జనంలోకి వెళ్లండి.. పెద్దగా సమయం లేదు : జగన్
వైసీపీ కొత్తగా నాలుగు కార్యక్రమాలను ప్రకటించింది. నాలుగు కార్యక్రమాలతో ప్రజల ముందుకు వెళ్లాలని నిర్ణయించింది.
వైసీపీ కొత్తగా నాలుగు కార్యక్రమాలను ప్రకటించింది. నాలుగు కార్యక్రమాలతో ప్రజల ముందుకు వెళ్లాలని నిర్ణయించింది. వైసీపీ సర్వసభ్య సమావేశం కొద్దిసేపటి క్రితం విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ప్రారంభమయింది. ప్రాంగణానికి చేరుకున్న వైసీపీ అధినేత జగన్ తొలుత దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూల మాల వేసి నివాళులర్పించారు. అనంతరం కార్యక్రమాన్ని మాజీ మంత్రి కురసాల కన్నబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా నాలుగు కార్యక్రమాలతో జనం ముందుకు వెళ్లాలని వైసీపీ నిర్ణయించింది.
గతంలో ఎన్నడూ లేని...
అందులో ఒకటి జగనన్న ఆరోగ్య సురక్ష, రెండు వై ఏపీ నీడ్స్ జగన్, మూడు ఆడుదాం ఆంధ్ర, నాలుగు బస్సుయాత్రలతో ప్రజల వద్దకు వెళ్లి ప్రభుత్వం ఇప్పటి వరకూ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలను వివరించాలని నిర్ణయించారు. అనంతరం వైసీపీ అధినేత జగన్ మాట్లాడుతూ ఇక్కడికి వచ్చిన అందరూ తన కుటుంబ సభ్యులని అన్నారు. అన్ని సామాజికవర్గాలను ప్రేమిస్తూ దగ్గరకు తీసుకున్నామని తెలిపారు. రాష్ట్ర చరిత్రలో 52 నెలల్లో గతంలో ఎన్నడూ లేని అభివృద్ధి చేశామని జగన్ తెలిపారు. రెండు లక్షల కోట్ల రూపాయలు లబ్దిదారులకు బటన్ నొక్కి నేరుగా అందచేశానని తెలిపారు.
ఇచ్చిన హామీలను...
మేనిఫేస్టోలో ఇచ్చిన 99 శాతం హామీలను అమలు చేశామని జగన్ తెలిపారు. ప్రజలకు తొలిసేవకుడిగా బాధ్యతతో వ్యవహరించానని అన్నారు. గ్రామ స్థాయిలో సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చామని తెలిపారు. అందరికీ పక్కా ఇళ్లను నిర్మించి ఇవ్వాలన్న తపనతో ముందుకు వెళుతున్నామని చెప్పారు. విద్య, వైద్య, వ్యవసాయ రంగాల్లో సమూలమైన మార్పులు తీసుకొచ్చామని చెప్పారు. ఈ నాలుగేళ్లలో వ్యవస్థల్లోనూ, పరిపాలనల్లోనూ సమూల మార్పులు తెచ్చామని చెప్పారు. 31 లక్షల మంది అక్కా చెల్లెళ్లకు ఇళ్ల పట్టాలు తీసుకొచ్చామని చెప్పారు. స్థానిక సంస్థల నుంచి మంత్రివర్గం వరకూ సామాజిక న్యాయం అమలు చేశామని అన్నారు. అక్టోబరు 25వ తేదీ నుంచి డిసెంబరు 31వ తేదీ వరకూ బస్సు యాత్ర నిర్వహించాలన్నారు. అరవై రోజుల పాటు ప్రతి రోజూ మూడు ప్రాంతాల్లో మూడు బహిరంగ సభలు జరపాలన్నారు. ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో ఈ బస్సు యాత్ర జరుగుతుందని తెలిపారు. ఇదొక సామాజిక న్యాయ యాత్ర అని ఆయన తెలిపారు.
జనంలోనే ఉండండి...
బహుశ మార్చి, ఏప్రిల్ నెలలో ఎన్నికలు జరుగుతాయని అన్నారు. మూడు ప్రాంతాల ఆత్మగౌరవం నింపేలా మూడు రాజధానులను ఏర్పాటు చేయడానికి అడుగు వేశామని తెలిపారు. గ్రామ స్థాయిలో ప్రజలకు అర్థమయ్యేలా వివరించాలని అన్నారు. రాబోయే నెలలో జగనన్న ఆరోగ్య సురక్ష, వై ఏపీ నీడ్స్ జగన్, ఆడుదాం ఆంధ్ర, బస్సుయాత్రలపై జనంలో అవగాహన కల్పించాలని కోరారు. రాష్ట్రంలో ఏ కుటుంబం వ్యాధుల బారిన పడటానికి వీలులేదన్నారు. ప్రజలందరి ఆశీస్సులతో మనందరి ప్రభుత్వం మరోసారి కొనసాగాల్సిన అవసరమే వై ఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమం అని తెలిపారు. ఇది నవంబరు 1వ తేదీ నుంచి ఈ కార్యక్రమం మొదలవుతుందని తెలిపారు. నవంబరు 1వ తేదీ నుంచి డిసెంబరు 10వరకూ నిర్వహించాలన్నారు. గత ప్రభుత్వం పెట్టిన మ్యానిఫేస్టో, అమలు చేశారో? ప్రజలను ఎలా మోసం చేశారో వివరించాలని కోరారు. రేపు జరగబోయేది కులాల మధ్య యుద్ధం కాదని, పేదలకు, పెత్తందార్లకు మధ్య వార్ జరుగుతుందని తెలిపారు. పేదలు మొత్తం ఏకం కావాలని జగన్ పిలుపునిచ్చారు. డిసెంబరు పదకొండో తేదీ నుంచి ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం మొదలవుతుందని తెలిపారు. డిసెంబరు పదకొండు నుంచి జనవరి పదిహేనో తేదీ వరకూ రాష్ట్ర వ్యాప్తంగా క్రీడా సంబరం ద్వారా నైపుణ్యం ఉన్న వారిని గుర్తించి ప్రోత్సహించాలన్నదే ప్రభుత్వ ఉద్దేశ్యమని తెలిపారు.