Andhra Pradesh and Telangana : కొనే వారు లేదు.. అమ్మేవాళ్లు గోళ్లుగిల్లుకుంటున్నారు

రెండు తెలుగు రాష్ట్రాల్లో రియల్ ఎస్టేట్‌ దారుణంగా దెబ్బతినింది. ఇటు ఆంధ్రప్రదేశ్, అటు తెలంగాణలోనూ రియల్ వ్యాపారం చతికలపడిపోయింది.

Update: 2024-10-14 06:11 GMT

రెండు తెలుగు రాష్ట్రాల్లో రియల్ ఎస్టేట్‌ దారుణంగా దెబ్బతినింది. ఇటు ఆంధ్రప్రదేశ్, అటు తెలంగాణలోనూ రియల్ వ్యాపారం చతికలపడిపోయింది. అపార్ట్‌మెంట్లు కొనుగోలు చేసే వారు లేరు. అలాగే ఇళ్ల స్థలాలను కూడా కొనుగోలు చేయడానికి ముందుకు రావడం లేదు. అయితే దీనికి అనేక కారణాలు ఉన్నాయంటున్నారు. సహజంగా హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ ఎప్పుడూ పెరగడమే కాని, తగ్గడం అనేది ఉండదు. అలాగే ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా కూటమి ప్రభుత్వం ఏర్పాటు కావడంతో రాజధాని అమరావతిలో రియల్ ఎస్టేట్ వ్యాపారం విపరీతంగా జరుగుతుందని భావించారు. కానీ రెండు రాష్ట్రాల్లో పెద్దగా లావాదేవీలు జరగడకపోవడం దీనికి అద్దం పడుతుంది.

