మాస్క్‌డ్‌ ఆధార్ కార్డ్ అంటే ఏంటి? దీని వల్ల ఉపయోగమేంటి?

ఆధార్‌ కార్డు విషయంలో కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు పలు సూచనలు, సలహాలు చేస్తుంటుంది. ఎందుకంటే ఈ మధ్య కాలంలో..

Update: 2023-09-06 07:09 GMT

ఆధార్‌ కార్డు విషయంలో కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు పలు సూచనలు, సలహాలు చేస్తుంటుంది. ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఆధార్‌కార్డు విషయంలో మోసాలు పెరిగిపోయాయి. మన ఆధార్‌ కార్డును ఇతరులు ఉపయోగించి మోసాలకు పాల్పడే అవకాశం ఉంది. అందుకే ఆధార్‌ విషయంలో జాగ్రత్తగా ఉండాలని పదేపదే హెచ్చరిస్తున్నారు. ఈ మధ్య కాలంలో ఆధార్‌ దుర్వినియోగం కేసులు పెరిగిన నేపథ్యంలో పోలీసులు కూడా పలు సూచనలు జారీ చేస్తున్నారు. ప్రజలు తమ ఆధార్ కార్డుల కాపీలను ఎవరికీ పంపకూడదని ప్రభుత్వం హెచ్చరించింది. ముఖ్యంగా ఆధార్ కార్డులను స్వీకరించడానికి లైసెన్స్ లేని సంస్థల విషయంలో చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలంటున్నారు. ఆధార్ కార్డుదారులు తమ ఒరిజినల్‌ ఆధార్‌ కార్డు కాపీకి బదులుగా మాస్క్‌డ్‌ ఆధార్ కార్డు (Masked Aadhaar Card)లను ఇవ్వాలని సూచిస్తోంది ప్రభుత్వం. మరి ఈ మాస్క్‌డ్‌ ఆధార్‌ కార్డు అంటే ఏమిటి..? దీని గురించి కొందరికి తెలిసినా.. చాలా మందికి తెలియకపోవచ్చు. ఎవరికైనా ఆధార్‌ కార్డ్ కాపీలను ఇచ్చే ముందు జాగ్రత్తగా ఉండాలని ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ హెచ్చరిస్తోంది. ఏజెన్సీలు, సంస్థలకు ఆధార్ వివరాలను అందించడానికి సురక్షితమైన మార్గం మాస్క్‌డ్‌ ఆధార్ కార్డులను అందజేయడమే ముఖ్యమని చెబుతున్నారు టెక్‌ నిపుణులు.

మాస్క్‌డ్‌ ఆధార్ కార్డ్ అంటే ఏంటి?

మాస్క్‌డ్‌ ఆధార్ కార్డ్‌ అనేది ఆధార్‌ వివరాలను పంచుకొనేందుకు సెక్యూరిటీగా ఉండేందుకు ఒక మార్గంగా చెప్పవచ్చు. డౌన్‌లోడ్ చేసిన ఇ-ఆధార్‌లో ఆధార్ నంబర్‌ను మాస్క్ చేసే అవకాశాన్నియూఐడీఏఐ ( UIDAI) కల్పించింది. మాస్క్‌డ్ ఆధార్ కార్డ్‌లో ఆధార్ నంబర్‌లోని మొదటి 8 అంకెలు కనిపించవు. మొదటి ఎనిమిది అంకెల స్థానంలో "xxxx-xxxx" ఇలా గుర్తులు ఉంటాయి. ఆధార్ నంబర్‌లోని చివరి 4 అంకెలు మాత్రమే కనిపిస్తాయి. అయితే ఈ మాస్క్‌డ్ ఆధార్ కార్డ్ ద్వారా పూర్తి ఆధార్‌ నంబర్‌ తెలుసుకునే అవకాశం ఉండదు. ఒక వేళ ఆధార్‌ వివరాలను తప్పుగా వినియోగించేందుకు ప్రయత్నించినా.. భద్రతకు ముప్పు ఏ మాత్రం ఉండదు. మాస్క్‌డ్ ఆధార్‌లో మొత్తం ఆధార్ నంబర్ ఉండకపోయినా క్యూఆర్ కోడ్‌ ఉంటుంది. క్యూఆర్‌ కోడ్‌ ద్వారా కార్డ్ హోల్డర్ డెమోగ్రాఫిక్‌ ఇన్‌ఫర్మేషన్‌, ఫోటో తెలుస్తాయి కానీ ఆధార్ నంబర్ ఎట్టి పరిస్థితుల్లో తెలిసే అవకాశం ఉండదని చెబుతున్నారు నిపుణులు.

మాస్క్‌డ్‌ ఆధార్ కార్డ్ పొందడం ఎలా..?

ఆధార్ కార్డ్ వినియోగదారులు మాస్క్‌డ్‌ ఆధార్‌ కార్డ్‌ పొందే సదుపాయం ఉంది. మాస్క్‌డ్‌ ఆధార్‌ కార్డ్‌లను ఆధార్‌ జారీ సంస్థ అయిన యూఐడీఏఐ వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. లేదా ఏదైనా ఆధార్ సెంటర్‌కు వెళ్లి కూడా ఈ పని పూర్తి చేసుకోవచ్చు. వినియోగదారులు ఏదైనా ఇతర ఐడీ స్థానంలో మాస్క్‌డ్ ఆధార్‌ను ఉపయోగించవచ్చని ప్రభుత్వం సూచిస్తోంది. రిసీవర్‌కు అవసరం లేకుంటే లేదా వినియోగదారులు కోరుకుంటే కార్డ్‌పై పుట్టిన తేదీని కూడా మాస్క్ చేసుకునే సదుపాయం కూడా ఉందని చెబుతోంది.

ఈ కార్డ్‌ను ఎక్కడెక్కడ ఉపయోగించాలి?

ఈ మాస్క్‌డ్‌ ఆధార్‌ కార్డును ఎక్కడెక్కడు ఉపయోగించాలనే సందేహం చాలా మందిలో రావచ్చు. అవేంటో తెలుసుకుందాం.. విమానాశ్రయాలు, రైళ్లలో టిక్కెట్ వెరిఫికేషన్, మొబైల్ నంబర్‌లను లింక్ చేయడం లేదా భారత్‌లోని పర్యాటక ప్రదేశాలలో కూడా ఆధార్ కార్డును ఉపయోగించవచ్చని ప్రభుత్వం తెలిపింది. మాస్క్‌డ్ ఆధార్‌ను అంగీకరించడంలో ఏజెన్సీలకు ఎలాంటి సమస్య ఉండకూడదని కూడా స్పష్టం చేసింది.

మాస్క్‌డ్‌ ఆధార్‌ని డౌన్‌లోడ్ చేయడం ఎలా..?

➦ అధికారిక UIDAI వెబ్‌సైట్‌ myaadhaar.uidai.gov.inని ఓపెన్‌ చేయాలి.

➦ అందులో కనిపించే ట్యాబ్‌లలో ‘మై ఆధార్’అనే ఆప్షన్‌పై క్లిక్‌ చేయాలి.

➦ డ్రాప్-డౌన్ మెనూలో 'డౌన్‌లోడ్ ఆధార్' సెలక్ట్‌ చేసుకోవాలి.

➦ ఆ తర్వాత 12-అంకెల ఆధార్ నంబర్ లేదా వర్చువల్ ID లేదా ఎన్‌రోల్‌మెంట్ నంబర్‌ను ఇందులో ఏదైనా నమోదు చేయాలి.

➦ ఆ తర్వాత 'మాస్క్‌డ్‌ ఆధార్' ఆప్షన్‌ ఎంపిక చేసుకోవాలి.

➦ తర్వాత క్యాప్చా కోడ్‌ని ఎంటర్‌ చేయాలి.

➦ తర్వాత అక్కడ కనిపించే డ్రాప్-డౌన్ మెనూలో 'సెండ్ OTP' క్లిక్‌ చేయాలి.

➦ ఆధార్‌కు లింక్‌ అయిన ఫోన్‌ నంబర్‌ మీ వద్ద తప్పకుండా ఉండాలి.

➦ ఫోన్‌ నంబర్‌కు OTP వస్తుంది. ఓటీపీ నమోదు చేసిన తర్వాత మాస్క్‌డ్‌ ఆధార్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

Tags:    

Similar News