CIBIL: ఎక్కువ క్రెడిట్‌ కార్డులు ఉంటే సిబిల్‌పై ప్రభావం పడుతుందా?

CIBIL Score: క్రెడిట్ కార్డ్‌లు మన ఖర్చులకు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. అవసరమైనప్పుడు క్రెడిట్‌ ..

Update: 2023-11-08 15:30 GMT

CIBIL Score: క్రెడిట్ కార్డ్‌లు మన ఖర్చులకు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. అవసరమైనప్పుడు క్రెడిట్‌ కార్డుపై కొనుగోళ్లు చేయడానికి అనుమతి ఉంటుంది. ఈ క్రెడిట్‌ కార్డులు.. రివార్డ్ పాయింట్‌లు, ఇతర ప్రయోజనాలతో వస్తాయి. వివిధ ప్రయోజనాలు, ఇతర అవసరాలను పొందడం కోసం చాలా మంది ఒకటి కంటే ఎక్కువ క్రెడిట్‌ కార్డులను తీసుకుంటారు. అయినా, అనేక క్రెడిట్ కార్డ్‌లను కలిగి ఉండటం వల్ల బాధ్యత కూడా పెరుగుతుంది. ఉదాహరణకు మీకు మూడు, నాలుగు అంతకంటే ఎక్కువ క్రెడిట్‌ కార్డులు ఉన్నట్లయితే అప్పులు పెరిగే అవకాశం ఉంది. ఈ పేరుకుపోయిన అప్పుల భారాన్ని నివారించడానికి మీరు మీ ఆర్థిక వ్యవహారాలను చాలా జాగ్రత్తగా నిర్వహించాల్సి ఉంటుంది. మీరు వాటిని సరిగా నిర్వహించడం కచ్చితంగా నేర్చుకోవాల్సిన అవసరముంది. మీ వద్ద ఎక్కువ కార్డ్‌లు ఉన్నట్లయితే అది మీకు పెద్ద సవాలుగా మారుతుంది. అందుకే క్రెడిట్‌ కార్డులను వాడే ముందు కాస్తా జాగ్రత్తగా వాడటం మంచిది. క్రెడిట్‌ కార్డు బిల్లు వచ్చిన తర్వాత ముందుగా గడువు తేదీని గుర్తించుకోవాలి. లేదంటే ఎప్పటికప్పుడు రిమైండర్‌లను తనిఖీ చేయడం మంచిది.

ఎక్కువ క్రెడిట్ కార్డులు ఉంటే..

ఎక్కువ క్రెడిట్‌ కార్డులు ఉంటే బిల్లులు సకాలంలో చెల్లింపులు చేసే విధానంలో ఇబ్బందిగా మారవచ్చు. మీ కార్డుపై చెల్లింపుల విషయంలో గడువు కోల్పోయినట్లయితే ఆలస్య రుసుముతో పాటు అధిక వడ్డీ భరించాల్సి ఉంటుంది. అంతేకాదు.. మీ క్రెడిట్ స్కోర్‌పై ప్రతికూల ప్రభావం పడవచ్చు. అందుకే ప్రతి కార్డుకు చెల్లింపు గడువు తేదీని గుర్తుంచుకోవడం చాలా ముఖ్యం. లేదంటే మీరు మీ ఫోన్‌లో రిమైండర్‌లను సెట్ చేసుకోండి. మీరు ఆటోమేటిక్ చెల్లింపు ఆప్షన్‌ను కూడా సెట్‌ చేసుకోవచ్చు. మరో ముఖ్యమైన అంశం ఏమిటంటే, మీరు బడ్జెట్ కు తగినట్లుగా ఖర్చు చేయడం మంచిది. మీ ఖర్చులను ఎప్పటికప్పుడు ట్రాక్ చేసుకుంటే చాలా బెటర్.

ఏ కార్డులకు ముందుగా బిల్లు చెల్లించాలి?

