Lemon Rates : నిమ్మకాయలు రేటు చూస్తే షాక్ తినాల్సిందే... రెండు రోజుల్లోనే ధరలు అంత పెరిగాయా?

మార్కెట్ లో నిమ్మకాయల ధరలు భారీగా పెరిగాయి. ఒక్క నిమ్మకాయ ధర పది రూపాయలుగా ఉంది

Update: 2024-03-30 12:18 GMT

నిమ్మకాయలు .. ముఖ్యంగా వేసవి కాలంలో ఎక్కువగా వినియోగిస్తారు. నిమ్మకాయను పిండి మజ్జిగలో కలిపి తాగితే చలవ చేస్తుందంటారు. అలాగే నిమ్మకాయ నీళ్లు.. నిమ్మకాయ సోడా ఇలా అనేక రకాలుగా వేసవికాలంలో నిమ్మకాయను ఎక్కువగా వినియోగిస్తుంటారు. ఎండలో బయట నుంచి తిరిగి వచ్చిన వాళ్లకు గ్లాసుడు నిమ్మకాయ నీళ్లు చల్లటివి ఇస్తే చాలు ఇక బాడీ మొత్తం కూల్ అయిపోతుంది. ఎండబెట్ట కూడా తగలదని, నిమ్మకాయను వాడాలని వైద్యులు కూడా చెబుతుంటారు.

వేసవికాలంలో...
నిమ్మకాయలో సి విటమిన్ ఎక్కువగా ఉండటంతో దీని వినియోగం కూడా ఎక్కువగా ఉంటుంది. అయితే వేసవికాలంలోనే నిమ్మకాయలు ఎక్కువగా అమ్ముడుపోవడం కూడా డిమాండ్ కు తగినట్లు సరుకు మార్కెట్ లోకి తీసుకు రావాల్సి ఉంటుంది. అయితే గత రెండు రోజుల క్రితం ఇరవై రూపాయలకు ఆరు నిమ్మకాయలు వచ్చేవి. ఇప్పుడు ఆరు నిమ్మకాయల ధర నలభై రూపాయల వరకూ పలుకుతుంది. పెద్ద సైజు నిమ్మకాయ అయితే ఒక్కొక్కటి పది రూపాయలకు వ్యాపారులు విక్రయిస్తున్నారు.
దిగుబడి తగ్గడంతో...
నిమ్మకాయలు ఎక్కువగా కర్ణాటక నుంచి హైదరాబాద్ కు వస్తాయి. ఈసారి కర్ణాటకలో నిమ్మకాయల ఉత్పత్తి తగ్గిందని చెబుతున్నారు. దాదాపు నలభై శాతం ఉత్పత్తి తగ్గింది. నెలరోజుల క్రితం మార్కెట్ లో వెయ్యి నిమ్మకాయలు రెండు వేల రూపాయలకు విక్రయిస్తే ఇప్పుడు ఏడు వేలకు చేరుకుంది. ఏపీ, తెలంగాణ, కర్ణాటకలో ఎక్కువ సాగవుతున్నప్పటికీ ఈ ఏడాది ఉత్పత్తి తగ్గడంతో నిమ్మకాయల రేటు భారీగా పెరిగిందంటున్నారు. వీటిని సూరత్ తో పాటు అహ్మదాబాద్, ఢిల్లీ, కోల్్‌కత్తా, చెన్నైల నుంచి విదేశాలకు కూడా ఎగుమతి కూడా చేస్తున్నారు. వర్షాలు లేకపోవడంతో ఈ ఏడాది నిమ్మ దిగుబడి తగ్గడంతోనే ధరలు అత్యధికంగా ఉన్నాయంటున్నారు. రానున్న కాలంలో నిమ్మకాయల ధరలు మరింత పెరిగే అవకాశముందని కూడా చెబుతున్నారు.


Tags:    

Similar News