TDP : వైఎస్ జగన్ ను దెబ్బతీయడానికి టీడీపీ భారీ స్కెచ్.. ఇంకా పార్టీ మారే నేతలు ఎవరెవరంటే?

వైసీపీ అధినేత జగన్ ను దెబ్బతీయడానికి తెలుగుదేశం పార్టీ భారీ స్కెచ్ వేసింది.

Update: 2024-09-01 06:02 GMT

వైసీపీ అధినేత జగన్ ను దెబ్బతీయడానికి తెలుగుదేశం పార్టీ భారీ స్కెచ్ వేసింది. జగన్ కు ఢిల్లీలో ఉన్న పరపతికి బ్రేకులు వేయడానికి ప్లాన్లు సిద్ధం చేస్తుంది. చంద్రబాబు ప్లాన్ దెబ్బకు ఫ్యాన్ పార్టీ విలవిలలాడుతుంది. జగన్ తో పాటు వైసీపీ సీనియర్ నేతలను కూడా మానసికంగా దెబ్బతీసే విధంగా వ్యూహాలు ఉండనున్నాయి. ఇప్పుడేముంది .. ఇంకా వందరోజులు కాలేదు. ముందుంది ముసళ్ల పండగ అంటూ టీడీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు వైసీపీ హైకమాండ్ ను మరింత కలవరపెడుతున్నాయి. జగన్ పార్టీని ఖాళీ చేయడమే లక్ష్యంగా టీడీపీ ముందుకు వెళుతుంది. కొందరిని జనసేనలోకి, మరికొందరిని టీడీపీలోకి తీసుకునే ప్రయత్నం చేస్తుంది.

ఇంకా ఎందరు?
ఇప్పటికే ముగ్గురు ఎమ్మెల్సీలు, ఇద్దరు రాజ్యసభ సభ్యులు పార్టీతో పాటు తమ సభ్యత్వాలకు కూడా రాజీనామాలు చేశారు. పదవులకు కూడా రిజైన్ చేసి ఫ్యాన్ పార్టీ అధినేతకు ఝలక్ ఇచ్చారు. రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావుతో పాటు ఎమ్మెల్సీలు పోతుల సునీత, బల్లి కల్యాణ చక్రవర్తి, కర్రి పద్మశ్రీలు రాజీనామాలు చేశారు. ఎమ్మెల్సీలు, రాజ్యసభ స్థానాలకు త్వరలోనే ఎన్నికలు జరగనున్నాయి. శాసనసభలో 164 మంది సభ్యుల బలం ఉన్న కూటమి ప్రభుత్వానికి ఏ పదవి ఖాళీ అయినా దానిని సులువుగా సొంతం చేసుకుంటుంది. అందుకే ఈ రెండింటిపైనా టీడీపీ అధినేత చంద్రబాబు ఫోకస్ పెంచారు.
పరపతిని తగ్గంచడానికి...
వైసీపీకి రాజ్యసభలో పదకొండు మంది సభ్యులున్నారు. అందుకే జగన్ విషయంలో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కొంత మెతక వైఖరిని అవలంబిస్తుందన్న అనుమానాలున్నాయి. ఇటీవల వైసీపీ రాజ్యసభ సభ్యుడు అమిత్ షాను కలవడం కూడా ఈ అనుమానం మరింత బలపడింది. అందుకే జగన్ ను ఢిల్లీ స్థాయిలో వీక్ చేయాలంటే రాజ్యసభలో వైసీపీ బలాన్ని తగ్గించాలన్న యోచనలో ఉంది. అందుకే ఆపరేషన్ రాజ్యసభను టీడీపీ అధినేత చంద్రబాబు ప్రారంభించారంటున్నారు. ప్రస్తుతం టీడీపీకి రాజ్యసభలో జీరో అయింది. ఖాళీ అయిన టీడీపీకి రాజ్యసభలో చోటు కల్పించే ప్రయత్నం కూడా మరొకటిగా చెబుతున్నారు.
హామీలు ఇవేనట...
వచ్చే ఎన్నికల నాటికి నియోజకవర్గాల సంఖ్య భారీగా పెరగనున్నాయి. అందుకే రానున్న ఎన్నికల్లో పార్టీకి, పదవులకు రాజీనామా చేసిన ఎమ్మెల్సీలు, రాజ్యసభ సభ్యులకు టిక్కెట్ హామీ ఇస్తున్నారన్న ప్రచారం బలంగా జరుగుతుంది. నేతల ట్రాక్ రికార్డు చూసి పార్టీలోకి తీసుకుంటామని చెబుతున్నప్పటికీ, అధికారం లేనప్పుడు పార్టీ మారడం సహజమేనని, అలా అని నియోజకవర్గాల్లో బలమున్న నేతలను పోగొట్టుకోవడం ఎందుకన్న ప్రశ్న నాయకత్వం నుంచి వస్తుంది. దీంతో పాటు నామినేషన్ పోస్టుల్లో మాత్రం వీరికి అవకాశం కల్పించే ప్రసక్తే లేదని చెబుతున్నారు. నామినేటెడ్ పోస్టుల భర్తీ ఆలస్యమవుతున్నందుకు ఇదే కారణమని నేతలు భావిస్తుండటంతో టీడీపీ అధినేత చంద్రబాబు నేతలకు ఆ భరోసా ఇచ్చారట. మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ లో ఆపరేషన్ వైసీపీ స్టార్టయింది.


Tags:    

Similar News