హైడ్రా దెబ్బకు...
ముఖ్యంగా తెలంగాణలోని హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ పడిపోవడానికి కారణం కూల్చేవేతలేనని చెప్పాలి. హైడ్రా సంస్థ ఏర్పాటుతో కాల్వలు, చెరువులు, నాలాలపై నిర్మాణాలను హైడ్రా తొలగిస్తుండటంతో ఫ్లాట్లను కొనుగోలు చేయడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. అన్నీ సక్రమంగానే ఉన్నప్పటకీ ఎక్కడో ఒక అనుమానం. తాము కొనుగోలు చేసిన స్థలమైనా, విల్లా అయినా, అపార్ట్‌మెంట్ అయినా ఎఫ్‌టీఎల్ లేదా బఫర్ జోన్ పరిధిలో ఉంటుందేమోనన్న భయంతో కొనుగోళ్లు నిలిచిపోయాయంటున్నారు. రిజిస్ట్రేషన్లు కూడా చాలా తక్కువగా జరుగుతున్నాయి. మామూలుగా అయితే హైదరాబాద్‌లో ఎలాంటి అవాంతరాలు వచ్చినా భూముల కొనుగోళ్లు, అమ్మకాలు నిత్యం జరుగుతుంటాయి. రిజిస్ట్రేషన్ ద్వారా సర్కార్ ఖజానాకు పెద్ద యెత్తున ఆదాయం కూడా లభిస్తుంది.
ఖాళీగా అనేక ఫ్లాట్లు...
కానీ గత కొద్ది రోజులుగా జరుగుతున్న పరిణామాలను దృష్టిలో పెట్టుకుని రియల్ వ్యాపారం మందగించిందని వ్యాపారులు చెబుతున్నారు. హైదరాబాద్ లో నిర్మించిన అనేక అపార్ట్‌మెంట్లు కొనేవారు లేక ఖాళీగా ఉన్నాయి. తక్కువ ధరకు ఇస్తామన్నా కొనడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. దీంతో తాము వడ్డీకి అప్పులు తెచ్చి అపార్ట్‌మెంట్లు నిర్మించామని, ఇప్పుడు కొనుగోలు చేసే వారు లేక పోవడంతో తీవ్ర నష్టం వాటిల్లితుందని రియల్ ఎస్టేట్ వ్యాపారులు చెబుతున్నారు. అనేక ఆఫర్లు ప్రకటిస్తున్నప్పటికీ ప్రజలు కొనుగోలుకు మొగ్గు చూపడం లేదు. కొంత కాలం ఆగిన తర్వాత కొనుగోలు చేయవచ్చన్న ధోరణిలో ప్రజలు ఉన్నారు. అలాగే అనేక ప్రాంతాల్లో ఖాళీ స్థలాలు కూడా ఉన్నాయి. వాటిని కొనుగోలు చేయడానికి కూడా ఎవరూ ముందుకు రావడం లేదు. ఒకటి ఖరీదు ఎక్కువగా ఉండటం, మరొకటి హైడ్రాతో పాటు తెలియని భయం వెంటాడటమే.
ధరలు పెంచేయడంతో...
ఆంధ్రప్రదేశ్ లోని రాజధాని అమరావతిలోనూ సేమ్ సిట్యుయేషన్ నెలకొని ఉంది. కొత్తగా ఏర్పాటయిన చంద్రబాబు ప్రభుత్వం అమరావతి నిర్మాణానికి నిధులు కేటాాయిస్తున్నా ఇక్కడ కొనేవారు లేరు. దీనికి ప్రధాన కారణం అమరావతి చుట్టు పక్కల ప్రాంతాల్లో భూముల ధరలు ఒక్కసారిగా పెంచేశారు. గత ప్రభుత్వ హయాంలో కోటి రూపాయలు ఎకరా ఉన్న భూమిని ఇప్పుడు మూడు నుంచి నాలుగు కోట్ల రూపాయలు ధర పలుకుతుండటంతో కొనుగోలు చేయడానికి జంకుతున్నారు. దీంతో పాటు మరొక అనుమానం కూడా కొనుగోలుదారులను పట్టిపీడిస్తుంది. ఈ ప్రభుత్వం మారి కొత్త ప్రభుత్వం వస్తే మన పరిస్థితి ఏంటన్న ఆలోచన కూడా వెనక్కు లాగుతుంది. వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానులంటూ ప్రతిపాదన చేయడంతోనే గతంలో ఐదేళ్లు అమరావతిలో భూముల ధరలు పడిపోయాయి. అప్పటి నుంచి కొత్త ప్రభుత్వం ఏర్పడి నాలుగు నెలలు కావస్తున్న మీడియాలో హైప్ కనిపిస్తుందని కానీ, వాస్తవానికి కొనుగోళ్లు జరగడం లేదు.
కొనుగోళ్లు జరగక...
మరొక కారణం ఇంకా రాజధాని అమరావతి నిర్మాణ పనులు ప్రారంభం కాకపోవడం. భవన నిర్మాణ రంగం పూర్తిగా దెబ్బతినింది. ఇసుక కొరత కూడా ఒక కారణమని రియల్ ఎస్టేట్ వ్యాపారులు చెబుతున్నారు. దీంతో పాటు భూములపై కొందరి నియంత్రణ ఉండటంతో కూడా కొనుగోళ్లు జరగడం లేదని చెబుతున్నారు. రియల్ ఎస్టేట్ రంగం దారుణంగా పడిపోవడానికి ప్రధాన కారణం విశ్వాసం లేకపోవడమే. ప్రభుత్వాలు మారినప్పుడల్లా విధానాలు మారడం వల్ల కూడా ఆ దెబ్బ రియల్ ఎస్టేట్ పై పడింది. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో భూములు, అపార్ట్‌మెంట్లు కొనేవారు తక్కువయ్యారు. ఒకరు అరా మాత్రం కొద్దిగారేటు తక్కువగా వస్తే కొనుగోలు చేస్తున్నారు. మరి ఎంత కాలం ఈ పరిస్థితి ఉంటుందో చెప్పలేమని, అప్పటి వరకూ తాము ఈగలు తోలుకోవడమేనంటూ రియల్ వ్యాపారులు వాపోతున్నారు. ఇలా రెండు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు మారినా రియల్ ఎస్టేట్ వ్యాపారం మాత్రం దారుణంగా పడిపోయిందన్న లెక్కలు వినపడుతున్నాయి.
Tags:    

Similar News