PMSBY: కేవలం 20 ప్రీమియంతో రూ.2 లక్షల ప్రమాద బీమా.. మోడీ సర్కార్ అద్భుతమైన పథకం
మోడీ ప్రభుత్వం దేశ ప్రజల కోసం ఎన్నో రకాల పథకాలను అమలు చేస్తోంది. వివిధ రకాల ఇన్సూరెన్స్ పథకాలు, యాక్స్‌డెంట్ పథకాలను..
మోడీ ప్రభుత్వం దేశ ప్రజల కోసం ఎన్నో రకాల పథకాలను అమలు చేస్తోంది. వివిధ రకాల ఇన్సూరెన్స్ పథకాలు, యాక్స్‌డెంట్ పథకాలను అందుబాటులోకి తీసుకువస్తోంది.కుటుంబ పెద్ద ఏదైనా ప్రమాదవశాత్తు మరణించినట్లయితే ఆ కుటుంబాన్ని ఆదుకునే విధంగా రూపొందించింది కేంద్రం. మోడీ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల్లో ప్రధాన మంత్రి సురక్షా బీమా యోజన (PMSBY) అనేది ఒక సామాజిక భద్రతా పథకం.
2015 బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మూడు సామాజిక భద్రతా పథకాల్లో ఇదీ ఒకటి. ప్రధాన మంత్రి జీవన జ్యోతి బీమా యోజన (PMJJBY), అటల్ పెన్షన్ యోజన (APY)తో పాటు దీన్ని ప్రకటించారు. ఇంతకీ సురక్షా బీమా యోజన పథకం అంటే ఏమిటి? దీనికి అర్హులెవరు? పూర్తి వివరాలు తెలుసుకుందాం..
ప్రధాన మంత్రి సురక్షా బీమా యోజన అనేది ప్రమాద బీమా పథకం. ఈ పాలసీ తీసుకున్న వ్యక్తి ఏదైనా ప్రమాదవశాత్తు మరణించినా? లేక వైకల్యం పొందినా ఈ పథకం అండగా నిలుస్తుందనే చెప్పాలి. దీని కాల పరిమిది ఒక సంవత్సరం. ఏడాది తర్వాత దీనిని పునరుద్దరించుకునేందుకు అవకాశం ఉంటుందని గుర్తించుకోండి. ఈ ఏడాది మే నాటికి 34 కోట్ల కంటే ఎక్కువ మంది ఈ పథకంలో చేరినట్లు కేంద్ర నివేదికలు చెబుతున్నాయి.
ఈ పథకాలు అర్హుతలు ఏమిటి?
ఈ పథకం పొందాలంటే సుమారు 18 నుంచి 70 సంవత్సరాల మధ్య ఉండాలి. ఈ పథకంలో పొందాలంటే ఏదైనా బ్యాంకులో సేవింగ్స్ అకౌండ్ ఉండాల్సి ఉంటుందని గుర్తించుకోండి. మీకు ఒకటికంటే ఎక్కువ బ్యాంకు అకౌంట్లు ఉంటే ఏదైనా బ్యాంకు అకౌంట్ ద్వారా ఈ పథకంలో చేరవచ్చు. ఇక ఉమ్మడి ఖాతా ఉంటే కూడా వారందరు ఈ పథకంలో చేరవచ్చు. అలాగే ఎన్నారైలు కూడా ఈ స్కీమ్‌లో చేరవచ్చు. కానీ క్లెయిమ్ చేయాల్సి వచ్చిన సమయంలో లబ్ధిదారుడికి/నామినీకి భారత కరెన్సీలో చెల్లింపు చేస్తారు.
ప్రీమియం ఎంత చెల్లించాలి?
ఈ పథకం చేరిన వారు ఏడాదికి 20 రూపాయలు చెల్లించాలి. ఈ ప్రీమియం ఏడాదికి 12 రూపాయలు ఉండగా, ఇటీవల ప్రభుత్వం 20 రూపాయలకు పెంచింది. చెల్లింపులకు ఆటో డెబిట్ ఆప్షన్ ఉంటుంది. ప్రతి ఏడాది జూన్ 1వ తేదీన బ్యాంకు అకౌంట్ నుంచి డెబిట్ అవుతాయి. ఎవరైనా చందాదారుడు ఒకటి కంటే ఎక్కువ బ్యాంకు ఖాతాల ద్వారా ఈ పథకంలో చేరినట్లైతే, క్లెయిమ్ సమయంలో కేవలం ఒక బ్యాంకు ఖాతాకు మాత్రమే చెల్లిస్తారు. ప్రీమియం అనేది క్లెయిమ్ చేసిన దాని ఆధారంగా మారుతూ ఉంటుంది. అయితే, చందాదారులకు బ్యాంకులు పాలసీకి సంబంధించిన ఎలాంటి పాలసీ సర్టిఫికెట్‌ను జారీచేయవు.
కవరేజ్ ఎంత లభిస్తుంది?
ప్రధాన్ మంత్రి సురక్షా బీమా యోజన పథకం కింద చందాదారుడు ప్రమాదానికి గురై మరణించినా లేదా శాశ్వతంగా వైకల్యానికి గురైనా రూ.2 లక్షలు, పాక్షిక వైకల్యానికి గురైతే ప్రభుత్వం నుంచి రూ.1 లక్ష పరిహారం లభిస్తుంది. ఒక వేళ ఏదైనా ప్రమాదంలో రెండు కళ్లు పూర్తిగా కోల్పోయినా, రెండు చేతులు/కాళ్ళు కోల్పోయినా దానిని శాశ్వత వైకల్యంగా గుర్తిస్తారు. అదే ఒక కాలు లేదా ఒక చెయ్యి కోల్పోయి, కంటి చూపు కోల్పోయినా దానిని పాక్షిక వైకల్యంగా గుర్తిస్తారు. ఇది మెడిక్లెయిమ్ పాలసీ కాదని గుర్తించుకోండి. అందువల్ల ఈ పథకం ద్వారా మీకు ఎలాంటి ఆసుపత్రి ఖర్చులూ తిగిరి ఇవ్వవు. కేవలం ప్రమాదంలో మరణించినా లేదా శాశ్వత, పాక్షిక వైకల్యం సంభవించినప్పుడు మాత్రమే క్లెయిమ్ చేసుకునే అవకాశం ఉంటుంది.
ఇంకో విషయం ఏంటంటే ఆత్మహత్య చేసుకున్న సందర్భాల్లో ఈ పథకం వర్తించదు. ఇలాంటి సందర్భాల్లో వారి కుటుంబానికి కూడా ఎలాంటి బీమా ప్రయోజనం లభించదు. ఒకవేళ చందాదారుడు హత్యకు గురైతే మాత్రం బీమా కవరేజ్ లభిస్తుంది.
పథకంలో ఎలా చేరాలి?
ఈ పథకాన్ని ప్రభుత్వ రంగ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీలు, అలాగే బ్యాంకుల సహకారంతో ఇతర సాధారణ బీమా సంస్థల నుంచి పొందేందుకు అవకాశం ఉంది. అలాగే http://www.jansuraksha.gov.in/Forms-PMSBY.aspx ద్వారా అప్లికేషన్ ను డౌన్లోడ్ చేసుకుని, దానిని పూర్తి చేసి మీ బ్యాంకులో అందించినా సరిపోతుంది. నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా ఈ పథకంలో చేరవచ్చు.