నేటి నుంచి వైసీపీ సామాజిక న్యాయ భేరి పేరుతో బస్సు యాత్ర
అరసవెల్లి సూర్యనారాయణస్వామిని మంత్రుల బృందం దర్శించుకుంటుంది. ఆ తర్వాత వైఎస్ఆర్, బిఆర్ అంబేద్కర్, బాబు జగజ్జీవన్‌రామ్
అమరావతి : వైసీపీ ప్రభుత్వం మరో యాత్రకు శ్రీకారం చుట్టింది. సామాజిక న్యాయ భేరి పేరుతో బస్సు యాత్రను నేటి నుండి చేపట్టనుంది. సిక్కోలు నుంచి అనంతపురం వరకు నాలుగు రోజుల పాటు ఈ బస్సు యాత్ర జరగనుంది. వైసీపీ పాలనలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు జరిగిన సామాజిక న్యాయాన్ని బస్సుయాత్ర ద్వారా ప్రజలకు వివరించాలని ప్రభుత్వం ప్లాన్ చేసింది. శ్రీకాకుళం జిల్లా నుంచి అనంతపురం వరకు 17 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన మంత్రులు బస్సు యాత్ర చేయనున్నారు. స్థానిక సంస్థల నుంచి రాజ్యసభ వరకు రాజకీయ పదవులు.. ఆయా వర్గాలకు ఏ విధంగా న్యాయం జరిగిందో వివరించనున్నారు. సామాజిక న్యాయభేరి బస్సు యాత్రను విజయవంతం చేయాలని మంత్రులు పిలుపునిచ్చారు.
అరసవెల్లి సూర్యనారాయణస్వామిని మంత్రుల బృందం దర్శించుకుంటుంది. ఆ తర్వాత వైఎస్ఆర్, బిఆర్ అంబేద్కర్, బాబు జగజ్జీవన్‌రామ్, జ్యోతిరావుపూలే, కోమురంభీం, అబ్దుల్ కలాం అజాద్ విగ్రహాలకు పూలమాలలు వేసి.. యాత్ర ఉద్దేశాన్ని వివరించి ఏడు రోడ్ల జంక్షన్ నుంచి బస్సు యాత్రను ప్రారంభించనున్నారు. మొదటి రోజు శ్రీకాకుళం, ఎచ్చెర్ల, రణస్థలం, పూసపాటిరేగ, నాతవలస జంక్షన్, డెంకాడ మీదుగా విజయనగరం చేరుకోనుంది. అక్కడ బహిరంగ సభ అనంతరం విశాఖకు బయల్దేరుతుంది.
మంత్రుల బస్సు యాత్రలో భాగంగా.. విజయనగరం జిల్లాలో తొలి బహిరంగ సభ, రాజమండ్రిలో రెండో బహిరంగ సభ, నర్సరావుపేటలో మూడో బహిరంగ సభ, అనంతపురంలో నాలుగో బహిరంగ సభ నిర్వహించి యాత్రను ముగించాలని మంత్రులు భావిస్తున్నారు. ఈ బస్సు యాత్రలో, వైసీపీ ప్రభుత్వ హయాంలో బలహీనవర్గాలకు ఉంటున్న ప్రాధాన్యం, అందుతున్న పథకాలను ప్రజలకు వివరించనున్నారు మంత్రులు. మంత్రులతో పాటు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు చెందిన నేతలు కూడా బహిరంగ సభల్లో పాల్గొననున్నారు. 29న అనంతపురంలో యాత్ర ముగుస్తుంది. బస్సుయాత్రలో భాగంగా 26న విజయనగరం, 27న రాజమహేంద్రవరంలో, 28న నరసరావుపేటలో, 29న అనంతపురంలో బహిరంగ సభలు నిర్వహిస్తారు.