ఆపరేషన్ ధూల్‌పేట్” తో గంజాయి మాఫియాకు కళ్లెం – 250 రోజుల్లో వంద కేసులు
250 రోజుల్లో 102 కేసులు, 401 కేజీల గంజాయి సీజ్; మాఫియా అంతరించేదాకా ఆపరేషన్ కొనసాగుతుందని ఎక్సైజ్ శాఖ స్పష్టం.;

హైదరాబాద్ ధూల్‌పేట్ ప్రాంతంలో గంజాయి వ్యాపార నిర్మూలన కోసం ప్రవేశపెట్టిన ‘‘ఆపరేషన్ ధూల్‌పేట్’’ విజయవంతంగా 250 రోజులు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ప్రొహిబిషన్, ఎక్సైజ్ శాఖ అధికారుల నివేదిక ప్రకారం, ఇప్పటివరకు మొత్తం 102 కేసులు నమోదు కాగా, 425 మందిపై కేసులు నమోదు చేశారు. వీరిలో 327 మందిని అరెస్టు చేసి రిమాండ్‌కు పంపగా, 85 మంది ఇంకా పరారీలో ఉన్నారు.
దాడులలో మొత్తం 401 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అదనంగా, 147 మొబైళ్లను, 58 ద్విచక్రవాహనాలను, 2 కార్లను అధికారులు సీజ్ చేశారు. ఒకరిపై పీడీ యాక్ట్ కింద కేసు నమోదు చేయడం జరిగింది. మాఫియా డాన్ల సహా ఒరిస్సా నుంచి సరఫరా చేసే అంతర్‌రాష్ట్ర గంజాయి నెట్‌వర్క్‌ను అధికారులు గుర్తించి చర్యలు తీసుకున్నారు.
గంజాయి అమ్మకాలు గతంలో ధూల్‌పేట్‌లోనే 90 శాతం వరకు జరిగేవి. ఆపరేషన్ ధూల్‌పేట్ ప్రారంభమైన తర్వాత పరిస్థితిలో రూపమైన మార్పు వచ్చింది. ఈ దాడులతో గంజాయి అమ్మకాలు భారీగా తగ్గిపోయాయి. మిగిలిన 10 శాతాన్ని కూడా నిర్మూలించేందుకు ఎక్సైజ్ శాఖ ప్రత్యేక టీములు అన్ని ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహిస్తున్నాయి.
పురాతనకాలంలో మద్యప్రదేశ్ నుంచి వచ్చిన సామాజిక వర్గం ధూల్‌పేట్‌లో స్థిరపడి మొదట్లో నాటుసారా తయారీలో నిమగ్నమై ఉండేది. ప్రభుత్వ కఠిన చర్యలతో వారు దానిని మానేసి గంజాయి వ్యాపారాన్ని కొనసాగిస్తున్నట్టు వెల్లడైంది. ఈ నేపథ్యంలో గంజాయి అమ్మకాలను నిర్మూలించేందుకు ప్రభుత్వం ఉక్కు పాదం మోపింది.
‘‘గంజాయి అమ్మకాలు పూర్తిగా అంతరించేవరకు ఆపరేషన్ కొనసాగుతుంది. హైదరాబాద్‌లోని జీహెచ్‌ఎంసీ పరిధిలోని ఇతర ప్రాంతాలకు కూడా విస్తరించి మాఫియాను వేరు చేస్తాం’’ అని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ వి.బి. కమలాసన్ రెడ్డి (ఐపీఎస్) స్పష్టం చేశారు.