అధిక వ్యయం, పెరిగిన రుణ భారం పరిస్థితిని నివారించడానికి, మీ ఆదాయాన్ని అంచనా వేయడం చాలా కీలకం. మీ ఖర్చులను తగ్గించుకునే విధంగా ప్లాన్‌ చేసుకోండి. మీకు అవసరమైన ఖర్చుల కోసం నిర్దిష్ట మొత్తాన్ని కేటాయించండి. మీరు ఖర్చులను ఎక్కడ తగ్గించుకోవచ్చన్న విషయాన్ని నిశితంగా పరిశీలించండి. దీని వల్ల మీ క్రెడిట్ కార్డ్‌లను మరింత తెలివిగా ఉపయోగించుకోవడానికి అవకాశముంటుంది. ఇక మరో పాయింట్‌ ఏంటంటే.. అధిక-వడ్డీ, తేదీ రీపేమెంట్‌కు సంబంధించినది. వేర్వేరు క్రెడిట్ కార్డ్‌లు వేర్వేరు వడ్డీ రేట్లను కలిగి ఉంటాయి. అత్యధిక వడ్డీ రేటుతో ఉన్న క్రెడిట్‌ కార్డు బిల్లులను ముందుగా చెల్లించండి.


Full View

తర్వాత తక్కువ వడ్డీ రేటు కలిగి వున్న కార్డుల బిల్లులను చెల్లించండి. ఈ చిట్కాలు మీ క్రెడిట్ కార్డ్‌లను సమర్థవంతంగా నిర్వహించడమే కాకుండా ఖర్చులను ఆదా చేస్తాయి. మరో విషయం ఏంటంటే మీ క్రెడిట్ కార్డ్ స్టేట్‌మెంట్‌లను క్రమం తప్పకుండా తనిఖీ చేస్తూ ఉండండి. ఇది అన్ని ఛార్జీలు కరెక్ట్ గా ఉన్నాయా లేదా.. చెల్లింపులను కరెక్ట్ గా చేస్తున్నారా లేదా అన్న విషయాలను గుర్తించడంలో మీకు సహాయపడుతుంది.

అనధికారిక లావాదేవీలు

అనధికారిక లావాదేవీలు లేదా బిల్లింగ్ ఎర్రర్‌లపై శ్రద్ధ పెట్టాల్సిందే. ఇలాంటివి ఏవైనా గుర్తించినట్లయితే వెంటనే రిపోర్ట్ చేయండి. మీ స్టేట్‌మెంట్‌ను క్రమం తప్పకుండా తనిఖీ చేయడం వల్ల మీ ఖర్చుల విధానాలను సమీక్షించే అవకాశం ఉంటుంది. మీ క్రెడిట్ కార్డ్ ప్రయోజనాలు, రివార్డ్‌లను పూర్తిగా ఉపయోగించుకోండి. చాలా కార్డ్‌లు క్యాష్‌బ్యాక్‌లు, ఎయిర్‌లైన్స్‌, నిర్దిష్ట కొనుగోళ్లపై తగ్గింపు ఆఫర్‌లు వంటి ప్రత్యేక ప్రయోజనాలతో వస్తాయి. మీ బడ్జెట్‌ తగినట్లుగానే మీరు ప్రయోజనాలను పెంచుకునే విధంగా కార్డ్‌ని ఉపయోగించండి. మీరు అనవసరమైన ఖర్చులను కూడా ఆదా చేయవచ్చు. రివార్డు పాయింట్ల వస్తాయి కదా అని కూడా ఎక్కువ ఖర్చు చేసుకోకండి. దీని వల్ల మీపై అప్పుల భారం పెరుగుతుంది. ఇక క్రెడిట్‌ కార్డులు వాడుతతూ మీ సిబిల్‌ స్కోర్‌ను మెరుగుపర్చుకోవడానికి ప్రయత్నించండి.

కార్డు వాడకం

అనేక క్రెడిట్ కార్డ్‌లను బాధ్యతాయుతంగా నిర్వహించడం మీ క్రెడిట్ స్కోర్‌పై సానుకూల ప్రభావాన్ని చూపిస్తుంది. బిల్లులను సకాలంలో చెల్లిస్తూ మీ క్రెడిట్ కార్డ్ బ్యాలెన్స్‌ను చెక్‌ చేస్తూ తెలివిగా ఉపయోగించుకోండి. ఇవన్నీ మంచి స్కోర్‌ ను సాధించడంలో సహాయపడతాయి. . మీరు నిబంధనలను అనుసరిస్తే... సులభమైన రుణాలు పొందడం, తక్కువ వడ్డీ రేట్లను పొందడం వంటి ప్రయోజనాలను పొందుతారు. అందుకు క్రెడిట్‌ కార్డుల వాడకం విషయంలో కాస్త జాగ్రత్తలు తీసుకోవడం మంచిదంటున్నారు ఆర్థిక నిపుణులు.

Tags:    

Similar News