Janasena : జనసేన ఇప్పటికైనా క్షేత్రస్థాయిలో బలం పెంచుకునే ప్రయత్నం చేస్తుందా? లేదా?
పదేళ్ల పవన్ కల్యాణ్ ప్రయత్నం ఫలించింది. ఆయన అనుకున్నది సాధించారు. పదేళ్ల పాటు పార్టీని ఒంటి చేత్తో నడిపారు.
పదేళ్ల పవన్ కల్యాణ్ ప్రయత్నం ఫలించింది. ఆయన అనుకున్నది సాధించారు. పదేళ్ల పాటు పార్టీని ఒంటి చేత్తో నడిపారు. 2014లో పవన్ కల్యాణ్ జనసేన పార్టీని ప్రారంభించినప్పుడు ఆయనతో ఎంతో మంది ఉన్నారు. నేతలు వరసబెట్టి చేరి ఆయనకు అండగా నిలుద్దామని వచ్చారు. కానీ ఏ ఒక్కరూ ఆయన వెన్నంటి నిలవలేదు. మాదాసు గంగాధరం నుంచి జేడీ లక్ష్మీనారాయణ వరకూ పార్టీని వదిలి పెట్టారు. కేవలం ఓటమిని చూసి ఇక ఈ పార్టీ పుంజుకోదన్న ఉద్దేశ్యంతోనే అనేక మంది నేతలు పార్టని నిర్దాక్షిణ్యంగా వదలి వెళ్లిపోయారు. వెళుతూ వెళుతూ పవన్ పై బురద జల్లే వారు కొందరైతే... మరికొందరు తీవ్రంగా దుర్భాషలాడిన వారు కూడా లేకపోలేదు.
వెళ్లిన వాళ్లంతా...
ఇప్పుడు వారందరూ బాధపడక తప్పదు. ఎందుకంటే పార్టీలోనే కొనసాగి ఉంటే ఈ పరిస్థితి తలెత్తేది కాదు గదా? అన్న ప్రశ్న వారు వేసుకుంటే సహజంగానే వెళ్లిన నేతల బాధగా ఫీలవుతారు. నేతలు ఎవరు వెళ్లిపోతున్నా పవన్ కల్యాణ్ మాత్రం పట్టించుకోలేదు. కేవలం తన వెంట వచ్చే వారు, ఉన్న వారే చాలు అనుకున్నారు. అదే స్ట్రాటజీని ఆయన నమ్ముకున్నారు. ఇప్పుడు విజయం సాధించారు. ఒకటి కాదు.. రెండు కాదు.. 21 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసి అన్ని స్థానాల్లోనూ గెలిచారు. బహుశా ఆయన కూడా ఈ విజయాన్ని ఊహించి ఉండరు. కనీస స్థానాలు వస్తాయని అంచనా వేసి ఉండవచ్చు కానీ హండ్రెడ్ పర్సెంట్ స్ట్రయిక్ రేట్ ను ఆయన కూడా ఊహించ లేదు.
పదేళ్ల పాటు...
నిజంగా చెప్పాలంటే పవన్ కల్యాణ్ పదేళ్ల పాటు పార్టీని పట్టించుకోలేదు. నియోజకవర్గాల్లో ఇన్‌ఛార్జులను కూడా నియమించలేదు. ఎందుకంటే పార్టీ పేరుచెప్పుకొని ఎవరు ఏ పనిచేసినా అది పార్టీపై పడుతుందని ఆయన భయపడి ఉండవచ్చు. దీంతో పాటు ఆయన బలమైన స్థానాలను అక్కడే పార్టీని బలోపేతం చేయాలని నిర్ణయించుకుని ఉండవచ్చు. అందుకే కొన్ని జిల్లాలు, కొన్ని నియోజకవర్గాల్లోనే ఇన్‌ఛార్జులను నియమించారు. ఆయన పర్యటనలు కూడా కొన్ని ప్రాంతాలకే పరిమితం చేసుకున్నారు. తన బలమేంటో తనకు తెలుసు అని నేరుగా బయటకు చెప్పుకునే నేత కావడంతో పవన్ బూత్ లెవెల్ కమిటీలను కూడా ఇప్పటి వరకూ ఏర్పాటు చేయలేదు. మొన్నటి ఎన్నికల్లో అందరూ కలసి సమిష్టిగా పనిచేసి ఇంతటి విజయాన్ని సాధించిపెట్టారు.
అధికారంలో ఉండటంతో...
అయితే ఇప్పడు అధికారంలోకి వచ్చింది జనసేన. ఉపముఖ్యమంత్రిగా కీలక పొజిషన్ లో పవన్ కల్యాణ్ ఉన్నారు. పార్టీకి మంచి హైప్ వచ్చింది. ఒకవైపు ప్రభుత్వ పరంగా మంచి పనులు చేస్తూనే మరొక వైపు పార్టీని విస్తరించుకునే ప్రయత్నం పవన్ చేయాలన్నది జనసేన అభిమానుల ఆకాంక్షగా వినిపిస్తుంది. అధికారంలో ఉంది కాబట్టి నేతలు కూడా ముందుకు వచ్చి పార్టీ జెండాను పట్టుకోవడమే కాకుండా, ఆ నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి పాటుపడతారు. ముఖ్యంగా చిత్తూరు, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో పార్టీ బలపడాల్సిన అవసరం ఉందంటున్నారు. మరిపవన్ కల్యాణ్ ఈ ఐదేళ్లలో ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రి పదవికే పరిమితమవుతారా? పార్టీని విస్తరిస్తారా? అన్నది చూడాల్సి ఉంది.