Tirumala : తిరుమలలో గురువారం భక్తుల రద్దీ ఇలా
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. గురవారం కూడా భక్తులు అధిక సంఖ్యలో తిరుమలకు తరలి వస్తున్నారు;

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. గురవారం కూడా భక్తులు అధిక సంఖ్యలో తిరుమలకు తరలి వస్తున్నారు. పెళ్లిళ్ల సీజన్ కావడంతో పాటు పరీక్షలు ముగియడం కూడా ఒక్కసారిగా రద్దీ పెరగడానికి కారణంగా చెబుతున్నారు. ఇంటర్మీడియట్ పరీక్షలు పూర్తి కావడంతో పాటు కొన్ని పోటీ పరీక్షలు ముందు నిర్వహిస్తామని ప్రకటించడంతో స్వామి వారికి మొక్కులు తీర్చుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలి వస్తున్నారు. గత పదిహేను రోజు లనుంచి తిరుమలలో భక్తుల తాకిడి ఎక్కువగా ఉందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు.
వేసవి కాలంలో...
వేసవి కాలంలో సహజంగానే భక్తుల రద్దీ తిరుమలకు ఎక్కువగా ఉంటుంది. ముందుగా బుక్ చేసుకున్న భక్తులతో పాటు రోజువారీ టోకెన్లు తీసుకునే వారి సంఖ్య, కాలినడకన తిరుమలకు చేరుకునే వారితో భక్తులతో తిరుమల వీధులన్నీ కిటకిటలాడుతున్నాయి. మాడ వీధులన్నీ గోవింద నామస్మరణలతో మారుమోగిపోతున్నాయి. దీంతో తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు భక్తులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా అన్ని ఏర్పాట్లను చేస్తున్నారు. భక్తులకు వేసవి తీవ్రత తగలకుండా టీటీడీ అధికారులు తగిన చర్యలు తీసుకుంటున్నారు.
31 కంపార్ట్ మెంట్లలో...
ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్ మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. ఉచిత దర్శనం క్యూ లైన్ లోకి ఉదయం టోకెన్లు లేకుండా ప్రవేశించి వేచి ఉన్న భక్తులకు శ్రీవారి దర్శనం పద్దెనిమిది గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు ఐదు గంటలకు పైగానే సమయం పడుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లను కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం మూడు నుంచి నాలుగు గంటలకు పైగానే సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. భక్తులకు క్యూ లైన్ లలోనే అన్న ప్రసాదాలను, మజ్జిగ, తాగునీటిని పంపిణీ చేస్తున్నారు. నిన్న తిరుమల శ్రీవారిని 75,354 భక్తులు సందర్శించుకున్నారు. 28,510 మంది తలనీలాలను సమర్పించుకున్నారు. కంపార్ట్ మెంట్లన్నీ నిండిపోయి బయట వరకూ క్యూ లైన్ విస్తరించింది. ఏటీసీ వరకూ భక్తులు క్యూ లైన్ లో నిల్చుని ఉన్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.54 కోట్ల రూపాయలు వచ్చిందని అధికారులు తెలిపారు.