వైసీపీ ఎమ్మెల్యేను పొగడటంపై.. కేశినేని నాని వివరణ ఇదే.!
ఎమ్మెల్యేపై ప్రతిపక్ష పార్టీ ఎంపీ ప్రశంసలు కురిపించడం ఇరు పార్టీల్లో హాట్ టాపిక్‌గా మారింది. దీనిపై ఇవాళ ఆ ఎంపీ వివరణ కూడా ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు ఎలా ఉంటాయో అందరికీ తెలిసిందే. అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య నిత్యం మాటల యుద్ధం నడుస్తుంటుంది. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోనిది నిద్ర కూడా పట్టదు. ఇలాంటి సమయంలో రాష్ట్రంలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఓ ప్రతిపక్ష ఎంపీ.. అధికార పార్టీ ఎమ్మెల్యేని పొగడ్తలతో ముంచెత్తారు. ఎమ్మెల్యే నియోజకవర్గానికి తన ఎంపీ నిధులను కూడా కేటాయించారు. అయితే సదరు ఎమ్మెల్యేపై ప్రతిపక్ష పార్టీ ఎంపీ ప్రశంసలు కురిపించడం ఇరు పార్టీల్లో హాట్ టాపిక్‌గా మారింది. దీనిపై ఇవాళ ఆ ఎంపీ వివరణ కూడా ఇచ్చారు. ఎవరూ మంచి పనులు చేస్తే వారిని అభినందిస్తానని, అందులో ఎలాంటి సందేహం లేదంటూ.. నందిగామ వైసీపీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావుపై కురిపించిన ప్రశంసలకు సంబంధించి వివరణ ఇచ్చారు.
ఎమ్మెల్యే జగన్మోహన్ తనకు నాలుగు ఏళ్లుగా తెలుసునని, నియోజకవర్గానికి మంచి చేస్తున్నారు కాబట్టి ప్రశంసించానని తెలిపారు. మంచి చేస్తే అభినందిస్తాం.. అంతేకానీ మైనింగ్‌లో వాటాలు ఇవ్వకపోతే ధర్నాలు చేయడంతో, బ్లాక్ మెయిల్ చేయడం తనకు రాదన్నారు. విజయవాడ పార్లమెంటరీ నియోజకవర్గానికి ఎవరూ మంచి చేసే వారితో కలిసి నడుస్తానని పేర్కొన్నారు. బెజవాడ డెవలప్‌మెంట్ కోసం ముళ్ల పందితోనైనా కలిసి పని చేస్తానన్నారు. ఎంపీగా ఉన్నా లేకపోయినా బెజవాడ ప్రజలకు నిరంతరం సేవ చేస్తానన్నారు. తాను, తన కుటుంబం రాజకీయాల్లో జీవితాంతం ఉండాలని కోరుకునే వ్యక్తిని కాదని ఎంపీ కేశినాని స్పష్టం చేశారు.
నిన్న నందిగామ నియోజకవర్గంలోని తోటరావులపాడులో ఎమ్మెల్యే జగన్మోహన్ రావుతో కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాలను ఎంపీ కేశినేని నాని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎలక్షన్స్ టైంలోనే రాజకీయాలు చేస్తామని, ఆ తర్వాత అభివృద్ధిపై సారిస్తామని చెప్పుకొచ్చారు. అధికార ప్రతిపక్ష పార్టీలు కలిసి పనిచేస్తే దేశం చాలా అభివృద్ధి చెందుతుందని ఎంపీ కేశినేని నాని అన్నారు. ఇక ఎంపీ కేశినేని నానిపై కూడా ఎమ్మెల్యే జగన్మోహన్ రావు ప్రశంసలు కురిపించారు. కేశినేని నాని ప్రజా సమస్యలపై పోరాడుతూ, అభివృద్ధిలో ఎప్పుడూ ముందుంటారని అన్నారు. టీడీపీ, వైసీపీల ఐడీయాలజీలు వేరైనా అభివృద్ధి కోసం కలిసి పనిచేస్తామని వెల్లడించారు.