Gold Prices Today : భోగి రోజు మంటలు రేపిన పసిడి.. ఇంత ధర పెరిగితే ఎలా?
ఈరోజు దేశంలో బంగారం ధరలు భారీగా పెరిగాయి. పది గ్రాముల బంగారం ధర పై 320 రూపాయలు పెరిగింది. వెండి ధరలు కూడా పెరిగాయి
బంగారం ధరలకు పండగలు.. పబ్బాలంటూ ఏమీ ఉండవు. దాని పెరుగుదలకు అనేక కారణాలుంటాయి. అంతర్జాతీయ మార్కెట్ లో ధరల ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం, డాలర్ తో రూపాయి తగ్గుదల వంటి కారణాలతో ఎప్పటికప్పుడు పసిడి ధరలకు రెక్కలు వస్తుంటాయని మార్కెట్ నిపుణులు చెబుతుంటారు. పండగ కదా? అని ధరలు తగ్గించడానికి ఇవి కూరగాయలు కాదు.. బంగారం అంటున్నారు వ్యాపారులు. దానికి ఉన్న డిమాండ్ ను బట్టి ధరలలో మార్పులుంటాయని చెబుతున్నారు. అయితే ధరలు ఇంతగా పెరుగుతాయని ఊహించని కొనుగోలు దారులు మాత్రం పండగపూట షాక్ తిన్నట్లయింది.
కొనుగోళ్లు తగ్గాయా?
పేద, మధ్య తరగతి ప్రజలు బంగారాన్ని కొనుగోలు చేయడం ఎప్పుడో మానేశారు. అత్యవసరమైతే.. అదీ కుటుంబంలో శుభకార్యాలుంటే తప్ప కొనుగోలు చేయడం లేదు. ధరలు విపరీతంగా పెరగడంతో ధనిక వర్గాల ప్రజలు కూడా ఆలోచనలో పడ్డారు. బంగారంపై పెట్టుబడి పెట్టే కంటే మ్యూచ్‌వల్ ఫండ్ లో మదుపు చేయడం మంచిదన్న నిర్ణయానికి వస్తున్నారు. అందుకే గిరాకీ తగ్గలేదని వ్యాపారులు చెబుతున్నప్పటికీ, గతంతో పోలిస్తే కొంత మేర బంగారం కొనుగోళ్లు తగ్గాయనే చెప్పాలి. అందుకే ఇటీవల కాలంలో జ్యుయలరీ దుకాణాల ప్రకటనలు కూడా పెద్దగా కనిపించడం లేదని చెబుతున్నారు. అందుకు కారణం కొనుగోళ్లు తగ్గడమేనని అంటున్నారు.
భారీ పెరుగుదల...
ఈరోజు దేశంలో బంగారం ధరలు భారీగా పెరిగాయి. పది గ్రాముల బంగారం ధర పై 320 రూపాయలు పెరిగింది. వెండి ధరల్లో కూడా భారీ మార్పు కనిపించింది. కిలో వెండి ధరపై ఐదు వందల రూపాయలు పెరిగింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 58,000 రూపాయలకు చేరుకుంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 63,270 రూపాయలుగా నమోదయింది. కిలో వెండి ధర 78,000 రూపాయలుగా ఉంది.