మళ్లీ పరుగులు పెడుతున్న ఉల్లి ధర

ధరలు పెరుగుతున్నాయి అనే మాట వినగానే సామాన్యుల గుండెలు రైళ్లు పరుగెడుతుంటాయి. మొన్నటి మొన్న టమాట ధరలు చుక్కలు చూపించగా..

Update: 2023-10-27 06:07 GMT

ధరలు పెరుగుతున్నాయి అనే మాట వినగానే సామాన్యుల గుండెలు రైళ్లు పరుగెడుతుంటాయి. మొన్నటి మొన్న టమాట ధరలు చుక్కలు చూపించగా, మళ్లీ పెరుగుదల మొదలైంది. ఇక ఉల్లి ధర కూడా అదే దారిలో వెళ్తోంది. గతంలో ఉల్లి ధర భారీగా పెరిగి సామాన్యులకు ఇబ్బందిగా మారింది. తర్వాత పరిస్థితి కొంత మెరుగుపడి ధరలు దిగి వచ్చాయి. ఇప్పుడు మళ్లీ పరుగులు పెడుతోంది. వంటకు ఉపయెగించే ఉల్లి అందరికి అవసరమైన నిత్యావసర వస్తువు. ఇది లేనిది ఏ ఇళ్లు ఉండదు. తెలుగు రాష్ట్రాల్లో ఈ ఉల్లి ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. గత కొద్ది రోజులుగా నిత్యం ఉల్లి ధరలు పెరుగుతున్నాయి. దీంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. రిటైల్ మార్కెట్లో సైజుతో పనిలేకుండా ఉల్లి పాయల ధరలు కిలో రూ.60 నుంచి రూ.86 వరకు విక్రయిస్తున్నారు. ఇక సూపర్ మార్కెట్లు, ఇతర మాల్స్ లో అయితే కిలో నికరంగా రూ.90 వరకు పలుకుతుంది. ఇక రైతు బజారులు సైతం ప్రాంతాల వారిగా ఉల్లి ధరలు ఉంటున్నాయి. వీటిలో కిలో ఉల్లి ధర రూ38 నుంచి రూ.46 వరకు పలుకుతోంది.

వినియోగదారులకు ఇక్కడ కిలో నుంచి రెండు కిలోల వరకు పరిమితంగా ఇస్తున్నారు. సాధారణ పరిస్థితుల్లో అక్టోబరు, నవంబరు నెలల నుంచి ఉల్లిధరలు పూర్తిగా వినియోగదారునికి అనుకూల రీతిలో ఉంటాయి. అయితే మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నుంచి వాతావరణ అననుకూల పరిస్థితుల కారణంగా లోడ్ దిగుబడి కాకపోవడంతో ధరలు పెరిగాయని వ్యాపారులు అంటున్నారు.

ఎకనామిక్ టైమ్స్ నివేదిక ప్రకారం.. మహారాష్ట్రలోని లాసల్‌గావ్ ఏపీఎంసీలో ఉల్లి టోకు ధర గత 15 రోజుల్లో 58 శాతం పెరిగింది. దీనికి ప్రధాన కారణం మహారాష్ట్రలో మొత్తం విత్తిన విస్తీర్ణం తగ్గడం. గత వారం రోజుల్లోనే ఉల్లి ధరలు 18 శాతం పెరిగాయి.

ఢిల్లీలో ఉల్లిపాయల రిటైల్ ధరలు 25-50 శాతం పెరిగాయి. ప్రస్తుతం ఉల్లి కిలో రూ.50-70 వరకు విక్రయిస్తున్నారు. బుధవారం ఢిల్లీతో పాటు మహారాష్ట్రలోని కొన్ని మార్కెట్లలో నాణ్యమైన ఉల్లి అత్యధికంగా కిలో రూ.50కి చేరింది. అహ్మద్‌నగర్‌లో 10 రోజుల్లో సగటు ఉల్లి ధరలు కిలో రూ.35 నుంచి రూ.45కు పెరిగాయి. అదేవిధంగా మహారాష్ట్రలోని చాలా ఉల్లిని ఉత్పత్తి చేసే జిల్లాల్లో టోకు ఉల్లి ధరలు ఇప్పుడు కిలో రూ.45 నుండి రూ.48 వరకు ఉన్నాయి.

Tags:    

Similar News