Ap Elections Counting : ఏపీకి వెళ్లకపోవడమే మంచిది.. ఎవరి ఊరిలో వారు ఉండటం ఉత్తమం లేకుంటే?

ఆంధ్రప్రదేశ్ లో కౌంటింగ్ కు పెద్దగా సమయం లేదు. దీంతో పోలీసులు అన్ని ప్రాంతాలలో మొహరించారు.

Update: 2024-06-03 06:07 GMT

ఆంధ్రప్రదేశ్ లో కౌంటింగ్ కు పెద్దగా సమయం లేదు. దీంతో పోలీసులు అన్ని ప్రాంతాలలో మొహరించారు. ఎంతగా అంటే వ్యాపారాలు బంద్ చేయాలని సూచిస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి కౌంటింగ్ తర్వాత కూడా అల్లర్లు జరుగుతాయని నిఘా వర్గాల హెచ్చరికలతో పోలీసు యంత్రాంగం అప్రమత్తమయింది. బయట వారిని ఎవరినీ నియోజకవర్గంలోకి అడుగు పెట్టనివ్వడం లేదు. కొత్త వ్యక్తులు కనిపిస్తే వెంటనే తమకు సమాచారం ఇవ్వాలని పోలీసులు లాడ్జి యజమానులను ఆదేశించారు. అలాగే కొత్త వ్యక్తులు నియోజకవర్గంలో కనపడితే అదుపులోకి తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు. ఈ మూడు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ లో ఒక ఊరి నుంచి మరొక ఊరికి వెళ్లకపోవడమే మంచిదన్న తరహాలో పోలీసులు నిషేధాజ్ఞలు అమలు చేస్తున్నారు. ఒక రకంగా అప్రకటిత కర్ఫ్యూ ను అమలు చేస్తున్నారు.

వ్యాపారాలన్నింటినీ...
ప్రధానంగా రాయలసీమ, పల్నాడు జిల్లాల్లో ఇది మరింత ఎక్కువగా కనిపిస్తుంది. పల్నాడు జిల్లాలో ఐదు రోజుల ముందు నుంచే వ్యాపారాలను బంద్ చేయాలని ఆదేశాలు జారీ చేశారంటే పరిస్థితి తీవ్రత అర్థం చేసుకోవచ్చు. కేవలం పాలు, మందులు వంటి అత్యవసర వ్యాపారాలకు మాత్రమే మినహాయింపు ఇచ్చారు. మిగిలిన దుకాణాలన్నీ మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు. టీ కొట్టు నుంచి టిఫిన్ సెంటర్ల వరకూ హోటళ్లు, వస్త్ర దుకాణాలు, జ్యుయలరీ షాపులు వంటివి తెరవవద్దని కూడా ఆదేశాలు అందాయి. ఇక పెట్రోలు బంకుల వద్ద కూడా సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షిస్తున్నారు. ఎవరికీ బాటిల్స్ లో పెట్రోలు ఇవ్వవద్దంటూ పోలీసులు ఆదేశాలు జారీ చేశారు.
రెడ్ జోన్ గా ప్రకటించి...
రాయలసీమలోని తాడిపత్రి, చంద్రగిరి నియోజకవర్గంలోనూ అత్యధిక సంఖ్యలో పోలీసులు మొహరించారు. తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డి, మాజీ ఎమ్మెల్యే జేసీ దివాకర్ రెడ్డిలను కౌంటింగ్ పూర్తయ్యే వరకూ తాడిపత్రిలోకి అడుగుపెట్టవద్దని ఆంక్షలు విధించారు. చంద్రగిరిలోనూ అనుమానాస్పదంగా తిరుగుతున్న వారిని అదుపులోకి తీసుకుంటున్నారు. గతంలో కేసులు నమోదయిన వారిని నియోజకవర్గం నుంచి బహిష్కరిస్తున్నారు. రౌడీ షీటర్లను నగరంలో ఉండకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు. ఊరేగింపులు, బాణాసంచా పేలుడు వంటి వాటికి అనుమతి లేదు. ఇక రాష్ట్రమంతటా రెడ్ జోన్ గా ప్రకటించారు. 144 సెక్షన్ తో పాటు సెక్షన్ 30 అమలులో ఉందని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇస్తున్నారు.


Tags:    

Similar News