SBI: పాన్ లింక్ చేయకపోతే ఎస్‌బీఐ అకౌంట్ బ్లాక్ అవుతుందా?
SBI: ప్రతి రోజు ఎన్నో రకాల వార్తలు వైరల్ అవుతుంటాయి. ఏదైనా వైరల్ కావాలంటే అది సోషల్ మీడియా అని చెప్పక
SBI: ప్రతి రోజు ఎన్నో రకాల వార్తలు వైరల్ అవుతుంటాయి. ఏదైనా వైరల్ కావాలంటే అది సోషల్ మీడియా అని చెప్పక తప్పదు. నకిలీ వార్తలు కూడా సోషల్ మీడియా ద్వారానే ఎక్కువ వైరల్ అవుతుంటాయి. అలాగే ఫోన్‌లకు వచ్చే మెసేజ్‌ల ద్వారా కూడా వైరల్ అవుతుంటాయి. వాటిని నమ్మి కూడా చాలా మంది మోసపోయిన సంఘటనలున్నాయి. ఇక ఎస్‌బీఐలో అకౌంట్ ఉన్నవారు పాన్ కార్డ్‌తో లింక్ చేయకపోతే మీ అకౌంట్ బ్లాక్ చేస్తారనే వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. అయితే ఇలా వైరల్ అవుతున్న సందేశాలపై ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) తన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్‌లో ట్వీట్ చేస్తూ క్లారిటీ ఇచ్చింది.
గత కొద్ది రోజులుగా స్టేట్ బ్యాంక్ పేరుతో మోసగాళ్లు మీ ఖాతాలోని పాన్ నంబర్‌ను అప్‌డేట్ చేయకుంటే.. మెసేజ్‌లు పంపుతున్నట్లు గుర్తించామని, అవి అన్నీ కూడా నకిలీ సందేశాలేనని స్పష్టం చేసింది. అకౌంట్‌కు పాన్ లింక్ చేయకుంటే మీ ఖాతా బ్లాక్ చేయబడుతుంది. దీనితో పాటు, కాల్ లేదా ఏదైనా లింక్ ద్వారా పాన్ సమాచారాన్ని అప్‌డేట్ చేయాలని మీకు సలహా ఇస్తున్నారు. మీకు అలాంటి సందేశం వస్తే పొరపాటున కూడా నమ్మవద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఈ సందేశం పూర్తిగా నకిలీ అని స్పష్టం చేసింది.
ఎవరికైనా కాల్ చేయడం లేదా మెసేజ్ చేయడం ద్వారా వారి ఖాతా సంబంధిత సమాచారాన్ని అప్‌డేట్ చేయమని బ్యాంక్ ఎవరికీ సలహా ఇవ్వదని స్టేట్ బ్యాంక్ తన కస్టమర్లను ఎల్లప్పుడూ హెచ్చరిస్తూనే ఉంటుంది. పాన్ వివరాలను అప్‌డేట్ చేయమని బ్యాంక్ ఎలాంటి లింక్‌ను పంపదని, వాటిని నమ్మి మోసపోవద్దని పీఐబీ అధికారులు సూచిస్తున్నారు. మీరు ఇలాంటి మోసాల బారిన పడినట్లయితే సైబర్ క్రైమ్ సెల్ నంబర్ 1930లో లేదా రిపోర్ట్‌లో phishing@sbi.co ఇమెయిల్ ద్వారా అదే ఫిర్యాదు చేయవచ్చని తెలిపింది.