సమయం ఉండటంతో అభ్యర్థులు ప్రచారం నిర్వహించుకోవడానికి వీలుగా తొలి జాబితాను విడుదల చేయడానికి రెండు పార్టీలూ నిర్ణయించుకున్నారు. బీజేపీ ఒకవేళ తమ కూటమిలోకి వస్తే అన్న విషయాన్ని కూడా ఆలోచించి ఆ పార్టీ కోరుకునే అవకాశమున్న నియోజకవర్గాలను మాత్రం పక్కన పెట్టి సాలిడ్ గా తాము పోటీ చేస్తామన్న నిర్ణయానికి వచ్చిన చోట మాత్రమే అభ్యర్థుల ప్రకటన ఉంటుందని పార్టీ వర్గాలు వెల్లడించాయి.
గతంలోనే అవగాహన....
పార్టీ సీనియర్ నేతల సమక్షంలో రెండు పార్టీల నేతలు తొలి జాబితాను విడుదల చేయనున్నారు. ఉదయం 11.40 గంటలకు ఈ జాబితాను విడుదల చేయాలని నిర్ణయించారు. పవన్ కల్యాణ్, చంద్రబాబు నిన్న రాత్రే విజయవాడకు చేరుకున్నారు. ఇప్పటికే జనసేన, టీడీపీ అధినేతల మధ్య పలుసార్లు చర్చలు జరగడంతో వారి మధ్య సీట్ల క్లారిటీ వచ్చింది. వాటిలో కూడా నేడు అభ్యర్థులను ప్రకటించే అవకాశముంది. దీంతో ఈరోజు తొలి జాబితా కోసం అటు తెలుగు తమ్ముళ్లు, ఇటు జనసైనికులు ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు.