Ys Jagan : జగన్ కు ఐదేళ్లు అంత ఈజీ కాదు.. నేతలను కాపాడుకోవడం కష్టమేనట

వైసీపీ అధినేత జగన్ కు రానున్న కాలం గడ్డుకాలమే. ఒకవైపు కేసులు.. మరొక వైపు పార్టీని వీడనున్న నేతలు

Update: 2024-06-19 06:14 GMT

వైసీపీ అధినేతకు రానున్న కాలం గడ్డుకాలమే. ఒకవైపు కేసులు.. మరొక వైపు పార్టీని వీడనున్న నేతలు. వీటన్నింటిని తట్టుకుని ఐదేళ్ల పాటు పార్టీని ముందుకు తీసుకెళ్లాలి. అది అంత సులువైన టాస్క్ కాదు. ఎందుకంటే.. ప్రస్తుత రాజకీయనేతలు అధికారం ఎటు వైపు ఉంటే అటువైపే మొగ్గు చూపుతారు. ఎవరో తక్కువ శాతం మంది తమకు మరొక దారి లేక ప్రతిపక్షంలో ఉండే పార్టీలో కొనసాగాల్సిందే తప్ప మిగిలిన వారికి ఐదేళ్లు ప్రతిపక్షంలో ఉండటాన్ని భరించలేరు. అధికార పార్టీలో ఉంటే మర్యాదకు మర్యాద.. గౌరవానికి గౌరవం. అంతే.. ఇప్పుడు రాజకీయాలన్నీ అలాగే ఉన్నాయి. అందుకే జగన్ పార్టీ నేతలను కాపాడుకోవడం పెద్ద టాస్క్ అనే చెప్పాలి. తాను ఎంత ధైర్యాన్ని నూరిపోసినా జారిపోయే వాళ్లు ఆగరు. వెళ్లిపోయేవారిని ఆపలేని పరిస్థితుల్లో జగన్ ప్రస్తుతం ఉన్నారు. పదకొండు స్థానాలే రావడం భవిష‌్యత్ లో ఎమ్మెల్సీ, రాజ్యసభ స్థానాలు వంటివి దక్కకపోవడం ఈ పరిస్థితికి కారణంగా చెప్పవచ్చు.

పదకొండు స్థానాలకే...
పొరుగు రాష్ట్రమైన తెలంగాణలో బీఆర్ఎస్ పరిస్థితిని చూసిన తర్వాత వైసీపీ ఇందుకు మినహాయింపు కాదని అనిపిస్తుంది. దాదాపు పదేళ్ల పాటు బీఆర్ఎస్ పదవుల్లో అనేక పదవులు పొందిన వారు కూడా ఓటమి తర్వాత పార్టీకి గుడ్ బై చెప్పేశారు. కారు దిగేశారు. నిర్దాక్షిణ్యంగా తమకు పదవులు ఇచ్చిన పార్టీ నేతపైనే నిందలు వేసి వెళ్లిపోయారు. అలాంటిది జగన్ ఒక లెక్కా. అందులోనూ కేవలం పదకొండు స్థానాలకే పార్టీ పరిమితమయింది. మెజారిటీ కూడా గతంలో ఎన్నడూ లేని విధంగా కూటమి అభ్యర్థులు వైసీపీ నేతలపై సాధించి విజయం దక్కించుకున్నారు. ఇంతటి అసంతృప్తికి కారణమేంటో తెలియక నేతలు తలలు పట్టుకుంటున్నారు. ఎంతగా వెతికినా ప్రతి చిన్న విషయమూ పెద్ద కారణంగానే కనిపిస్తుంది తప్ప దారుణ ఓటమికి అసలు కారణం మాత్రం తెలియడం లేదు.
ఇమేజ్ పైనే అనుమానం...
ఇన్నాళ్లూ జగన్ ఇమేజ్ మీదనే ఆధారపడి గెలిచామని తమకు తాము నచ్చ చెప్పుకుంటూ నేతలు సర్దుకుపోయి పార్టీలో ఉన్నారు. తెలంగాణలోనూ బీఆర్ఎస్ నేతలదీ అదే పరిస్థితి.కేసీఆర్ ఇమేజ్ తోనే తాము రాజకీయాల్లో రాణించామని నమ్మిన నేతలు అధికారంలో కోల్పోగానే అటు వైపు చూడటం మానేశారు. జగన్ పరిస్థితి కూడా అంతే. ఈ ఓటమికి జగన్ మాత్రమే కారణమన్నది నేతల అభిప్రాయం. ప్రజల్లో ఎమ్మెల్యేలకు విలువ ఇవ్వకపోవడం వల్ల , కార్యకర్తలను పూర్తిగా నిర్లక్ష్యం చేయడం వల్ల ఈ దారుణ ఓటమికి కారణంగా చూస్తున్నారు. కేవలం సంక్షేమం ఫోకస్ పెట్టి అభివృద్ధి పనులు చేపట్టకపోవడంతో కార్యకర్తలకు కూడా ఎమ్మెల్యేలుగా తాము ఏమీ చేయలేక పోయామని కొందరు వైసీపీ నేతలు సన్నిహితుల వద్ద వాపోతున్నారట. అందుకే జగన్ తన వైఖరిని మార్చుకోవాలని, లేకుంటే పార్టీ తిరిగి పుంజుకోవడం కష్టమని చెబుతున్నారు.
నియోజకవర్గాల సంఖ్య పెరగనుండటంతో...
ఇప్పటికే కొన్ని కీలక నియోజకవర్గాల్లో ఓటమి పాలయిన నేతల్లో బలమైన లీడర్లను ఆకర్షించేందుకు టీడీపీ అప్పుడే ప్రయత్నాలు మొదలు పెట్టింది. సామాజికవర్గంగా, ఆర్థికంగా బలమైన నేతలను పార్టీలోకి తీసుకోవాలని యోచిస్తుంది. 2026లో నియోజకవర్గాల పునర్విభజన జరగనుండటంతో టిక్కెట్ ఇచ్చేదానికి కూడా హామీలు ఇస్తూ జగన్ ను మానసికంగా దెబ్బతీయాలన్న ప్లాన్ లో తెలుగుదేశం పార్టీ నాయకత్వం ఉంది. మరో యాభై నియోజకవర్గాలు పెరుగుతుండటంతో వచ్చే ఎన్నికలకు టిక్కెట్ హామీతో కొందరు నేతలు వైసీపీ నుంచి జంప్ అయ్యే అవకాశాలు మాత్రం పుష్కలంగా ఉన్నాయి. అందులో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఉండటం కూడా తమకు కలసి వస్తుందని భావిస్తున్నారు. మొత్తం మీద జగన్ పార్టీకి రానున్నవి గడ్డు రోజులే. కొందరు కీలక నేతలు జంప్ అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయన్నది కాదనలేని వాస్తవం. మరి జగన్ టీడీపీ బిగిన్ చేసిన ఈ ఆపరేషన్ నుంచి నేతలను ఎలా కాపాడుకుంటారో వెయిట్ చేయాల్సిందే.


Tags:    

Similar News