ఆరుగురి ప్రాణం తీసిన దోమల చక్రం
రాత్రి సమయంలో తలుపులు, కిటీలు అన్నింటినీ మూసివేసి మస్కిట్ కాయిల్స్ ను వెలిగించారు. ఇంట్లో ఉన్న పరుపుపై ఆ కాయిల్..
దోమల బెడద తట్టుకోలేక చాలా మంది దోమల చక్రాలు (మస్కిటో కాయిల్స్), ఎలక్ట్రిక్ మెషీన్లు వాడుతుంటారు. అలా ఓ కుటుంబం దోమల బెడద తట్టుకోలేక వెలిగించిన దోమల చక్రం వారి పాలిట శాపమైంది. దాని నుంచి వెలువడిన పొగ పీల్చి ఆరుగురు మరణించగా.. మరో ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటన దేశరాజధాని ఢిల్లీలోని శాస్త్రి పార్క్ ఏరియాలో జరిగింది.
శాస్త్రినగర్ ఏరియాలో నివాసం ఉంటోన్న ఓ కుటుంబం బారెడు పొద్దెక్కినా ఇంట్లో నుంచి బయటకు రాలేదు. దానికి తోడు ఇంట్లో నుంచి పొగలు వస్తుండటంతో స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు అక్కడికి చేరుకుని తలుపులు పగులగొట్టి చూడగా.. అందరూ స్పృహలేకుండా పడి ఉన్నారు. వెంటనే వారిని ఆస్పత్రికి తరలించగా.. వారిలో ఆరుగురు చనిపోయినట్లు వైద్యులు ధృవీకరించారు. మరో ఇద్దరు కాలి గాయాలతో చికిత్స పొందుతున్నారు.
రాత్రి సమయంలో తలుపులు, కిటీలు అన్నింటినీ మూసివేసి మస్కిట్ కాయిల్స్ ను వెలిగించారు. ఇంట్లో ఉన్న పరుపుపై ఆ కాయిల్ పడటంతో మంటలు చెలరేగాయి. ఈ కారణంగా వెలువడిన కార్బన్ మోనాక్సైడ్ వాయువుని వారంతా పీల్చడంతో చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. మృతుల్లో నలుగురు పురుషులు, మహిళ, చిన్నారి ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.