కూలీ అకౌంట్లో రూ.221 కోట్లు డిపాజిట్‌.. షాకైన ఐటీ శాఖ

ఒక్కోసారి మనకు తెలియకుండానే బ్యాంకు ఖాతాల్లో ఊహించని విధంగా కోట్లాది రూపాయలు డిపాజిట్‌ అవుతుంటాయి...

Update: 2023-10-21 13:36 GMT

ఒక్కోసారి మనకు తెలియకుండానే బ్యాంకు ఖాతాల్లో ఊహించని విధంగా కోట్లాది రూపాయలు డిపాజిట్‌ అవుతుంటాయి. అప్పుడప్పుడు బ్యాంకులు చేసే పొరపాటు వల్ల ఒక అకౌంట్‌కు పంపే డబ్బు వేరొకరి అకౌంట్లోకి పంపుతుంటారు. ఉత్తరప్రదేశ్‌లోని బస్తీ జిల్లాకు చెందిన ఓ కూలీ రాత్రికి రాత్రే కోటీశ్వరుడయ్యాడు . ఏకంగా రూ.221 కోట్లు తన ఖాతాల్లో వచ్చి పడ్డాయి. అయితే అందులో ఓ ట్విస్ట్ ఉంది! అతని ఖాతాలో ఉన్న డబ్బు అతనికి ఇబ్బందుల పాలు చేసింది. చివరికి ఐటీ శాఖ నుంచి నోటీసులు అందుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. కూలీ పనులు చేసుకునే ఓ వ్యక్తి అకౌంట్లోకి ఏకంగా రూ.221 కోట్లు వచ్చా పడ్డాయి..? అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందనుకుంటున్నారా..? అప్పుడు అదే పనిలో ఉన్నారు పోలీసులు.

ఆదాయపు పన్ను శాఖ వారు ఈ డబ్బును చూసి ఆ కార్మికుడి ఇంటికి నోటీసు పంపించారు. ఉత్తరప్రదేశ్‌లోని బస్తీ జిల్లాలో ఓ కార్మికుడి ఇంటికి ఆదాయపు పన్ను నోటీసు చేరడంతో కలకలం రేగింది. శివప్రసాద్ నిషాద్ అనే వ్యక్తి ఢిల్లీలో టైల్స్ గ్రైండింగ్‌లో పని చేస్తున్నాడు. అయితే ఇటీవల అతని ఖాతాలో 221 కోట్ల రూపాయలు వచ్చాయి. దీంతో షాక్ తిన్న అతను స్వగ్రామానికి చేరుకుని పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

ఆదాయపు పన్ను శాఖ నోటీసులో శివప్రసాద్ నిషాద్ బ్యాంకు ఖాతా నుంచి రూ.221 కోట్ల లావాదేవీ జరిగినట్లు తెలుస్తోంది. ఐసీఐసీఐ బ్యాంక్‌, యాక్సిస్‌ బ్యాంకుల్లో అతని పేరు మీద ఖాతాలు తెరవడం ద్వారా రూ.221 కోట్లు జమ అయ్యాయి. బస్తీలోని బటానియా గ్రామంలోని తన ఇంటికి ఆదాయపు పన్ను నోటీసు రావడంతో ఈ విషయం అతనికి తెలిసింది. ఇండియా టుడేలో వచ్చిన కథనం ప్రకారం.. 2019లో పోయిన తన పాన్ కార్డును ఉపయోగించి ఎవరైనా తన పేరు మీద ఖాతాను తెరిచి ఉండవచ్చని శివప్రసాద్ అనుమానిస్తున్నట్లు నివేదిక పేర్కొంది.
శివప్రసాద్ తనకు తెలిసిన ఖాతాలకు సంబంధించిన సమాచారాన్ని అధికారులకు అందించారు. తన కెనరా బ్యాంక్ ఖాతాలో రూ.300 ఉన్నట్లు శివప్రసాద్ చెప్పాడు. సెంట్రల్ బ్యాంక్ లాల్‌గంజ్ శాఖలో రూ.29,898 ఉన్నట్లు, లాల్‌గంజ్ పోస్టాఫీసులో ఒక ఖాతా కూడా ఉందని అధికారులు గుర్తించారు. అందులో రెండు వేల రూపాయలు ఉన్నాయి. ఇది తప్ప అతనికి వేరే ఖాతా లేదు. ప్రస్తుతం కోట్లాది రూపాయల లావాదేవీలపై ఆదాయపు పన్ను, పోలీసు శాఖ విచారణ ప్రారంభించింది. ఏఎస్పీ దీపేంద్ర చౌదరి మాట్లాడుతూ.. కేసుకు సంబంధించిన సమాచారం అందుకున్న తర్వాత ఇంత పెద్ద మొత్తంలో బదిలీ అయిన ఖాతాలపై విచారణ జరపాలని ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. పూర్తి విచారణ జరిగిన తర్వాత అసలు విషయం బయటకు వస్తుందని అన్నారు.

Tags:    

Similar News