ఢిల్లీ టీనేజర్ హత్యకేసులో షాకింగ్ నిజాలు
హత్యానంతరం పరారైన నిందితుడు సాహిల్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే.. యువతి సాహిల్ కు బ్రేకప్ చెప్పడం వల్లే..
ఢిల్లీలో టీనేజ్ యువతిని ఆమె బాయ్ ఫ్రెండ్ 21 సార్లు కత్తితో పొడిచి, బండరాయితో పలుమార్లు మోదీ చంపిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. శ్రద్ధావాకర్ హత్యోదంతం తర్వాత.. ఈ కేసు ఆ స్థాయిలో కలకలం రేపింది. హత్యానంతరం పరారైన నిందితుడు సాహిల్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే.. యువతి సాహిల్ కు బ్రేకప్ చెప్పడం వల్లే కోపోద్రిక్తుడైన అతడు.. ఆమెను అతి దారుణంగా హత్యచేసి ఉంటాడని పోలీసులు ప్రాథమిక నిర్థారణకు వచ్చారు. ఈ హత్యకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డవ్వగా.. తాజాగా ఆ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
నిందితుడు సాహిల్ - మృతురాలు 2021 నుంచి రిలేషన్ షిప్ లో ఉన్నారని పోలీసులు వెల్లడించారు. కొన్ని కారణాల వల్ల యువతి సాహిల్ తో రిలేషన్ ను తెంచుకోవాలని నిర్ణయించుకుందని, ఆమె హత్యకు గురవ్వడానికి ఒకరోజు ముందే వారిద్దరి మధ్య మాటలు పూర్తిగా నిలిచిపోయాయని పేర్కొన్నారు. బ్రేకప్ వద్దని, మళ్లీ ఒకటిగా ఉందామని సాహిల్ ఆమెను పదే పదే కోరినా.. అందుకు ఆమె ససేమిరా అనడంతోనే సాహిల్ సైకోలా మారి ఆమెను హత్యచేశాడని వివరించారు. ప్రియురాలిని చంపానన్న పశ్చాత్తాపం అతనిలో ఏమాత్రం కనిపించలేదన్నారు. నిందితుడు ఎలక్ట్రీషియన్ అని పోలీసులు తెలిపారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని బులంద్‌షహర్‌లో తన బంధువు ఇంట్లో దాక్కున్న అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.