సరూర్ నగర్ అప్సర హత్య కేసులో ట్విస్టులు

జూన్ 3వ తేదీన అప్సరను ఎయిర్ పోర్ట్ కు వెళ్లేందుకు తానే కారెక్కించినట్లు సాయికృష్ణ శంషాబాద్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్..

Update: 2023-06-09 07:30 GMT

apsara murder case, venkata saikrishna

తన మేనకోడలు అప్సర కనిపించడం లేదంటూ మేనమామ వెంకట సాయికృష్ణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు.. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. అప్సర కోసం గాలిస్తున్న పోలీసులు.. సాయికృష్ణ-అప్సర ల కాల్ డేటా ఆధారంగా.. సాయికృష్ణే అప్సరను మాయం చేశాడని నిర్థారణకు వచ్చారు. సరూర్ నగర్ మ్యాన్ హోల్ లో అప్సర మృతదేహం ఉన్నట్లు గుర్తించారు. మేనమామగా చెప్పుకున్న అయ్యంగారి వెంకట సాయికృష్ణే అప్సరను చంపేసి, సరూర్ నగర్ లో అతను అర్చకుడిగా పనిచేసే ఆలయానికి సమీపంలోనే అప్సరను ఓ మ్యాన్ హోల్ లో పడేసినట్లు పోలీసులు తెలిపారు. అప్సరను పడేసిన మ్యాన్ హోల్ ను తవ్వి మృతదేహాన్ని తీసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

కాగా.. జూన్ 3వ తేదీన అప్సరను ఎయిర్ పోర్ట్ కు వెళ్లేందుకు తానే కారెక్కించినట్లు సాయికృష్ణ శంషాబాద్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాడు. స్నేహితులతో భద్రాచలం వెళ్తానన్న అప్సర ఆ తర్వాత మిస్సైందని తెలిపాడు. జూన్ 5వ తేదీన సాయికృష్ణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. సాయికృష్ణపై అనుమానంతో అతని ఇల్లు, పనిచేసే ఆలయం వద్ద సీసీ టీవీ ఫుటేజీలను పరిశీలించారు. అతను చెప్పేవాటికి, చేసే పనులకు సంబంధం లేకపోవడంతో.. అతడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా.. నేరాన్ని అంగీకరించాడు. పోలీసులు చెబుతున్న వివరాలను బట్టి.. సాయికృష్ణ - అప్సర కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. తనను పెళ్లి చేసుకోవాలని అప్సర ఒత్తిడి చేయడంతోనే అతను అప్సరను బండరాయితో మోది చంపి, మ్యాన్ హోల్ లో పడేశాడు. కాగా.. సాయికృష్ణను ఇప్పటికే పెళ్లై నాలుగేళ్ల కూతురు కూడా ఉంది.
సాయికృష్ణ అప్సరను హత్య చేయడంపై.. అతని తండ్రి స్పందించారు. ఆ అమ్మాయి ఎవరో తమకు తెలియదని, కంప్లైంటి ఇచ్చేటపుడు మేనకోడలు అని ఎందుకు చెప్పాడో తమకు తెలీదన్నారు. అప్సరను అప్పుడపుడు గుడిలో మాత్రమే చూశానని, ఆమెకు మానసిక సమస్యలు ఏవో ఉన్నట్లు తెలిసిందన్నారు. అప్సర తమ చుట్టం కాదని స్పష్టం చేశారు. బహుశా వాళ్లిద్దరూ స్నేహితులై ఉండొచ్చన్నారు. ఆమె చెన్నై నుంచి వచ్చిందన్నారు. తన కొడుకు ఆమెను చంపేందుకు ప్రేరేపించిన అంశాలేంటో పోలీసులే తేల్చాలన్నారు. ఏదేమైనా ఒక అమ్మాయిని చంపడం నేరమేనన్న ఆయన.. చట్టం ఏ శిక్ష విధించినా అనుభవించాల్సిందేనని పేర్కొన్నారు. కాగా.. సాయికృష్ణ కుటుంబం నివాసం ఉంటున్న కాలనీలో అప్సర కూడా ఉంటున్నట్లు తెలుస్తోంది.


Tags:    

Similar News