అరుంధతి సినిమాను 25 సార్లకు పైగా చూసి.. ఆత్మహత్య
అతను సినిమాలకు, ముఖ్యంగా అరుంధతి సినిమాకు బానిసయ్యాడు. అతను సినిమాలోని
సినిమాలోని సన్నివేశాలు, సంఘటనలు కల్పితం అని చెబుతూ ఉంటారు. కానీ కొందరు వాటిని పట్టించుకోకుండా నమ్మేస్తూ ఉంటారు. కొన్ని సినిమాల్లో సామాజిక కోణాలు చూపిస్తూ ఉంటారు.. ఇంకొన్ని సినిమాల్లో భూతాలు, పునర్జన్మ లాంటివి చూపిస్తూ ఉంటారు. ఇక టాలీవుడ్ లో అనుష్క, సోనూసూద్ ప్రధాన పాత్రల్లో వచ్చిన సినిమా 'అరుంధతి'. ఈ సినిమా ఏ స్థాయిలో హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ట్రెండ్ సెట్టర్ గా ఈ సినిమాను చెబుతూ ఉంటారు. ఈ సినిమా పునర్జన్మల చుట్టూ తిరుగుతూ ఉంటుంది. జేజమ్మ పాత్ర పశుపతిని చంపడానికి ప్రాణత్యాగానికి పాల్పడుతుంది. అయితే ఇదంతా నిజ జీవితంలో కూడా జరుగుతుందని నమ్మేశాడు ఓ యువకుడు. అరుంధతి సినిమాను 25 సార్లకు పైగా చూసేసి ప్రాణాలను తీసుకుని కుటుంబ సభ్యులకు తీరని బాధను మిగిల్చాడు.
ఈ ఘటన కర్ణాటక రాష్ట్రంలో చోటు చేసుకుంది. తుమకూరు జిల్లా మధుగిరి సమీపంలోని ఓ గ్రామంలో చోటుచేసుకుంది. మధుగిరి సమీపంలో ఒక గ్రామానికి చెందిన రేణుకా ప్రసాద్ (23) ఇంటర్మీడియట్ పరీక్షల్లో ఫెయిల్ అయ్యాడు. తన గ్రామంలోనే ఖాళీగా ఉండేవాడు. బయటకు వెళ్లే వాడు కాదు.. ఇంట్లోనే ఉంటూ చాలా ఏళ్ల క్రితం విడుదలైన ఓ తెలుగు సినిమాను 25 సార్లు చూశాడు. అందులో ఉన్నది ఉన్నట్లుగానే తన జీవితంలో కూడా జరుగుతుందని భావించాడు. తన గ్రామశివార్లలో 20 లీటర్ల పెట్రోలును ఒంటిపై పోసుకుని ప్రాణత్యాగం చేసి మోక్షం పొందుతున్నానని చెబుతూ సెల్‌ఫోన్‌లో సెల్ఫీవీడియో తీసుకున్నాడు. తన తండ్రికి పంపించి తరువాత నిప్పంటించుకున్నాడు. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు వెంటనే యువకుడిని రక్షించి బెంగళూరులోని విక్టోరియా ఆసుపత్రిలో చేర్పించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రేణుకా ప్రసాద్ మరణించినట్లు వైద్యులు తెలిపారు.
విక్టోరియా ఆసుపత్రిలో 60 శాతం కాలిన గాయాలతో మృతి చెందాడు. "అతను సినిమాలకు, ముఖ్యంగా అరుంధతి సినిమాకు బానిసయ్యాడు. అతను సినిమాలోని పాత్రలను అనుకరించేవాడు. అతను ఫస్ట్ పీయూలో ఫెయిల్ అయిన తర్వాత, అతను పల్లెటూరికి వచ్చి ఖాళీగా ఉన్నాడు. అతను 'అరుంధతి' సినిమాని చాలాసార్లు చూశాడు," అని రేణుకా ప్రసాద్ బంధువు రాజు అన్నారు. కొడిగెనహళ్లి పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఇంత పెద్ద మొత్తంలో పెట్రోలు ఎలా తెచ్చుకున్నాడన్న కోణంలో కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు.