చనిపోయాడనుకున్న వ్యక్తి బతికొచ్చాడు.. మళ్ళీ పెళ్లి చేశారు
ఖతిమా పట్టణంలోని శ్రీపూర్ బిచ్వాకు చెందిన నవీన్ చంద్ర భట్ ఒక సంవత్సరం కిందట
చనిపోయాడని అనుకున్న వ్యక్తి ఒక్కసారిగా కనిపిస్తే.. అతడికి అంతిమ సంస్కారాలు నిర్వహించిన కుటుంబ సభ్యులకు అతడు ఎదురైతే!! ఒంట్లో వణుకు పుట్టడం ఖాయం. అలాంటి ఘటనే ఉత్తరాఖండ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. ఉధమ్ సింగ్ నగర్ జిల్లాకు చెందిన 42 ఏళ్ల వ్యక్తి చనిపోయాడని భావించారు.. అయితే ఆ తరువాత అతడు సజీవంగా ఉన్నాడని కనుగొన్నారు.
ఖతిమా పట్టణంలోని శ్రీపూర్ బిచ్వాకు చెందిన నవీన్ చంద్ర భట్ ఒక సంవత్సరం కిందట ఇంటి నుండి తప్పిపోయాడని పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. అతను నవంబర్ 25 న చనిపోయాడని కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. నవీన్ మృతదేహానికి కుటుంబ సభ్యులు అనుకోకుండా అంతిమ సంస్కారాలు కూడా నిర్వహించారు. అయితే అతడు చనిపోలేదని.. తర్వాత తెలిసింది. దీంతో ఇప్పటికే అంతిమ సంస్కారాలు నిర్వహించాం కదా.. ఆ వ్యక్తి బతికే ఉన్నాడు.. ఇప్పుడు ఎలా అని సందేహాలు నెలకొన్నాయి. దీంతో ఆ ఊరి పెద్దలు, పూజారులు ఏకగ్రీవంగా పుట్టినప్పటి నుండి వివాహం వరకు అన్ని ఆచారాలు మళ్లీ నిర్వహించాలని నిర్ణయించారు. ఇంతకు ముందు అతడికి పెళ్లి అయి.. ఇద్దరు పిల్లలు ఉండగా.. ఆ మహిళకే మళ్లీ ఇచ్చి పెళ్లి చేశారు. వేనవీన్ చనిపోయినట్లు భావించి.. మరణానంతర కర్మలు అప్పటికే చేశామని పూజారి చెప్పుకొచ్చారు. కాబట్టి అతని పునర్జన్మను పరిగణనలోకి తీసుకుని అన్ని పవిత్ర కర్మలు మళ్లీ నిర్వహించవలసి వచ్చిందన్నారు. ఆసక్తికరంగా అతడికి నామకరణ కార్యక్రమం కూడా చేసేశారు.. నవీన్ ఇప్పుడు నారాయణ్ భట్ అట. ఏది ఏమైనా ఈ విచిత్ర ఘటన గురించి ప్రజలు పలు రకాలుగా చర్చించుకుంటూ ఉన్నారు.