వీలునామా ఎందుకు రాయాలి? నియమాలు ఏమిటి?
నా ఆస్తిలో చిల్లిగవ్వ కూడా నీకు ఇవ్వను వెళ్లిపో.. అనే మాటలు ఎన్నో వింటుంటాము. తిరగబడ్డ తన పిల్లలతో పెద్ద ధనవంతుడు
నా ఆస్తిలో చిల్లిగవ్వ కూడా నీకు ఇవ్వను వెళ్లిపో.. అనే మాటలు ఎన్నో వింటుంటాము. తిరగబడ్డ తన పిల్లలతో పెద్ద ధనవంతుడు ఇలాంటి మాటను అనడం మీరు ఎన్నో సినిమాల్లో చూసి ఉంటారు. ఇలా ధనవంతులు మాత్రమే వారి వారసులను ఇలా అంటారని మీరు అనుకుంటున్నారా? కాదు చాలామంది తల్లిదండ్రులు ఇదే మాట తమ మాట వినని పిల్లలతో అంటుంటారు. అయితే, ఎక్కువగా డబ్బున్న వారే ఈ విషయాన్ని వీలునామాలో రాస్తారు. కానీ, మధ్య తరగతి ప్రజలు మాటలు అనడం తప్ప వీలునామా రాయడం జోలికి పోరు. ఇదిగో అలానే వీలునామా లేని కారణంగా.. వారసులు ఎవరో తెలియక మన దేశంలో ప్రస్తుతం 1,50,000 కోట్ల రూపాయల సొమ్ము క్లెయిమ్ కాకుండా పడి ఉన్నాయి. వీటిలో ఎక్కువ భాగం ఇన్సూరెన్స్ లేదా బ్యాంక్ డిపాజిట్లే. ఇంత సొమ్మును ప్రజలు మర్చిపోయారు. వీలునామా ఎందుకు రాయాలి? దానికోసం నియమాలు ఏమిటి? అలాగే వేర్వేరు ఆస్తులకు ప్రత్యేక వీలునామాలు అవసరమా? ఒకే వీలునామా సరిపోతుందా? పూర్తి వివరాలు తెలుసుకుందాం.
వీలునామా అనేది ఒక వ్యక్తి మరణించిన తర్వాత అతని ఆస్తి అతని ఇష్టానుసారంతన వారసులుగానీ, ఇతరులకు ఇచ్చేందుకు అంగికరిస్తూ రాసి ఇచ్చే చట్టపరమైన పత్రం. అయితే అతను ఎవరి పేరుపైన వీలునామా రాసి ఇచ్చాడు.. అతన మరణాంతరం ఆ ఆస్తికి వారసులుగా ఉంటారు. అంటే ఆ ఆస్తికి యజమాని అన్నట్లు. వీలునామా రాసి ఇచ్చిన వ్యక్తి మరణించిన తర్వాతనే ఆ వీలునామా అమలులోకి వస్తుంది. అటువంటి సందర్భాలలో వీలునామా రాసిన వ్యక్తి తన జీవితకాలంలో ఎప్పుడైనా రద్దు చేయవచ్చు లేదా మార్చవచ్చు. ఆస్తిని కలిగి ఉన్న వ్యక్తులు, తమ ఆస్తిని ముందుతరాలకు లేదా ఇంకేవరికైనా రాసి ఇచ్చే విధంగా ఉంటుంది. అయితే వీలునామా రాయాలన్న నిబంధన ఏమి ఉండదు. కాకపోతే వీలునామా రాయడం వల్ల భూమి, ఆస్తి పంపిణీ విషయాలలో వారసుల మధ్య వివాదాలు లేకుండా చేస్తుంది. అయితే అధికంగా ఆస్తులు ఉన్నట్లయితే ఒక వ్యక్తి ఒక్కో ఆస్తికి వేర్వేరు వీలునామాలు రాసిచ్చే సదుపాయం కూడా ఉంది.
వీలునామా అనేది ఆస్తుల విషయంలో జరిగే గొడవలను తగ్గిస్తుంది. వీలునామా రాసిన తర్వాత దానిని ఎవ్వరు కూడా ఏమి చేయలేరని గుర్తించుకోండి. విరుద్ధమైన నిబంధనలతో ప్రత్యేక వీలునామాలు, లబ్ధిదారుల మధ్య వివాదాలు, చట్టపరమైన ఇబ్బందులను కలిగించే పరిస్థితులను సృష్టించవచ్చు. అటువంటి పరిస్థితిని నివారించడానికి మీరు మీ అన్ని ఆస్తులను కవర్ చేసే ఒకే వీలునామాను రూపొందించాలి. మీ అన్ని ఆస్తులు, నగదు, నగలు, ఇతర రకాల ఆస్తుల జాబితాను సిద్ధం చేయండి. వీటన్నింటిని వీలునామాలో పేర్కొనండి. ఏ ఆస్తి ఏ వ్యక్తికి, ఏ నిష్పత్తిలో ఇస్తున్నారో పేర్కొనండి. మీకు ఏవైనా బకాయిలు ఉన్నట్లయితే వాటిని కూడా అందులో పేర్కొనడం మంచిది.
అలాగే వీలునామాపై టెస్టేటర్ అంటే వీలునామా రాసే వ్యక్తి సంతకం చేయాలి. అలాగే ఇద్దరు సాక్షులు ఉండాలి. వీలైతే సాక్షులలో ఒకరు డాక్టర్ అయి ఉండాలి. వీలునామా చేసే సమయంలో మీ మానసిక స్థితి గురించి తర్వాత తలెత్తే ఏవైనా వివాదాలను నివారించడానికి ఇది మీకు సహాయపడుతుంది. ఏదైనా ఆస్తి గొడవలు జరిగినప్పుడు వీలునామాపై సవాళ్లు కోర్టులో వినిపించవచ్చు.